భారత్‌లో ఉద్యోగులు పనిచేయడానికి అత్యుత్తమ కంపెనీ ఇదే!

Update: 2022-11-07 05:12 GMT
అపర కుబేరుడు ముకేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో రికార్డు సృష్టించింది. భారత్‌లో ఉద్యోగులు పనిచేయడానికి అత్యుత్తమ సంస్థగా రిలయన్స్‌ నిలవడం విశేషం. ఇప్పటికే ఆదాయాలు, లాభాలు, మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద సంస్థగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఉన్న సంగతి తెలిసిందే.

ఫోర్బ్స్‌ వరల్డ్స్‌ బెస్ట్‌ ఎంప్లాయర్స్‌ ర్యాంకింగ్స్‌ 2022 ప్రకారం.. ఉద్యోగులు పనిచేయడానికి అత్యుత్తమ సంస్థగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిలిచింది. అదేవిధంగా ప్రపంచంలో 20వ స్థానం దక్కించుకుంది. ప్రపంచ స్థాయిలో ఉద్యోగులు పనిచేయడానికి ఉత్తమ కంపెనీగా ఒక భారత కంపెనీ ఈ ర్యాంకులో నిలవడం ఇదే మొదటిసారి.

మొత్తం 800 కంపెనీలతో ఫోర్బ్స్‌ ఈ జాబితా రూపొందించింది. 57 దేశాల నుంచి 1,50,000 మంది పూర్తి స్థాయి, తాత్కాలిక ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారు.

ఈ సర్వేలో ఉద్యోగులు పనిచేయడానికి అత్యుత్తమ సంస్థగా ప్రపంచ స్థాయిలో దక్షిణ  కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ నెంబర్‌వన్‌ స్థానాన్ని దక్కించుకుంది.

ఇక ఉద్యోగులు పనిచేయడానికి అత్యుత్తమ కంపెనీల్లో రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్, మూడో స్థానంలో ఐబీఎం, నాలుగో స్థానంలో ఆల్ఫాబెట్‌ (గూగుల్‌), ఐదో స్థానంలో యాపిల్‌ నిలిచాయి. అమెరికా కంపెనీలే రెండు నుంచి పన్నెండు ర్యాంకుల్లో నిలవడం విశేషం.

జర్మనీ వాహన దిగ్గజం బీఎండబ్ల్యూ గ్రూప్‌ 13వ స్థానంలో ఉంది. ఇ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 14, ఫ్రాన్స్‌ సంస్థ డెకాథ్లాన్‌ 15వ స్థానాలను దక్కించుకున్నాయి. జర్మనీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్, అమెరికా పానీయాల సంస్థ కోకకోలా, జపాన్‌ వాహన దిగ్గజాలు.. హోండా, యమహా, సౌదీ చమురు సంస్థ అరామ్‌కో వంటి సంస్థల కంటే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అత్యుత్తమ స్థానంలో నిలవడం గమనార్హం.

ఫోర్బ్స్‌ జాబితాలో మన దేశం నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (137వ స్థానం), బజాజ్‌ (173), ఆదిత్య బిర్లా గ్రూప్‌ (240), హీరో మోటోకార్ప్‌ (333), ఎల్‌ అండ్‌ టీ (354), ఐసీఐసీఐ బ్యాంక్‌ (365), హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ (455), ఎస్‌బీఐ (499), అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (547), ఇన్ఫోసిస్‌ (668) చోటు దక్కించుకున్నాయి.

కోవిడ్‌ తర్వాత అధిక వేతనాలు, మెరుగైన ప్రయోజనాలు, అవకాశాలు, పని–జీవన సమతౌల్యతకు ఉద్యోగులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఫోర్బ్స్‌ నివేదిక వెల్లడించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News