అమెరికాపై ఆశ‌లు పెట్టుకోవ‌డం ఇక లాభం లేదు!

Update: 2017-03-04 08:26 GMT
వ‌లస‌ల చ‌ట్టాల‌కు స‌వ‌ర‌ణ‌లు చేసి అమెరికా సంస్థ‌ల్లోని ఉద్యోగాల‌న్నింటినీ అమెరిక‌న్ల‌నే అందిస్తామంటూ కాస్తంత సూటిగానే ఘాటు ప్ర‌క‌ట‌న చేసిన ఆ దేశ  కొత్త అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌... ఇప్పుడు మ‌రో అస్త్రం బ‌య‌ట‌కు తీశారు. త‌న దేశ నిరుద్యోగుల‌కు వ‌రమిచ్చేందుకు ఈ ద‌ఫా ఆయ‌న ఏకంగా విప‌క్షానికి చెందిన స‌భ్యుల మ‌ద్ద‌తును కూడా కూడ‌గ‌ట్టేశారు. అదేనండి... త‌న పాచిక‌కు ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకూడ‌ని భావించిన ఆయ‌న త‌న పార్టీ రిప‌బ్లిక‌న్ పార్టీకి చెందిన ఓ స‌భ్యుడితో పాటు త‌నకు విప‌క్షంగా ఉన్న డెమోక్ర‌టిక్ పార్టీకి చెందిన మ‌రో స‌భ్యుడిని రంగంలోకి దించేసి మ‌న‌కు చుక్క‌లు చూపించేందుకు రంగమంతా సిద్ధం చేసేశారు. ట్రంప్ ప్ర‌యోగించ‌డానికి సిద్ధ‌మైన ఈ దెబ్బ ప్ర‌ధానంగా మ‌న‌కు మాత్ర‌మే  భారీగా త‌గ‌ల‌నుంద‌ట‌. ఇక పిలిప్పీన్స్ వంటి ఔట్ సోర్సింగ్ సేవ‌ల‌కు కేంద్రంగా కేంద్రాలుగా ఉన్న నాలుగైదు దేశాల‌కు కూడా ఈ దెబ్బ భారీ షాకే ఇవ్వ‌నుంది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... అమెరికాలో కార్య‌క‌లాపాలు సాగిస్తున్న కంపెనీలు ఇక‌పై ఔట్ సోర్సింగ్ పేరిట త‌మ సేవ‌ల‌ను ఇత‌ర దేశాల‌కు త‌ర‌లించేందుకు వీలు లేద‌ట‌. అలా కాకుండా ప్ర‌స్తుతం చేస్తున్న మాదిరిగానే ఔట్ సోర్సింగ్ పేరిట త‌మ సేవ‌ల‌ను ఇత‌ర దేశాల‌కు త‌ర‌లించే కంపెనీల‌కు అమెరికా ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్లు అంద‌వట‌. అంతేనా స‌ద‌రు కంపెనీల‌కు బ్యాంకులు ఇచ్చే రుణాల‌కు ప్ర‌భుత్వం ఎలాంటి హామీ ఇవ్వ‌ద‌ట‌. అంటే ఆయా కంపెనీలు ఆర్థికంగా ఎలాంటి ప్ర‌భుత్వ సాయం లేకుండానే కార్య‌క‌లాపాలు సాగించాల‌న్న మాట‌. ఇది కొన్న బ‌డా కంపెనీలకు సాధ్య‌ప‌డొచ్చు గానీ... ప్ర‌భుత్వ చేయూత లేకుండా న‌డ‌వ‌డం చిన్నా చిత‌క కంపెనీల‌కు దుస్సాధ్య‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అంటే ప్ర‌భుత్వ సాయం మీద ఆధార ప‌డి ప‌నిచేస్తున్న కంపెనీలు ఔట్ సోర్సింగ్  సేవ‌ల‌ను కూడా అమెరికాలోనే కొన‌సాగించాలి. త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తున్నాయ‌న్న కార‌ణంగా ఇక‌పై భార‌త్‌, పిలిప్పీన్స్ వంటి దేశాల‌కు త‌మ ఔట్ సోర్సింగ్ సేవ‌ల‌ను త‌ర‌లించ‌డం కుద‌ర‌ద‌న్న‌మాట‌. ‘యూఎస్‌ కాల్‌ సెంటర్‌, వినియోగదారుల పరిరక్షణ చట్టం’ పేరిట రూపొందిన ఈ బిల్లును ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు జీన్‌ గ్రీన్‌, అధికార పక్ష రిపబ్లికన్‌ పార్టీ సభ్యుడు డేవిడ్‌ మెకిన్లీ కలిసి ప్రతిపాదించడం గమనార్హం. ఈ బిల్లు నిన్న ఏకంగా అమెరికా కాంగ్రెస్‌లోని ప్ర‌తినిధుల స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు కూడా. విదేశాల్లోని ఔట్ సోర్సింగ్ సేవ‌ల‌ను అనుమ‌తించ‌మ‌ని ఆ బిల్లులో ప్ర‌తిపాదించిన‌ప్ప‌టికీ... ట్రంప్ ప్ర‌ధాన ల‌క్ష్యం మాత్రం భార‌తేన‌ని విశ్లేష‌కుల అంచ‌నా.

అమెరికాలోని  నిరుద్యోగుల‌కు ఉప‌శ‌మనం క‌లిగించేందుకేన‌ని జీన్ గ్రీన్‌, డేవిడ్ మెకిన్లీ చెబుతున్న విష‌యాన్ని ప‌రిశీలిస్తే... ప్ర‌స్తుతం అమెరికాలో 2016 చివ‌రి నాటికి  75.29 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులున్నారు. అదే స‌మ‌యంలో ఆమెరికాలోని ప‌లు కంపెనీలు ఔట్ సోర్సింగ్ సేవ‌ల పేరిట భార‌త్, ఇత‌ర దేశాల్లో 1.4 కోట్ల మంది ఉద్యోగుల‌తో ప‌నిచేయించుకుంటున్నాయి. అంటే ఈ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌స్తే... అమెరికాలో నిరుద్యోగం మాయం కావ‌డం ఖాయ‌మేన‌ని వారిద్ద‌రి భావ‌న‌. మ‌రి ఈ బిల్లుకు ఆమోదం ల‌భిస్తే... మ‌న దేశంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌తో పాటు పిలిప్పీన్స్‌, ఇత‌ర దేశాల్లోని ఈ త‌రహా ఉద్యోగుల కొలువులు ఊడ‌టం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News