టీఆర్ ఎస్ ఆఫీసులోకి బతుకమ్మ చీరలు.?

Update: 2018-10-28 10:23 GMT
ప్రతీ దసరా పండుగకు పంపిణీ చేసే బతుకమ్మ చీరలకు ఈసారి ఈసీ మోకాలడ్డిన సంగతి తెలిసిందే.. తెలంగాణ రాష్ట్రసమితికి లబ్ధి చేకూర్చే ఈ చీరల పంపిణీని ఈ ఎన్నికల సమయంలో నిలుపుదల చేయాలని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ కోసమని ఇప్పటికే రూ.280 కోట్ల వ్యయంతో 80 రకాలైన 95 లక్షల చీరలను సిద్ధం చేయించింది. పంపిణీ చేయడానికి రెడీ అవుతుండగా ఎన్నికల కోడ్ రావడంతో బ్రేక్ పడింది.

సిరిసిల్ల నేతన్నలు నేచిన ఈ చీరలకు ఈసీ అడ్డుపుల్ల వేయడంతో పంపిణీ నిలిచిపోయింది. వీటిని ఎన్నికలు పూర్తయ్యాక పంపిణీ చేసేలా గిడ్డంగులు, గోదాంలల్లో నిల్వ చేశారు. కానీ తాజాగా ఖమ్మం జిల్లాలో బతుకమ్మ చీరలతో నిండిన ఓ లారీ పోలీసుల తనిఖీల్లో బయటపడడం కలకలం రేపింది.  వీటిని పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఈ చీరలను టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు తీసుకెళ్లి పంపిణీ చేయడానికి ప్రయత్నించారని పోలీసుల విచారణలో తేలింది.

ఇలా బతుకమ్మ చీరలను అక్రమంగా పంపిణీ చేయడానికి తెరతీయడం అధికార దుర్వినియోగం.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ ఆస్తులను దొంగిలించే ప్రయత్నం టీఆర్ఎస్ చేసిందని మండిపడుతున్నారు.  ప్రభుత్వం తయారు చేయించిన చీరలు టీఆర్ఎస్ నేతల చేతుల్లోకి ఎలా వచ్చాయో విచారణ జరపాలని ఎన్నికల కమిషన్ ను కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.

Tags:    

Similar News