ప్రకాశంపై బీజేపీ కన్ను.. తెరపైకి 'ఈదర'?

Update: 2019-11-20 17:30 GMT
టీడీపీలో కీలక నేతలకు గాలం వేసే పనిలో బీజేపీ బిజీగా ఉంది. ఇప్పటికే చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్లను సంప్రదించిన కమల దళం ఇప్పుడు వ్యూహం మార్చిందట.. జిల్లాల వారీగా టీడీపీ ఎమ్మెల్యేలు, బలమైన నేతలను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

ప్రకాశం జిల్లాపై ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం అక్కడ బలమైన నేతలకు గాలం వేసే పనిని మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ చైర్మన్ అయిన  ఈదర హరిబాబును ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించనున్నారనే ప్రచారం సాగుతోంది.

ఈదర హరిబాబు కమ్మ సామాజికవర్గానికి చెందిన ముఖ్యనేత. 1994లో టీడీపీ తరుఫున ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రెండు సార్లు ఓడిపోయారు. 2014లో ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ గా అయిపోయారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఈదరను ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా చేయాలని అధిష్టానం డిసైడ్ అయ్యిందట.. ఈదరకు బీజేపీ సీనియర్ నాయకులు పురంధేశ్వరి, సుజనా చౌదరిలతో మంచి సంబంధాలు ఉండడం.. మద్దతు లభించడంతో ఈయన నియామకం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ప్రకాషం జిల్లాలో టీడీపీ కీలక నేతలు ఇటీవల సుజనాచౌదరితో భేటి కావడంతో వారంతా బీజేపీలో చేరడం ఖాయమన్న అంచనాలు నెలకొన్నాయి. కరణం బలరాం లాంటి ఎమ్మెల్యే కూడా సుజనాతో భేటి కావడంతో ఇక ఆయన కూడా పార్టీ మారుతారా అన్న సందేహాలు నెలకొన్నాయి.

ఇప్పుడు ప్రకాశం జిల్లాపై ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ ఈదర హరిబాబును బీజేపీ జిల్లా అధ్యక్షుడిని చేసి టీడీపీ ఎమ్మెల్యేలను లాగేసి ఆ జిల్లాలో పట్టు సాధించాలని చూస్తోంది. మరి వీరి ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది వేచిచూడాలి.
    

Tags:    

Similar News