భోగాపురం ఎయిర్‌ పోర్ట్ వెన‌క్కుపోయిన‌ట్లేన‌ట‌

Update: 2016-12-26 06:06 GMT
ఆంధ్రప్ర‌దేశ్‌ లో అత్యంత వివాదాస్ప‌దంగా మారిన భోగాపురం ఎయిర్‌ పోర్ట్ భూసేక‌ర‌ణ నిలిచిపోయే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సు ఆధారంగా 2015 ఆగస్టులో ఇచ్చిన భోగాపురం భూసేకరణ నోటిఫికేషన్‌ చెల్లదంటూ రైతులు న్యాయపోరాటం చేస్తున్న నేపథ్యం - రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన త‌ప్పిదాల కార‌ణంగా సదరు నోటిఫికేషన్‌ రద్దయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భోగాపురం ఎయిర్‌ పోర్టు కోసం సామాజిక ప్రభావ మదింపు (ఎస్‌ ఐఎ) సర్వే చేపట్టకుండానే ప్రభుత్వం భూసేకరణ తలపెట్టింది. పైగా ఎస్‌ ఐఎ సర్వే పూర్తి చేశామని హైకోర్టుకు నివేదించింది. కలెక్టర్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ చెల్లదని హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై ఇప్పటికీ ప్రభుత్వం అపీల్‌ చేయలేదు.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో రైతుల భూముల జోలికి ప్రభుత్వం వెళ్లలేని పరిస్థితి ఉంది. అదే స‌మ‌యంలో రైతులు న్యాయపోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్‌ పోర్టు నోటిఫికేషన్‌ రద్దయ్యే అవకాశాలున్నట్లు విశ్లేషకుల అంచనా. ప్రభుత్వం మాత్రం అన్ని పనులూ చట్టపరంగా చేస్తున్నామంటూ మొండిగా ముందుకు సాగిపోతోంది. ఎయిర్‌ పోర్టు నిర్మాణానికి తొలుత 15 వేల ఎకరాలు అవసరమని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. రైతుల వ్యతిరేకతతో 2004 ఎకరాలు ఎయిర్‌ పోర్టు నిర్మాణానికి - మరో 600 ఎకరాలు వాణిజ్య సముదాయాల ఏర్పాటుకు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణకు ఇప్పటివరకూ రూ.300 కోట్లను రైతులకు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 400 ఎకరాలు సేకరించాల్సి ఉందని అంటున్నారు. వీరంతా పెద్ద రైతులు కావడం-న్యాయ పోరాటం చేస్తుండటంతో భూసేకరణ పూర్తి స్థాయిలో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభుత్వం భూమి సేకరించినట్లు చెప్తున్నదానిలో వాస్తవం లేదన్నది రైతుల వాదన. ఎన్విరాన్‌ మెంట్‌ ఇంఫాక్టు ఎసెస్‌ మెంట్‌ (ఇఎస్‌ ఎ)ను వచ్చే జనవరి 10 - 11 తేదీల్లో జరపనున్నట్లు అధికారులు చెబుతున్నారు. భోగాపురానికి దాపునే విశాఖ ఎయిర్‌ పోర్టు ఫీజిబులిటీ కాదని పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు బిడ్డర్లు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News