దీపావళి రోజు పెట్రోలింగ్ చేస్తావా? అంటూ ఏఎస్ఐను తాళ్లతో కట్టేసి కొట్టారు

Update: 2021-11-08 05:13 GMT
తప్పు చేసినోళ్లు పోలీసు అయినా సామాన్యుడైనా జనాగ్రహానికి గురైతే ఎలాంటి పరిస్తితులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ.. ఎలాంటి తప్పు చేయకున్నా.. తన విధి నిర్వహణ మాత్రమే చేసిన వారు సైతం బాధితులుగా మారటం.. ప్రజల చేతిలో దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఉంటుందా? అంటే నో అనేస్తారు. కానీ.. ఆ మాట అనే ముందు.. తాజాగా బిహార్ లో జరిగిన దారుణం గురించి తెలిస్తే మాత్రం.. మీ సమాధానం పైన చెప్పిన రీతిలో ఉండదని మాత్రం చెప్పొచ్చు. అసలేం జరిగిందంటే..

బిహార్ లోని చంపారన్ జిల్లాలోని మోతిహరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా.. అందులో ఉన్న సున్నితమైన కంటెంట్ కారణంగా దాన్ని ఈ కథనానికి జోడించటంలేదన్న విషయాన్ని గుర్తించాలి. దీపావళి పండుగ రోజున ధరమ్ పుర్ గ్రామంలో గొడవ జరుగుతుందన్న సమాచారం పోలీసులకు అందింది.

దీంతో.. ఏఎస్ఐ సీతారాం దాస్ హుటాహుటిన గొడవ జరిగిన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ గొడవకు కారణమైన వారు ఏఎస్ఐ రావటంతో మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమలో తాము గొడవ పడుతుంటే పోలీసులకు ఎందుకన్న మాటతో పాటు.. దీపావళి పండుగ రోజున పోలీసులు పెట్రోలింగ్ ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తూ.. ఆయనపై దాడికి పాల్పడ్డారు.

వినరాని బూతుల్ని తిట్టేస్తూ.. సదరు ఏఎస్ఐ చేతుల్ని.. కాళ్లను తాళ్లతో కట్టేసి మరీ చితకబాదేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.దీంతో.. జరిగిన దారుణం బయటకు వచ్చింది. ఈ వీడియోను చూసిన పోలీసులు కోపంతో ఉన్నారు. పోలీసు అధికారి మీద దాడి చేసిన నిందితుల్ని గుర్తించి.. వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. దాడికి పాల్పడిన యువకులు మాత్రం కనిపించకుండా పోయారు. అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు.




Tags:    

Similar News