జైట్లీ బ‌డ్జెట్‌..మ‌న‌కిన్ని లాభాలు ఇస్తుంద‌ట‌

Update: 2018-01-09 13:06 GMT
2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను వచ్చే నెల పార్లమెంట్‌లో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేప‌థ్యంలో బ‌డ్జెట్‌పై అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. ఆర్థిక శాఖ వ‌ర‌గ్ఆల నుంచి సేక‌రిస్తున్న స‌మాచారంతో...ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనుండటంతో ఈసారి బడ్జెట్‌ లో మధ్యతరగతి ప్రజల మనస్సును గెలుచుకునే రీతిలో పద్దు కూర్పు ఉండనుందనే అంచనాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 20 ఏళ్ళకు పైగా అధికారంలో ఉన్న గుజరాత్‌ లో బీజేపీ బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి రావడం - గ్రామాల్లో వ్యవసాయ సంక్షోభం - నిరుద్యోగ సమస్య - తయారీ రంగం - సేద్యపు రంగాల్లో ఉత్పత్తులు మందగించడం వంటికారణాల వల్ల వచ్చే బడ్జెట్‌ అన్ని వర్గాలకూ అనుకూలంగా ఉండేట్టు ఆర్థిక మంత్రి రూపొందించవచ్చున‌ని విశ్లేషిస్తున్నారు.

పెద్ద నోట్ల రద్దు - వస్తు - సేవల పన్ను (జీఎస్టీ) అమలుపై సామాన్యుల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టేలా మరిన్ని వస్తువులను జీఎస్టీలోని గరిష్ఠ శ్లాబు నుంచి కనిష్ఠ శ్లాబుల్లోకి తీసుకొచ్చే వీలుందని కూడా సదరు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే 200లకుపైగా వస్తువులను 28 శాతం పన్ను నుంచి తక్కువ పన్ను రేట్లలోకి మార్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం 5,000 మదుపరులను బాధిస్తున్నా.. 5 కోట్ల కుటుంబాలకు  ప్రయోజనం చేకూరుస్తున్నదని ప్రభుత్వ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇకపోతే మ్యూచువల్ ఫండ్లు - స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపై పెద్ద ఎత్తున ప్రతిఫలాలు అందుతుండటంతో అంతకంటే తక్కువ లాభాలనిస్తున్న బ్యాంక్ డిపాజిట్లకు దూరమవుతున్న డిపాజిటర్లను ఆకర్షించేలా అధిక వడ్డీరేట్లను ప్రకటించే వీలుందని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి. నిజానికి కొన్ని సంస్కరణలు ప్రజానీకాన్ని - ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేయడంతో - వాటి లక్ష్యాలను మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం సవరించుకుంటున్నది.

నకిలీ కరెన్సీ - నల్లధనం నిర్మూలన కోసం పాత రూ. 500 - 1,000 నోట్లను 2016 నవంబర్‌ లో రద్దు చేసిన మోడీ సర్కారు.. వాటి స్థానంలో కొత్త రూ.500 - 2,000 కరెన్సీని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. అయితే నగదు కొరత ఏర్పడటంతో డిజిటల్ లావాదేవీల పల్లవిని ఎత్తుకోగా, అదికూడా విఫలం కావడంతో మళ్లీ చలామణిలోకి నోట్ల ప్రవాహాన్ని పెంచింది. అలాగే ఖజానాపై రాయితీల భారాన్ని తగ్గించుకునేలా వంటగ్యాస్ ధరలను దశలవారీగా పెంచాలని నిర్ణయించినప్పటికీ - ఇప్పుడు ఆ విషయంలో వెనుకకు తగ్గింది. జీఎస్టీలోనూ ఆయా వస్తువులపై పన్నుల రేట్లను తగ్గిస్తూ వస్తున్నది. దీనంతటికీ కారణం 2019 ఎన్నికలు దగ్గర పడుతుండటమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న ప్రయోజనాలు ప్రధానంగా రెండేనని - అవి పిల్లల చదువు - తమ ఆరోగ్య ఖర్చులేనని నిపుణులు పేర్కొంటున్నారు. విద్య - వైద్యం దగ్గర ఖర్చుకు వెనుకాడలేకపోతుండటాన్ని కార్పొరేట్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, దీనివల్ల నేడు ప్రైవేట్ స్కూళ్లలో నర్సరీ - ఎల్‌ కేజీ - యూకేజీ వంటి ప్రారంభ స్థాయి విద్యను కూడా మధ్యతరగతి వర్గాలు పొందలేకపోతున్నాయని అంటున్నారు. పిల్లల వయసు పెరిగినకొద్దీ - చదువులు భారమైపోతుండటంపై బెంగ పెట్టుకుంటున్నారని చెబుతున్నారు. మరోవైపు కార్పొరేట్ వైద్యం కూడా అందని ద్రాక్షగానే మారిందని, కాబట్టి ఈ రెండింటి వ్యయాన్ని తగ్గించగలిగితే మధ్యతరగతి వర్గాలకు ఇంతకంటే కావాల్సిందేమీ ఉండదని మెజారిటీ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రాబోయే బ‌డ్జెట్‌ లో ప్ర‌ధానంగా ఈ చాన్స్ ద‌క్క‌నుంది

-ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపు

-మరింతగా ఆరోగ్య బీమా ప్రయోజనాలు

-ఫిక్స్‌ డ్ డిపాజిట్లు - పెట్టుబడులపై ప్రోత్సాహకాలు

-ప్రామాణిక పన్ను దాఖలులో ఊరట

-ఇంకా తగ్గనున్న జీఎస్టీ భారం

-పొదుపు సంబంధిత పథకాలపై ఎక్కువ ప్రతిఫలం
Tags:    

Similar News