వారి మీద బీజేపీ ప్రేమ...కాషాయం కట్టించేస్తారా...?

Update: 2022-08-28 02:30 GMT
ప్రేమలు ఎన్నో రకాలు. ఇపుడు రాజకీయ ప్రేమలు కూడా నడుస్తున్నాయి. పేరున్న నోరున్న సెలిబ్రిటీలను తమ వైపునకు తిప్పుకునే వ్యూహానికి బీజేపీ అధినాయకత్వం పదును పెడుతోంది. తెలంగాణాకు వచ్చిన ప్రతీసారీ వివిధ విభాగాల  ప్రముఖులను కలుస్తూ వారితో భేటీలు వేస్తూ మీడియా ఫోకస్ తమ వైపు ఉండేలా చూసుకుంటారు.

రండి మా దగ్గరకు అంటే ఎవరైనా రాకుండా ఉంటారా. ఈ మర్యాదపూర్వకమైన వినతిని వారు స్వీకరించి బీజేపీ పెద్దలను కలుస్తున్నారు. దానికి బీజేపీ మార్క్ పొలిటికల్ కలరింగ్ అద్దుతున్నారు. అయితే బీజేపీని కలుస్తున్న సెలిబ్రిటీలు అంతా ఆ పార్టీకి మద్దతుగా ఉంటారా అన్నది ఒక హాట్ హాట్ చర్చగా ఉంది.

ఈ మధ్యనే అంటే కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ వచ్చిన బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీయార్ ని తన దగ్గరకు రప్పించుకుని డిన్నర్ చేశారు. దాదాపుగా ముప్పావు గంట పాటు ముచ్చట్లు పెట్టారు. అది క్షణాలలో జాతీయ స్థాయిలో సెన్షేషనల్ న్యూస్ అయింది. ఇక ఆయన తరువాత ఇపుడు చాన్స్ జేపీ నడ్డాది. ఆయన హైదరాబాద్ వస్తూనే ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను కలుసుకున్నారు.

ఆమెతో చాలాసేపు మాట్లాడారు. మహిళా క్రికేటర్లకు దారి చూపి లేడీస్ కూడా తీసిపోరు అని నిరూపించిన ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్‌ అంటే యూత్ లో క్రేజ్ ఉంది. లేడీస్ లో ఫాలోయింగ్ ఉంది. హైదరాబాద్ నివాసి అయిన క్రికెటర్ మిథాలీ రాజ్ నిజానికి రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌కు చెందినవారు. ఆమె వల్ల ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు రాజస్థాన్ లో కూడా ప్రచారం చేయించుకోవాలన్న ఎత్తుగడ ఏదో ఉంది అంటున్నారు.

ఇక టాలీవుడ్ యంగ్ స్టార్ నితిన్ తో కూడా నడ్డా భేటీ ఉంది. ఆయన యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ప్రత్యేకించి తెలంగాణాకు చెందిన హీరో. దాంతో ఆయన్ని ఎలాగైనా బీజేపీ వైపు లాగాలన్న వ్యూహం ఏదో ఉన్నట్లుంది. అంటే ప్రధాని మోడీ భీమవరం సభలో చిరంజీవితో కరచాలనం చేసి కధ మొదలుపెడితే నితిన్ దాకా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. మరిన్ని అమి షా టూర్లు ఉన్నాయి. నడ్డా కూడా వస్తూనే ఉంటారు. ఇక మోడీ కూడా వచ్చినా రావచ్చు అంటున్నారు.

మరి ఈ కీలక నాయకులు ఇంకా ఎంతమంది టాలీవుడ్ సెలిబ్రిటీస్ మీద ప్రేమ పెంచుకున్నారో తెలియదు కానీ వచ్చిన వారిని వచ్చినట్లే కాషాయం కట్టించేసి తమ వెంట తిప్పుకోవాలన్న ఆరాటం అయితే బాగానే ఉంది అంటున్నారు. అయితే సెలిబ్రిటీస్ వారి కష్టంతో పైక్ వచ్చిన వారు, వారికి అన్ని పార్టీలు కావాలి. రాజకీయాలు అంటే దూరం జరిగే వారు ఉన్నారు.  క్రికెటర్ మిథాలీ రాజ్ లాంటి వారికి ఏమైనా రాజకీయ ఆశలు ఉంటాయేమో కానీ సినీ హీరోలు మాత్రం ఆ వైపుగా తొంగి చూసే చాన్స్ లేదనే అంటున్నారు.

అయినా సరే వారిని రప్పించి ముచ్చటించడం ద్వారా వారు తమ వైపే అన్న మేసేజ్ ఏదో పంపాలన్న వ్యూహం కూడా బీజేపీకి ఉంది.  కుదిరితే కప్పు కాఫీ ఇంకా కుదిరితే డిన్నర్ అన్నట్లుగా సాగుతున్న బీజేపీ సెలిబ్రిటీస్ భేటీలు ఆ పార్టీ బలోపేతం చేసేందుకే అని అంటున్నారు. మరి దానికి ఇటు వైపు నుంచి సెలిబ్రిటీల పాజిటివ్ రియాక్షన్ ఉంటుందా అన్నదే చూడాలి.
Tags:    

Similar News