బిలియనీర్ల జేబుకు కన్నం పడుతోంది

Update: 2019-11-10 01:30 GMT
గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా సంపన్నుల సంపద తరగడం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న అనేక పరిణామాల ప్రభావం పడి కుబేరుల ఖజానాకు కన్నం పడుతోంది. తాజాగా యూబీఎస్, పీడబ్ల్యూసి నివేదికలు ఈ విషయాన్నివెల్లడించాయి. మార్కెట్లలో అనిశ్చితి.. జియో పాలిటిక్స్,  వాణిజ్య యుద్ధాలు వంటివన్నీ ఈ పరిస్థితికి కారణమయ్యాయని ఈ నివేదికలు వెల్లడించాయి.

ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంపద గత ఏడాదిలో 38,800 కోట్ల డాలర్లు తగ్గి 8.539 లక్షల కోట్ల డాలర్లకు తగ్గిపోయింది. ముఖ్యంగా అమెరికా తరువాత అత్యధిక సంఖ్యలో బిలియనీర్లున్న చైనాలో స్పష్టంగా ఈ మార్పు కనిపించిందట. చైనా బిలియనీర్ల సంపద తరగడంతో ప్రపంచ బిలియనీర్ల సంపద సగటు పడిపోయింది.

అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య యుద్ధం కారణంగా చైనా బిలియనీర్ల సంపద తగ్గిపోయింది. ఇది చైనా ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. అంతేకాదు.. ప్రయివేటు రంగ బ్యాంకులపైనా ఈ ప్రభావం పడింది. మరోవైపు ప్రపంచంలోని పలు దేశాల్లో ఆర్థిక అస్థిరత, చమురు ధరల పతనం కూడా బిలియనీర్ల సంపదను కరిగించాయి.

2008 తర్వాత మొదటిసారి బిలియనీర్ల సంపద 2018 సంవత్సరంలో తగ్గిపోయింది. చైనా లోని సంపన్నుల నికర విలువ డాలర్ రూపంలో చూస్తే 12.8 శాతం తగ్గిపోయింది. స్టాక్ మార్కెట్ లలో క్షీణత క్షీణత, స్థానిక కరెన్సీ బలహీనత, ఆర్ధిక వ్యవస్థలో వృద్ధి మందగించడం వంటి అంశాలు సంపన్నులను దెబ్బతీశాయి.  సంపద తగ్గినప్పటికీ ప్రతి రెండు, రెండున్నర రోజులకు ఒక కొత్త బిలియనీర్ చైనా లో పుట్టుకు వస్తున్నాడు. అమెరికా లో తప్ప ప్రపంచంలోని ప్రతి చోట కూడా బిలియనీర్ల సంఖ్య తగ్గింది. అమెరికా టెక్నాలజీ ఎంటర్ ప్రెన్యూర్లు ఎక్కువ. కొత్త టెక్నాలజీలతో సరికొత్తగా సంపన్నులు తెరపైకి వస్తున్నారు. ఫలితంగానే అమెరికా ముందుంటోంది.  2018 చివరి నాటికి అమెరికాలో 749 మంది బిలియనీర్లు ఉన్నారు.  కాగా వాణిజ్య యుద్దాల వల్ల చోటుచేసుకుంటున్న పరిణామాల పట్ల సంపన్నులు ఆందోళన చెందుతున్నారు. అయితే పరిస్థితులు సద్దు మనిగితే ఈ ఏడాదిలో బిలియనీర్ల సంపద పెరగడానికి అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Tags:    

Similar News