అఖిల పంచాయితీ!..బాబే చేస్తార‌ట‌!

Update: 2019-01-09 16:45 GMT
ఏపీ మంత్రి అఖిల‌ప్రియ మ‌రోమారు టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు బోనులో విచార‌ణ‌కు నిల‌బ‌డాల్సిందేన‌ట‌. త‌న అనుచ‌రుల ఇళ్ల‌ల్లో పోలీసుల త‌నీఖీల‌కు నిర‌స‌న‌గా మంత్రి హోదాలో ఉన్న అఖిల ముందూ వెనుకా చూసుకోకుండా త‌న గ‌న్‌మెన్‌ను ప్ర‌భుత్వానికి స‌రెండ‌ర్ చేశారు. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే పోలీసు ఉన్న‌తాధికారులు - టీడీపీ పెద్ద‌లు స‌ర్దిచెప్పేందుకు య‌త్నించినా కూడా అఖిల గ‌న్‌ మెన్‌ ను తీసుకునేందుకు స‌సేమిరా అన్న విష‌యం తెలిసిందే. గ‌న్‌ మెన్‌ తో పాటుగా గ్రామాల్లో ప‌ర్య‌టించేట‌ప్పుడు సివిల్ పోలీసుల భ‌ద్ర‌త కూడా అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పేశారు. ఈ విష‌యం అధిష్ఠానం దృష్టికి వెళ్లినా కూడా అటు అఖిల గానీ - ఇటు అధిష్ఠానం గానీ దీనిపై గుంభ‌నంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు తప్పించి ఎవ‌రూ నోరు విప్ప‌డం లేదు. దీనిపై నేడు క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన హోం మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ డిప్యూటీ సీఎం నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప స్పందించేశారు.

అస‌లు అఖిల‌ప్రియ చేసింది త‌ప్పేన‌ని ఆయ‌న అక్క‌డిక‌క్క‌డే తేల్చేశారు. అంతేకాకుండా ఓ మంత్రిగా ఉండి అఖిల గ‌న్‌ మెన్‌ ను తిర‌స్క‌రించ‌డ‌మేమిట‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. పోలీసులు సాధార‌ణ త‌నిఖీల్లో భాగంగానే అఖిల అనుచ‌రుల ఇళ్ల‌ల్లోనూ సోదాలు చేశార‌ని - దీనికే అంత రాద్ధాంతం చేస్తే ఎలాగ‌ని కూడా ఆయ‌న అఖిల‌ను ఆమె సొంత జిల్లాలోనే నిల‌దీసినంత ప‌నిచేశారు. కేబినెట్ లో ఓ మంత్రిగా ఉన్న అఖిల‌... ప్రభుత్వంలో తాను భాగ‌స్వామిన‌న్న విష‌యాన్ని మ‌రిచిపోతే ఎలాగంటూ కూడా హోం మంత్రి త‌న‌దైన శైలిలో ప్ర‌శ్నించారు. అయినా ఓ మంత్రి ఇలాకాలో ఏకంగా మంత్రి అనుచ‌రుల ఇళ్ల‌ల్లోనే పోలీసులు త‌నిఖీలు చేశారంటే... ఆ విష‌యం పోలీసు ఉన్న‌తాధికారుల‌కు గానీ - హోం మంత్రిగా ఉన్న చిన‌రాజ‌ప్ప‌కు గానీ - కేబినెట్ బాస్‌ గా ఉన్న సీఎం చంద్ర‌బాబు గానీ తెలియ‌కుండానే చేశారా? అన్న ప్ర‌శ్న‌కు అంద‌రూ తేలు కుట్టిన దొంగ‌ల్లానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు త‌ప్పించి... ఏ ఒక్క‌రూ దీనిపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం లేదు.

ఇదే విష‌యాన్నే కాస్తంత సీరియ‌స్‌ గా తీసుకున్న అఖిల‌... త‌న నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తూ గ‌న్‌ మెన్‌ ను తిప్పిపంపార‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్ప‌టిదాకా చంద్ర‌బాబు స్పందించ‌కున్నా.. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై పూర్తి స్థాయి వివ‌రాలు తెప్పించుకున్న‌ట్లుగా చిన‌రాజ‌ప్ప ప‌రోక్షంగా చెప్పేశారు. అఖిల పంచాయితీ చంద్ర‌బాబే చేస్తార‌ని, త్వ‌ర‌లోనే ఆమెకు బాబు నుంచి పిలుపు రానుంద‌న్న‌ట్లుగా ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇప్ప‌టికే ఏవీ సుబ్బారెడ్డితో వివాదం నేప‌థ్యంలో ప‌లుమార్లు సీఎం వ‌ద్ద పంచాయితీకి వెళ్లిన అఖిల‌... ఇప్పుడు మ‌రోమారు బాబు వ‌ద్ద పంచాయితీకి వెళ్లాల్సిందేనన్న మాట‌. మ‌రి ఈ సారి పంచాయితీలో అఖిల ఎలా నెట్టుకువస్తుంద‌న్న విష‌యంపై క‌ర్నూలు తెలుగు త‌మ్ముళ్లు ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు.


Full View

Tags:    

Similar News