ఆకలని ఏడుస్తుంటే ఐస్ క్రీం అందిస్తున్నారు

Update: 2016-08-08 00:30 GMT
 ఏపీకి ప్రత్యేక హోదా రాదని దాదాపుగా తేలిపోయింది.. ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఖాయమని అర్థమవుతోంది. అయితే.. ఆ ప్యాకేజీ ఏ స్థాయిలో ఉంటుంది.. దాని వల్ల ప్రయోజనం ఎంత? అది పారదర్శకమైన ప్యాకేజీయేనా అన్నదే తెలియాల్సి ఉంది. కేంద్రం వైఖరి తెల్సినవారు.. మోడీ మాయ - ఆర్థిక మంత్రి జైట్లీ అయిష్టత అర్థమైనవారు ప్యాకేజీలోనూ అన్యాయం తప్పదని అంటున్నారు. ప్యాకేజీ పేరుతో భారీ ప్రకటన ఉంటుందని భావిస్తున్న తరుణంలో అందులో ఏముంటుందన్న ఆసక్తి అందరిలో నెలకొంటోంది. అయితే... విశ్లేషకులు మాత్రం ఏపీకి న్యాయంగా కేంద్రం నుంచి రావాల్సినవాటితో పాటు అదనంగా పరిమిత ప్రయోజనాలే అందుతాయని అంటున్నారు.

` ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెబుతూ, విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాభివృద్ధికి అదనపు ఆర్థిక సహాయంతో తోడ్పడతామని హామీ ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్యాకేజీ దిశగా కసరత్తు చేస్తోందని ఢిల్లీ వర్గాలు సూచిస్తున్నాయి. ప్రత్యేక హోదా హామీని అమలు చేసేందుకు రాజ్యాంగ నిబంధనలు అడ్డుగా నిలుస్తున్నాయనే సాకు చెబుతున్న కేంద్రం మిత్రపక్షం అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి అదనపు సహాయంగా ప్యాకేజీ ప్రకటించే ప్రక్రియ ఊపందుకుంది. దీనిపై ఆర్థిక శాఖ వర్గాలు పని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఏపీకి చెందిన సీనియర్‌ బీజేపీ లీడర్ - కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు.. ఆర్థిక మంత్రి జైట్లీ ఈ ప్యాకేజీ రూపకల్పన కసరత్తులో పాలు పంచుకొన్నట్లు సమాచారం.  అయితే.. ఈ ప్యాకేజీ చూడ్డానికే భారీగా ఉంటుందని.. వాస్తవ ప్రయోజనాలు అంతంతేనని అంటున్నారు. ప్రత్యేక హోదాకు ఇది సాటిరాదని కూడా చెబుతున్నారు.

కేంద్రం సాయం చేసే స్థితిలో ఉన్నా సాయం చేయడం లేదన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. గతంలో మోడీ చేసిన ప్రకటనలు - తీసుకున్న నిర్ణయాలు చూస్తే అది అక్షర సత్యమని అర్థమవుతోంది. కేంద్రంలో తమతో కలిసి ప్రభుత్వంలో ఉంటూ.. ఏపీలో తమను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంచిన మిత్ర పక్షం తెలుగుదేశం కంటే ఇతరులకే కేంద్రం ప్రాధాన్యం ఇస్తోంది. మోడీ విదేశీ పర్యటనల సమయంలో కొన్ని దేశాలకు భారీ ఆర్థిక ఆసరా.. ప్యాకేజీలు ప్రకటించారు. నేపాల్ కు భూకంప సమయంలో భారీ సహాయం చేశారు.

ప్రధాని సహాయాలు ఇలా..

- నేపాల్ భూకంపం తరువాత ఆ దేశం మళ్లీ కోలుకునేందుకు మోడీ 1 బిలియన్ డాలర్లు.. అంటే 100 కోట్ల డాలర్లు సహాయం ప్రకటించారు. ఇవి కాకుండా అప్పటికే మరో 100 కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక ఆసరా విధానాలను నేపాల్ విషయంలో ఇండియా అమలు చేస్తోంది.

- బంగ్లాదేశ్ కు కూడా మోడీ 200 కోట్ల డాలర్ల సహాయం చేశారు. ఒక విదేశానికి భారత్ ఒకేసారి చేసిన అత్యధిక సహాయం ఇదే.

- అంతకుముందు మంగోలియా వెళ్లినప్పుడు ఆ దేశానికి కూడా 100 కోట్ల డాలర్ల సహాయం ప్రకటించారు మోడీ.

- వియత్నాంకు కూడా మోడీ 10 కోట్ల డాలర్లు సహాయం చేశారు.

- భూటాన్ - మయన్మార్ తదితర దేశాలకూ మోడీ భారీ సహాయం చేశారు.

అంతేకాదు... బీహార్ ఎన్నికల ముందు ఆయన చేసిన ప్రకటన అయితే దేశ రాజకీయవర్గాలను షాక్ కు గురిచేసింది. బీజేపీని గెలిపిస్తే లక్షా 25 వేల కోట్లు బీహార్ కు ఇస్తామని ఆయన చెప్పారు. అయతే... బీహార్లో బీజేపీ అధికారంలోకి రాలేకపోవడంతో అది ఆగిపోయింది.

.. ఇలా మోడీ ఎక్కడకు వెళ్తే అక్కడ భారీగా సహాయాలు ప్రకటిస్తున్నా ఏపీకి మాత్రం తీరని అన్యాయం చేస్తూనే వచ్చారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చి తన స్వహస్తాలతో శంకుస్థాపన చేసిన మోడీ మనకు కేవలం కలశం నిండుగా మట్టి - నీరు ఇచ్చి సరిపెట్టేశారు. దీంతో అయినవారికి ఆకుల్లో కాని వారిని కంచాల్లో అన్నట్లుగా ఉన్న మోడీ విధానంపై ఇప్పుడు కూడా ఎవరికీ నమ్మకం కలగడం లేదు.

మన వెనుకబడిన ప్రాంతాలకు చిల్లర దులిపారు..

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఏపీలోని 7 వెనుకబడిన జిల్లాలకు భారీగా సహాయం చేస్తామని మోడీ గతంలో ప్రకటించారు. చెప్పినట్లే కొంత సహాయం చేశారు. కానీ.. అది చిల్లర విసిరినట్లే ఉంది తప్ప ఆ జిల్లాల అభివృద్ధికి ఎంతమాత్రం పనికొచ్చేలా లేదు. ఏడు జిల్లాలకు కలిపి కేవలం 350 కోట్లే ఇచ్చారు. అంటే ఒక్కో జిల్లాకు 50 కోట్లు మాత్రమే. దీంతో పాటు కేంద్రం పోలవరం ప్రాజెక్టు కోసం 300 కోట్లు ఇచ్చింది. కొత్త రాష్ట్రం కావడంతో రాజ్ భవన్ - ఇతర మౌలిక వసతులకు 1500 కోట్లు ఇచ్చింది. రెవెన్యూ లోటు కింద కొంత భారం భరించింది.

ఇక కరవు సహాయం మూడు రాష్ట్రాలకు 2500 కోట్లు ప్రకటించినప్పుడు కూడా ఏపీకి అన్యాయమే జరిగింది. ఒడిశాకు 800 కోట్లు, ఉత్తర్ ప్రదేశ్ కు 1350 కోట్లు ఇచ్చిన కేంద్రం ఏపీకి 433 కోట్లే ఇచ్చింది. ఇలా ప్రతి సందర్భంలోనూ విభజన కారణంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేకంగా ఆదుకునే ప్రయత్నమేమీ చేయలేదు. మరోవైపు ప్రత్యేక ప్యాకేజీల కింద మధ్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ రీజియన్... ఒడిశాలోని కేబీకే జిల్లాలకు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నారు.

ప్రత్యేక హోదాతోనే ప్రయోజనం..

ప్రత్యేక కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు జరిగే కేంద్ర ప్రాయోజిత సంక్షేమ పథకాలకయ్యే వ్యయంలో 90శాతాన్ని కేంద్ర ప్రభుత్వం - పది శాతాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అభివృద్ధి ప్రాజెక్టులలో కూడా రుణాల తిరిగి చెల్లింపు బాధ్యత 90:10 నిష్పత్తిలోనే ఉంటుంది.  

- పధ్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సులతో మొత్తం కేంద్ర పన్నుల ఆదాయంలో ముఫ్ఫై శాతాన్ని ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పంపిణీ చేసి మిగిలిన మొత్తాన్ని మాత్రమే ఆయా రాష్ట్రాల జనాభా ప్రాతిపదికగా పంపిణీ చేసే విధానానికి స్వస్తి పలికినప్పటికీ కేంద్ర ప్రాయోజిత పథకాలు - విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టుల వ్యయంలో మాత్రమే కాకుండా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయయించి అందించే ప్రత్యేక కేంద్ర సహాయం - అదనపు కేంద్ర సహాయం  కూడా ఉంటుంది.

- ఎక్సయిజ్ - కస్టమ్స్ సుంకాలు - ఆదాయ - కార్పొరేట్ పన్నుల రేట్లలో తగ్గింపు వంటి ప్రయోజనాలూ ఉంటాయి.

-  ఇవి కాకుండా పరిశ్రమలకు పన్ను రాయితీలు - ప్రోత్సాహాల కారణంగా భారీగా పారిశ్రామికీకరణ జరుగుతుంది. పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటై ఉత్పాదకత పెరిగి స్టేట్ జీడీపీ పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజలకు మేలు జరుగుతుంది.

..కానీ, ప్రత్యేక ప్యాకేజీతో కేవలం ఎంపిక చేసిన ప్రాజెక్టులు - ప్రాంతాలకు మాత్రమే పరిమిత ప్రయోజనం కలుగుతుంది. అది కూడా కేంద్రం నిధులు ప్రకటించినా విడుదల చేసినప్పు మాత్రమే సాధ్యమవుతుంది. ఇలా ఏరకంగా చూసకున్నా ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ అనేది ఏ రకంగానూ ఏపీకి మేలు చేయదు.

అడ్డంకులేమిటి..?

ఇతర రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడుగుతున్నాయన్నది కేంద్రం మాట. ఇందులో కొంత నిజం కూడా ఉంది. బీహార్ - ఒడిశా - రాజస్థాన్ - ఛత్తీస్ గఢ్ - జార్ఖండ్ లు ప్రత్యేక హోదా అడుగుతున్నాయి. అయితే.. వీటిలో ఒడిశా - బీహార్ లు మాత్రమే మనలాగానే కేంద్రాన్ని గట్టిగా అడుగుతున్నాయి. అయితే... ఇవేవీ కూడా ఏపీకి ఇవ్వొద్దని చెప్పడం లేదు.

- ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఈ కారణం కంటే మరో కారణం ప్రధాన అడ్డంకిగా మారుతోంది. ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు - సంస్థల ఏర్పాటు పెరుగుతుంది. దానివల్ల ఇక్కడ ప్రోత్సాహకాలు - పన్ను మినహాయింపుల కోసం ఇతర రాష్ట్రాల్లోని పరిశ్రమల యూనిట్లు - సంస్థలు ఇక్కడకు తరలి వస్తాయి. అది ఆ రాష్ట్రాలకు నష్టం. ముఖ్యంగా కర్ణాటక - తమిళనాడు వంటి సమీప రాష్ట్రాలు.. మహారాష్ట్ర - గుజరాత్ - పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి కూడా ఆటోమొబైల్ - సాఫ్టువేర్ సంస్థలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తాయి. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం దాన్ని కోరుకోదు. ఇది ప్రధానమైన అడ్డంకిగా మారుతోంది. ఇలాంటి కారణాల వల్ల కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఎంతమాత్రం సుముఖంగా లేదు. ప్యాకేజీతోనే సరిపెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ప్యాకేజీలో ప్రకటించిన మొత్తం ఎలాంటి కోతలు - ఆలస్యం లేకుండా నిధులు విడుదల చేస్తే కొంతలో కొంత నయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆకలితో అలమటిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా అనేది బలవర్ధక పోషకాహారం అయితే ప్యాకేజీ అనేది కేవలం నోటికి రుచిగా ఉండి కడుపు నింపే ఫాస్టు ఫుడ్ మాత్రమే.

- గరుడ
Tags:    

Similar News