ఆయన మరో తలసాని కానున్నారా?

Update: 2016-03-09 06:59 GMT
ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేను మరో పార్టీలోకి వెళ్లటం మహా పాపంగా భావించే రోజులు పోయి చాలానే రోజులే అయ్యింది.  ఇదెంత వరకూ వచ్చిందంటే.. ఎలాంటి మొహమాటం లేకుండానే ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేను ఏకంగా మంత్రిగా చేసే వరకూ వెళ్లింది. తెలుగు రాష్ట్రాలకు ఈ సరికొత్త అనుభవాన్ని కలిగించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది.

సనత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తమ పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్.. ఆయనకు ఏకంగా మంత్రి పదవిని కట్టబెట్టేశారు. ఈ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే.. రాజకీయాల్లో అభిప్రాయాలు మారటానికి అట్టే కాలం పట్టదన్న దానికి తగ్గట్లే తాజాగా చంద్రబాబు.. కేసీఆర్ బాటలోనే నడవనున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

తలసాని వ్యవహారాన్ని తీవ్రంగా తప్పు పట్టిన చంద్రబాబు.. మరికొద్ది రోజుల్లో తాను కూడా అదే విధానాన్ని అమలు చేయనున్నారా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి సైకిల్ ఎక్కేసిన కర్నూలు జిల్లా నేత భూమానాగిరెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టేందుకు బాబు రెఢీ అవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దీనికి తగ్గట్లే తాజాగా భూమా చేసిన వ్యాఖ్య ఉండటం గమనార్హం. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన భూమాను మీడియా సభ్యులు కొందరు మాట్లాడుతూ.. పార్టీ మారారు సరే.. మంత్రిగా ఎప్పుడు బాధ్యతలు చేపడతారు? అన్న ప్రశ్న వేసిన వెంటనే.. ఆ ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నా అంటూ తడుముకోకుండా మాట్లాడిన భూమా.. తన దగ్గర సమాధానం లేదని బదులిచ్చారు. కాకుంటే భూమా ఉత్సాహం చూసినప్పుడు మాత్రం ఆయన మరో తలసానిగా మారే ఛాన్స్ కనిపిస్తుందన్న మాట బలంగా వినిపిస్తుంది. మరి.. అదెంత వరకూ నిజం అవుతుందన్నది కాలమే చెప్పాలి.
Tags:    

Similar News