బండి సంజయ్ సంచలన కామెంట్స్.. అధికారంలోకి వస్తే

Update: 2021-09-08 09:30 GMT
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికలో తాము అధికారంలో వస్తే మొదటగా యూపీలో మాదిరిగా, తెలంగాణలోనూ జనాభా నియంత్రణ చట్టం తీసుకువస్తామని ప్రకటించారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సంగారెడ్డి మీదుగా సాగుతోంది. ఈ సందర్భంగా సంగారెడ్డిలో ప్రసంగించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ విరుద్దమైన ముస్లిం రేజర్వేషన్ల వల్ల బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందకుండా పోతున్నాయని, బీసీ లు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

ఓ వర్గం జనాభా విపరీతంగా పెరిగిపోవడం వలన బడుగు బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగా జనాభా నియంత్రణ చట్టం తీసుకువచ్చే ఆలోచన చేస్తామని ప్రకటించారు. ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు.. అనే నినాదంతో ముందుకెళ్తామన్నారు. మతపరమైన రిజర్వేషన్ల బిల్లును పంపించారు, దాని సంగతి ఏమైందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను సంజయ్ ప్రశ్నించారు.

ఎంఐఎం వాళ్ళు పోటీ చేయడం కోసమే అసెంబ్లీలో బిల్లు తీసుకురావాలని అనుకున్నారని వ్యాఖ్యానించారు. దమ్ముంటే ముస్లిం రిజర్వేషన్ బిల్లు పెట్టాలని ముఖ్యమంత్రికి సంజయ్ సవాల్ విసిరారు. జీహెచ్ ఎం సీ ఎన్నికల్లో ఎంఐఎం మీద పోటీ చేసే ధైర్యం లేదని, బీసీలకు అన్యాయం చేస్తున్న ఎంఐఎం ను టీఆర్ ఎస్ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కు కేంద్ర నాయకత్వం మద్దతు పూర్తిగా ఉందన్న బండి సంజయ్.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి పొర్లు దండాలు పెట్టడం మాని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు టీఆర్ ఎస్ హామీలనే గుర్తుచేస్తున్నారని తెలిపారు.

తెలంగాణ వచ్చిన తర్వాత విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదని ముఖ్యమంత్రిని సంజయ్ ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిర్మల్‌ లో బీజేపీ నిర్వహించబోయే సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు నిర్మల్‌ కు రావాలని పిలుపునిచ్చారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర యాత్ర స్టార్ట్ చేస్తే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపిపంచారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉద్యోగాలు నోటిఫికేషన్ లు ఇస్తామని చెబుతున్నారు తప్ప.. ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు బండి సంజయ్. కానిస్టేబుల్స్ కి జీతాలు ఇవ్వకుండా, పుస్తకాలు ఇచ్చి చందాలు వసూలు చేసుకోమంటున్నారని అన్నారు. సంజయ్ చేసేది పాదయాత్ర కాదని, కేసీఆర్ మీద చేసే దండయాత్ర అని పాదయాత్రలో పాల్గొన్న బీజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వి సూర్య కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు.




Tags:    

Similar News