బాబుపై కోర్టు ధిక్కార పిటీషన్ - హక్కుల తీర్మానం

Update: 2018-09-19 05:53 GMT
ఏపీ సీఎం చంద్రబాబుపై మహారాష్ట్ర  హైకోర్టులో కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేయబోతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ - బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. గుంటూరు - విజయవాడల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ఈ విషయాన్ని వెల్లడించారు.

కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు న్యాయవ్యవస్థను కించపరిచేలా మాట్లాడాడని.. తన అవినీతి - అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ధర్మాబాద్ కోర్టు నోటీసులు ఇస్తే.. సంబంధం లేని ప్రధాని మోడీపై దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ విషయంలో చంద్రబాబుపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బాబు తీరును కోర్టుల్లో ఎండగడుతామన్నారు.

ఇక ఎంపీ జీవీఎల్ నరసింహరావు మాట్లాడుతూ చంద్రబాబు దిగజారుడు రాజకీయాలపై మండిపడ్డారు. చంద్రబాబుపై ఏపీ అసెంబ్లీలో సభా హక్కుల నోటీసును కూడా ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. ధర్మా బాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేశాక... న్యాయస్థానాలపై చంద్రబాబు - టీడీపీ నేతల వ్యాఖ్యలను న్యాయ నిపుణులకు చూపించి వారి అభిప్రాయాలను తీసుకున్నామని తెలిపారు. వారు అన్నీ సక్రమమే అని నిర్ధారించాకే ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో ముంబై హైకోర్టులో చంద్రబాబుపై పిటీషన్ వేయబోతున్నామని తెలిపారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో న్యాయవ్యవస్థను చంద్రబాబు కించపరిచాడని.. దీన్నే తాము కోర్టు దృష్టికి తీసుకెళ్లబోతున్నామని వివరించారు. అస్సలు సంబంధం లేని ఈ ఇష్యూలో కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా ఏపీ శాసనసభలో హక్కుల తీర్మానం వేసి ఎండగడుతామని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అన్నీ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కంటే సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఎక్కువ నిధులు ఇచ్చారని కేంద్రంపై నిందలు వేయడం దారుణమన్నారు. కేంద్రం నిధులు ఇస్తున్నా చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని జీవీఎల్ దుయ్యబట్టారు.

జాతీయ రహదారుల ఖర్చంతా కేంద్రానిదేనని.. వైజాగ్-చెన్నై కారిడార్ ఖర్చు ఏపీ ప్రభుత్వం భరిస్తుందని చంద్రబాబు దారుణంగా మాట్లాడుతున్నారని జీవీఎల్ ఎండగట్టారు.  పెట్రోలియం ప్రాజెక్టుతో ఏపీకి పెట్టుబడులు వచ్చేందుకు కేంద్రం సహకరించిందన్నారు. ప్రజలకు ఏపార్టీపై లేని కోపం టీడీపీపై ఉందని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని జీవీఎల్ జోస్యం చెప్పారు.
Tags:    

Similar News