11 రాష్ట్రాల ఎన్నిక‌ల‌పై అమిత్ షా లేఖ‌!

Update: 2018-08-14 07:49 GMT
విప‌క్షాలు వ‌ద్ద‌న్నా.. మెజార్టీ పార్టీలు మొగ్గు చూప‌కున్నా.. జ‌మిలి ఎన్నిక‌ల‌పై ఉన్న మోజును మ‌ళ్లీ ప్ర‌ద‌ర్శించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. 2019లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు.. వీలైన‌న్ని ఎక్కువ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో బీజేపీ ఉండ‌టం తెలిసిందే.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు జ‌ర‌గాల్సిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు.. సార్వ‌త్రికం అయిన ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో జ‌ర‌గాల్సిన అసెంబ్లీ ఎన్నిక‌ల్ని మ‌రికాస్త‌ ముందుకు తీసుకొచ్చి జ‌మిలి ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో బీజేపీ ఉంది. దీనికి సంబంధించి రాజ్యాంగ స‌వ‌ర‌ణ అవ‌స‌రం లేద‌న్న మాటను బీజేపీ అధినాయ‌క‌త్వం చెబుతోంది.

జ‌మిలి ఎన్నిక‌లకు తాము సిద్ధ‌మేన‌ని న్యాయ క‌మిష‌న్ కు బీజేపీ చీఫ్ అమిత్ షా రాసిన లేఖ తీరు చూస్తే.. పాక్షిక జ‌మిలిపై మోడీషాలు ఇంకా ఆశ‌లు వ‌దులుకోలేద‌న్న భావ‌న క‌లుగ‌క మాన‌దు. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఈ ఏడాది చివ‌ర్లో మూడు రాష్ట్రాల్లో (మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. రాజ‌స్థాన్.. ఛ‌త్తీస్ గ‌ఢ్‌) అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. అదే విధంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా తెలంగాణ?. ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంది.

అనంత‌రం ఏడాదిన్న‌ర కాల‌వ్య‌వ‌ధిలో దాదాపు ఆరు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. దీంతో.. ఎప్పుడూ ఎన్నిక‌ల‌న్న భావ‌న లేకుండా.. వీలైన‌న్ని ఎక్కువ రాష్ట్రాలకు లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటు నిర్వ‌హిస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో బీజేపీ ఉంది. ఈ విధ‌మైన ఎన్నిక‌ల కార‌ణంగా కేంద్రం ఎంతోకొంత లాభ‌ప‌డే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం ఉంది. అయితే.. ఇది స‌మాఖ్య స్ఫూర్తికి ఏ మాత్రం స‌రికాద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. బీజేపీ అనుస‌రిస్తున్న తీరు ప్ర‌జాస్వామ్య వ్య‌తిరేకంగా ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

ఎన్నిక‌ల కార‌ణంగా అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చుతో పాటు.. త‌ర‌చూ ఎన్నిక‌లు జ‌రుగుతున్న కార‌ణంగా అభివృద్ధికి ఆటంకంగా మారుతుంద‌న్న అభిప్రాయాన్ని బీజేపీ వ్య‌క్తం చేస్తోంది. ఏక‌కాలంలో ఎన్నిక‌లు జ‌రిగితే బోలెడంత ఆదా అవుతుంద‌న్న మాట‌ను క‌మ‌ల‌నాథులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. లా క‌మిష‌న్ కు అంద‌జేసిన లేఖ‌లో.. జ‌మిలి ఆలోచ‌న మాత్ర‌మే కాదు.. ఆచ‌రించ‌ద‌గిన‌ది కూడా అని పేర్కొన‌టం గ‌మ‌నార్హం. ఓప‌క్క షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌ల జ‌ర‌గాల‌న్న దానిపై మెజార్టీ పార్టీలు చెబుతున్న‌వేళ‌.. షా మాట‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.




Tags:    

Similar News