ఏపీ గవర్నర్ కు తాత్కాలిక రాజ్ భవన్..!

Update: 2019-07-19 06:02 GMT
ఏపీ గవర్నర్ గా ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ నేత విశ్వభూషణ్ హరిచందన్ ను కేంద్రం కొత్తగా నియమించింది. ఈయన బీజేపీ ఒడిషా రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు. ఇక ఒడిషా న్యాయశాఖ మంత్రిగా.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత. ఇక పక్క రాష్ట్రం కావడంతోనే ఈయనను ఏపీకి గవర్నర్ గా నూతనంగా నియమించారు.

ఏపీ నూతన గవర్నర్ గా విశ్వభూషణ్ ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  ప్రవీణ్ కుమార్ గవర్నర్ చేత ప్రమాణం చేయిస్తారు. ఇప్పటికే గవర్నర్ కార్యదర్శిగా ముకేష్ కుమార్ మీనాను ఏపీ సర్కారు నియమించింది. ఆయన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు గవర్నర్ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.

కాగా ఏపీ గవర్నర్ కోసం రాజ్ భవన్ ను సిద్ధం చేయాలని అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని జగన్ సర్కారు అధికారులను ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ పరిధిలోని సూర్యరావుపేటలోని పాత ఇరిగేషన్ కార్యాలయాన్ని తాత్కాలికంగానే రాజ్ భవన్ గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే భవిష్యత్తులో గవర్నర్ కోసం కొత్తగా పూర్తి వసతులతో రాజ్ భవన్ ను కట్టడానికి జగన్ సర్కారు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ఇక ఏపీకి నూతన గవర్నర్ రావడంతో నరసింహన్ తెలంగాణ గవర్నర్ గానే కొనసాగనున్నారు. అయితే ఆయనను కొనసాగిస్తారా? లేక సాగనంపుతారా అన్నది త్వరలోనే తేలనుంది. యూపీఏ హయాంలో నియమితుడైన గవర్నర్ దాదాపు 10 ఏళ్లుగా గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఏపీ, తెలంగాణకు విడివిడిగా గవర్నర్లను కేంద్రం నియమించింది.
Tags:    

Similar News