ఈజిప్ట్ మ‌మ్మీ..కాంగ్రెస్ పార్టీ ఒక‌టే

Update: 2017-07-03 11:48 GMT
రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో భాగంగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌ కు ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన‌ వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇవ్వాలంటూ ఏపీపీసీసీ అధ్య‌క్షుడు రఘువీరారెడ్డి రాసిన లేఖ‌పై వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి మండిప‌డ్డారు. టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబుతో చేతులు కలిపి వైఎస్‌ జగన్‌ ను అక్రమంగా - అన్యాయంగా జైలుకు పంపించిన కాంగ్రెస్‌ పార్టీ త‌మ‌ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపమని లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి 10 సంవత్సరాలు దేశాన్ని పాలించే అవకాశం ఇచ్చిన మహానేత వైఎస్‌ ఆర్‌ తనయుడు అని కూడా చూడ‌కుండా సోనియాను దిక్కరించాడనే నెపంతో అభియోగాలు మోపి జైలుకు పంపించిన నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీదని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం కంకణబద్ధుడై రణరంగ క్షేత్రంలోకి దిగినప్పుడు సోనియాగాంధీ లాంటి రాక్షసి వైఎస్‌ జగన్‌ పై చేసిన కుట్రలు ఎవరూ మర్చిపోలేదని ఆయ‌న చెప్పారు.

హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌ లోని వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో భూమన కరుణాకర్‌ రెడ్డి మాట్లాడుతూ త‌మ మాట విన‌లేద‌నే కార‌ణంగా వైఎస్‌ ఆర్‌ అనే పేరును పలకకుండా చేసిన ఘ‌న‌త సోనియాగాంధీద‌ని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీతో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కలవదని భూమన స్పష్టం చేశారు. వైఎస్‌ ఆర్‌ ఆశయాలకు తూట్లు పొడిచి గత 8 ఏళ్లుగా సోనియాగాంధీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నేత‌లు ప‌నిచేస్తున్నార‌ని మండిప‌డ్డారు. వైఎస్‌ ఆర్‌ తనయుడిని దుర్మార్గంగా చిత్రీకరించిన సోనియగాంధీని, వారితో మిలాకత్‌ అయిన చంద్రబాబును ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరని హెచ్చరించారు. రాష్ట్రంలో చంద్రబాబు పార్టీ ఎంతో.. మీరు అంతేనని ధ్వజమెత్తారు. ఈజిఫ్టు మమ్మికి ఏ స్థాయి ఉందో.. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా అదే స్థానం ఉందన్నారు. వైఎస్‌ ఆర్‌ సీపీకి సలహా ఇచ్చే స్థాయి కాంగ్రెస్‌కు లేదని స్పష్టం చేశారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి అనే ముఖ్యమంత్రి పాలన చంద్రబాబు చలువ వలన బతికిందనే విష‌యం ఈ క్ర‌మంలో రెండు పార్టీ నైతిక‌త అంద‌రికీ గుర్తుంద‌న్నారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీయే ప్రభుత్వానికి వైఎస్‌ ఆర్‌ సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని భూమ‌న స్ప‌ష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడగొట్టొదంటూ వైఎస్‌ ఆర్‌ సీపీ పోరాటాలు చేస్తే లోక్‌సభ స్పీకర్‌ గా ఉన్న మీరాకుమార్‌ తలుపులు మూసి మీకు బలం లేకపోయినా బిల్లు పాస్‌ చేసింది మీకు గుర్తుకు లేదా అని కాంగ్రెస్‌ నేతల‌ను భూమ‌న ప్రశ్నించారు. రాష్ట్ర విభజనలో ప్రధాన భూమిక పోషించిన అభ్యర్థిని ప్రకటించి ఆవిడకు మద్దతు ఇవ్వాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా ప్రధానమంత్రి ప్రమాణం చేసి ప్రకటించిన ప్ర‌త్యేక హోదా కోసం ఈ మూడు సంవత్సరాలుగా వైఎస్‌ ఆర్‌ సీపీ హోదా కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News