బయో గ్రఫీ: విజయశాంతి

Update: 2020-01-30 11:38 GMT
తెలుగు తెరను ఏలిన నాయకీ ‘మణులు’ ఎందరో ఉన్నారు. తమ అద్భుత, అభినయ చాతుర్యంతో, సామర్థ్యంతో తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు. అయితే కథానాయికగా ఒక అగ్రస్థానాన్ని హీరోలను తలదన్నే ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లు చాలా తక్కువ. పురుషాధిక్య రంగమైన చిత్ర పరిశ్రమ లో అందచందాల ఆరబోతకు మాత్రమే పరిమితమయ్యే సెట్ ప్రాపర్టీ లాగా కాకుండా అన్నీ తానై కథను నడిపించి రెండున్నర దశాబ్దాల అత్యున్నత వైభవాన్ని చవి చూసిన కథానాయిక ఒకరున్నారు. బాక్సాఫీస్ హీరోలకు దీటైన స్టార్ డమ్ ను, ఇమేజ్ ని, క్రేజ్ ను సొంతం చేసుకొని హీరోయిన్ పాత్రల నేచర్ ను,స్టేచర్ ను, స్టేటస్ ను మార్చేసిన ఆ శిఖరాగ్ర స్ధాయి కథానాయిక, జాతీయ ఉత్తమ నటి విజయశాంతి అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన పేరుకు ముందు విశ్వ నట భారతి, కలైమామణి, అభినయ సామ్రాఘ్ని,లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ వంటి బిరుదులు జత చేసే స్థాయికి తిరుగులేని హీరోయిజాన్ని ప్రదర్శించారు విజయశాంతి

* విజయశాంతి బాల్యం విద్యాభ్యాసం

విజయశాంతి జూన్ 24, 1966న తెలంగాణలోని వరంగల్ లో జన్మించారు. మద్రాసులో పెరిగారు. విజయశాంతి పిన్ని విజయలలిత కూడా అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు శాంతి.

*విజయశాంతి సినీ ప్రస్థానం

విజయశాంతి తన 7వ సంవత్సరములోనే సినీరంగం మొదలైంది. విజయశాంతిని మొట్టమొదట తెరకు పరిచయం చేసింది ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా ‘కల్లుక్కుళ్ ఈరమ్’ లో హీరోయిన్ గా విజయశాంతి తొలి సినిమా చేసింది. 1980లో విడుదలైన కిలాడి కృష్ణుడు తెలుగులో ఆమెకు తొలి చిత్రం. ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ కృష్ణ, చిత్ర దర్శకురాలు విజయ నిర్మల.

విజయశాంతి కథానాయికగా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు పరిశ్రమలో నిలదొక్కుకోవటానికి గ్లామర్ ప్రధానమైన పాత్రలనే ఎక్కువగా పోషించింది. వాటిలో చెప్పుకోదగ్గవి ఏవీ లేనప్పటికీ ఉన్నంతలో మహానటులు ఎన్టీయార్, ఏయెన్నార్ ల కలయికలో వచ్చిన 'సత్యం - శివం'లో ఆమె పోషించిన పాత్ర కొద్దిగా గుర్తు పెట్టుకోదగ్గది. ఈ నాలుగేళ్లలో ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది. విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి.కృష్ణ దర్శకత్వంలో ఈ తరం సంస్థ 1983లో నిర్మించిన నేటి భారతం. ఇలా క్రమంగా కథానాయికగా ఒక్కో సినిమాలో నటిస్తూ దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే మరే నటీ అందుకోలేని స్థాయికి చేరిందని సినీ పరిశ్రమ లో వినికిడి.

1985 నటిగా విజయశాంతి విశ్వరూపం ప్రదర్శంచిన సంవత్సరం. ఆ ఏడాది వందేమాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన వంటి ప్రగతిశీల చిత్రాల్లో రెబల్ ఛాయలున్న కథానాయిక పాత్రల్లోనూ, అగ్ని పర్వతం, పట్టాభిషేకం, చిరంజీవి, దర్జా దొంగ, ఊరికి సోగ్గాడు, శ్రీవారు వంటి చిత్రాల్లో చలాకీగా హీరోతో ఆడి పాడే కథానాయికగా నటించి తను రెండువిధాలుగానూ ప్రేక్షకులను మెప్పించగలనని ఋజువుచేసింది.

1990 జూన్ నెలలో వచ్చిన కర్తవ్యం విజయశాంతి నట జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఐ.పి.ఎస్. అధికారిణి కిరణ్ బేడీ స్ఫూర్తితో, మోహన గాంధీ దర్శకత్వంలో తను కథానాయిక పాత్ర పోషిస్తూ సూర్యా మూవీస్ పతాకంపై విజయశాంతి స్వయంగా నిర్మించిన ఈ చిత్రం అపూర్వ విజయం సాధించడమే కాకుండా ఆమెకు 1990వ సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డులను సంపాదించి పెట్టింది.

ఈమె తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం మరియు హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఆమె "ద లేడీ సూపర్ స్టార్" మరియు "లేడీ అమితాబ్" గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతుంది. ఆమె 1991 లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది.

తెలుగు ప్రేక్షకులతో లేడీ సూపర్ స్టార్‌గా పిలుపించుకున్న విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిన తరవాత సినిమాలకు దూరమైపోయారు. 2006లో వచ్చిన ‘నాయుడమ్మ’ సినిమాలో ఆమె చివరిగా కనిపించారు. ఆ తరవాత మరే సినిమాను ఆమె అంగీకరించలేదు. అయితే, 13 ఏళ్ల విరామం తరవాత విజయశాంతి మళ్లీ మేకప్ వేసుకున్నారు. మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో విజయశాంతి రీఎంట్రీ ఇచ్చారు..

*విజయశాంతి వ్యక్తిగత జీవితం

విజయశాంతికి 17 ఏళ్లప్పుడే తండ్రి చనిపోయారు. ఆ ఏడాది కాలంలోనే తల్లి చనిపోయింది. ఆ సమయంలో నా అని పలకరించేవారులేక కుమిలిపోయింది. ఆ సమయంలో పరిచయమైన నిర్మాత శ్రీనివాస ప్రసాద్ ను వివాహం చేసుకుంది. కర్తవ్యం సినిమాను నిర్మించింది ఈయనే. 1988 మార్చి 29న రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకుంది విజయశాంతి. వీరికి పిల్లలు కలుగలేదు.

*విజయశాంతి రాజకీయ ప్రస్థానం

సినీనటిగా ఎంతో పేరు సంపాదించిన విజయశాంతి అదే సినిమాలకు స్వస్తి పలికి.. 1998లో బీజేపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా తల్లితెలంగాణ పార్టీని స్థాపించారు. 2009లో కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్‌లో తన పార్టీని విలీనం చేశారు. అదే ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో మెదక్ లోక్ సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో కేసీఆర్ తో విభేదాల వల్ల ఆ పార్టీ నుంచి దూరం జరిగారు. 2014 ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉంటున్నారు.

ఇలా తెలుగు తెరపై దూసుకొచ్చిన హీరోయిన్ విజయశాంతి సినిమాల్లో సక్సెస్ అయ్యి ఎంతో ఎత్తుకు ఎదిగినా రాజకీయాల్లో మాత్రం తేలిపోయారు. అనుకున్న విజయాలను దక్కించుకో లేకపోయారు. అయితే ఆమె 40 ఏళ్లకు సినీ, రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు.


Tags:    

Similar News