బీ అలెర్టు.. చాప కింద నీరులా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయ్

Update: 2022-06-04 03:04 GMT
గడిచిన కొంతకాలంగా దేశంలో పత్తా లేకుండా పోయిన కరోనా.. మళ్లీ తాను ఉన్నానన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. తన స్పీడ్ ను షురూ చేసింది. గడిచిన కొంతకాలంగా చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే కరోనా కేసులు నమోదు అయ్యేవి. అందుకు భిన్నంగా గడిచిన వారంగా ఈ కేసుల పెరుగుదల విషయంలోకాస్త తేడా వచ్చినట్లు చెబుతున్నారు.

ఎప్పుడైతే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ అన్న విషయం బయటకు వచ్చిందో.. అందరూ ఒక్కసారి ఉలిక్కిపడే పరిస్థితి. కట్ చేస్తే.. తాజాగా ఆమె కుమార్తె ప్రియాంక వాద్రాకు కూడా పాజిటివ్ అని తేలింది. తల్లికిదగ్గరగా ఉన్న కారణంగా ఆమెకు పాజిటివ్ తప్పలేదన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కేసుల సంఖ్యను చూసినప్పుడు.. గడిచిన వారంలో తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. దేశంలో వారం వ్యవధిలోనే కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని గుర్తించారు.

ఇదే విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ వెల్లడించారు. ఆయన దేశంలోని వివిధ రాష్ట్రాలను అలెర్టు చేస్తూ లేఖలు రాయటం గమనార్హం.

దాదాపు మూడు నెలల తర్వాత దేశంలో ఒక్క రోజులో 4 వేల పాజిటివ్ కేసులు శుక్రవారం నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో (శుక్రవారం) దేశ వ్యాప్తంగా 4041 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. పది మంది మరణించినట్లుగా తేల్చారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా ముంబయి.. చెన్నై లాంటి మెట్రో నగరాల్లోనే నమోదవుతున్నట్లుగా గర్తించారు. ఇదిలా ఉంటే తెలంగాణలో పాజిటివ్ రేటు స్వల్పంగా పెరిగింది.

వారం వ్యవధిలో దేశ వ్యాప్తంగా 21,055 కేసులు నమోదు అయితే అందులో తెలంగాణ రాష్ట్రంలో 375 కేసులు నమోదైనట్లుగా చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రజలు అట్టే భయపడకున్నా.. కాసింత జాగ్రత్తలతో ఉంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక.. తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజులో 49కేసులు నమోదు అయ్యాయి.తెలంగాణతో పోలిస్తే ఏపీలో కేసుల సంఖ్య తక్కువనే మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News