బంగ్లా లక్ష్యం 513.. నాలుగేళ్ల తర్వాత పుజారా సెంచరీ.. అదీ వేగంగా

Update: 2022-12-16 12:30 GMT
వన్ డౌన్ బ్యాట్స్ మన్ అతడు.. పెద్ద జట్టుకు ప్రాతినిధ్యం.. కానీనాలుగేళ్లుగా సెంచరీనే లేదు. మధ్యలో ఓసారి వేటు కూడా పడింది. మళ్లీ శ్రమించి స్థానం పొందాడు. అయినా అతడిపై ఎన్నో విమర్శలు.. స్ట్రయిక్ రేట్ మరీ తక్కువని నిందలు.. కుర్రాళ్లు దూసుకొస్తుండగా.. ఇంగ్లండ్ లాంటి జట్టు ఒక్క రోజులో 500 కొడుతుండగా.. మరీ ఇలాంటి నిదానమైన బ్యాట్స్ మన అవసరమా? అని ప్రశ్నలు.. కానీ, అతడు వాటన్నిటినీ భరించాడు. దెబ్బలు తింటూనే నిలిచాడు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ సెంచరీ కొట్టాడు.

అతడే టీమిండియా టెస్టు స్పెషలిస్ట్, నయా వాల్ చతేశ్వర్ పుజారా.స్ట్రయిక్ రేట్ 78 పుజారాను టెస్టులకు పరిమితం చేయడం సమంజసమా? అంటే.. కెరీర్ తొలినాళ్లలోనే అతడు ఆటను మార్చుకుంటే ఈ ప్రశ్న తలెత్తకపో్యేది. కానీ, పుజారా తన శైలికే కట్టుబడడంతో ఆఖరికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ చోటు దక్కకుండా పోయింది.

అయితే, కొన్నాళ్లుగా టెస్టుల్లోనూ పుజారా స్ట్రయిక్ రేట్ పై విమర్శలు వస్తున్నాయి. టెస్టులు ఆడే తీరు కూడా మారిందని.. వేగం పెరిగిందని..అలాంటి దగ్గర పుజారాను ఆడించాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. కానీ, టీమిండియా మేనేజ్ మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది.

బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో పుజారా తొలి ఇన్నింగ్స్ లో జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ లో కేవలం 130 బంతుల్లోనే 102 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లున్నాయి. స్ట్రయిక్ రేట్ 78 కావడం విశేషం. అయితే, తొలి ఇన్నింగ్స్ లో పుజారా 203 బంతులాడి 90 పరుగులు చేశాడు. వీటిలో 11 ఫోర్లున్నాయి. 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన క్లిష్ట పరిస్థితుల్లో పుజారా ఇన్నింగ్స్ కు వెలకట్టలేం.

గిల్ కూడా శతకం కొట్టాడు బంగ్లాదేశ్ తో టెస్టులో మరో రెండు కీలక అంశాలు టెస్టుల్లో ఓపెనర్ అవకాశం దక్కించుకుంటూ విఫలమవుతున్న శుబ్ మన్ గిల్ తొలి సెంచరీ అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో కుదురుకుని మరీ ఔటైన గిల్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పొరపాటు చేయలేదు. 150 బంతులాడిన అతడు పది ఫోర్లు, 3 సిక్స్ లతో 110 పరుగులు చేశాడు. రెండేళ్ల కిందట టెస్టు అరంగేట్రం చేసిన గిల్.. తొలిసారిగా మూడంకెల స్కోరు అందుకున్నాడు.

అయితే, కెప్టెన్ కేఎల్ రాహుల్ (23) మళ్లీ విఫలమయ్యాడు. విరాట్ కోహ్లి (19 నాటౌట్), పుజారా ఇద్దరూ కలిసి భారత్ ఆధిక్యాన్ని 500 దాటించారు. 513 లక్ష్యం నిర్దేశించాక కెప్టెన్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News