గేమ్ ప్లాన్: అసోంలో కమలవికాసం ఎలా?

Update: 2016-04-10 09:35 GMT
రాష్ట్రం ఏదైనా కానీ.. సుదీర్ఘ కాలం పాటు తిరుగులేని అధికారంలో కొనసాగుతున్న ఒక రాజకీయ పార్టీకి బ్రేకులు వేయటం అంత తేలికైన వ్యవహారం కాదు. ఇక.. భారత్ లాంటి సంక్లిష్ట రాజకీయాలు రాజ్యమేలే చోట అధికార బదిలీ ఒక పట్టాన తేలే వ్యవహారం కాదు. అధికారంలో ఉన్న పార్టీ ఎత్తులు.. వాటికి విరుగుడుగా విపక్షం వేసే పైఎత్తులతో ఎన్నికల వార్ తీవ్రస్థాయిలో ఉంటుంది. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో విజేతల మీద ఇప్పటికే ఒక స్పష్టత వచ్చేసింది. అసోం విషయమై విజయం అధికార కాంగ్రెస్.. విపక్ష బీజేపీల మధ్య దాగుడుమూతలు ఆడుతున్నట్లగా పరిస్థితి ఉంది.

ఇప్పటివరకూ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ను చూస్తే అసోంలో బీజేపీకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. అయితే.. అదంత తేలిగ్గా అయ్యేనా? అన్నది ఒక ప్రశ్న. ఇదే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీ లోతైన పరిశీలన చేసి.. అక్కడి రాజకీయ పరిస్థితులు.. గెలుపోటముల మీద ఒక భారీ విశ్లేషణ చేసింది. ఈ లెక్కల్ని చూస్తే.. అసోంలో విజేతగా బీజేపీ అవతరించే అవకాశం ఎలా ఉందన్నది స్పష్టంగా అర్థం కావటమే కాదు.. అనుకున్న ఫలితంలో ఏదైనా మార్పులు.. చేర్పులు చోటు చేసుకుంటే ఎందుకలాంటి పరిస్థితి చోటు చేసుకుందన్న విషయాన్ని చెప్పుకొచ్చింది.

అసోంలో బీజేపీ విజయవకాశాల్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.. గెలుపు కోసం బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాన్ని చూస్తే.. బీహార్ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం బీజేపీ మీద ప్రభావం చూపినట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా స్థానికంగా ప్రముఖ నేతల్ని ఎంపిక చేసుకోవటం.. సీఎంల అభ్యర్థిగా సర్బానంద సోనోవాల్ ను ప్రకటించటం.. ఎన్నికల్లో పార్టీకి ప్రధాన వ్యూహకర్త అయిన బిశ్వా శర్మ లాంటి నేతలతో ప్రచారం చేయించటం.. ఏజీపీతో జత కట్టటం  లాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంది.

అసోంలో జనాభా 3.2 కోట్లు కాగా.. ముస్లింలు 1.1 కోట్లమంది. ఇప్పటివరకూ కాంగ్రెస్ వెంట ఉండే వారంతా ఇప్పుడు మస్లింల పార్టీ అయిన ఏఐయూడీఎఫ్ కు అండగా ఉండటం కాంగ్రెస్ ను దెబ్బ తీయనుంది. రాష్ట్రంలోని బెంగాలీ హిందువుల ఓట్లు కాంగ్రెస్.. బీజేపీల మధ్య చీలిపోనున్నాయి. గెలుపును డిసైడ్ చేయటంలో కీలకమైన 50 లక్షల తేయాకు కార్మికులు బీజేపీ పక్షాన నిలవటం కమలనాథులకు కలసి రానుంది. ఇక.. బోడో పార్టీతో బీజేపీ జట్టు కట్టటం కూడా లాభంగా మారనుంది. రాష్ట్రంలోని క్రైస్తవులు మాత్రం ఎప్పటి మాదిరి కాంగ్రెస్ వెంటే ఉండనున్నారు. తమ చేజారినట్లుగా భావిస్తున్న ముస్లిం ఓట్లను కాంగ్రెస్ తిరిగి తమ వైపునకు తిప్పుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది.

 ఒకవేళ ఇందులో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. అధికార.. ప్రతిపక్షాల మధ్య విజయవకాశాలు ఫిఫ్టీ.. ఫిఫ్టీగా ఉండనున్నాయి. ఒకవేళ ఈ విషయంలో కాంగ్రెస్ విఫలమైతే మాత్రం బీజేపీ గెలుపు అవకాశాలు 60శాతం.. కాంగ్రెస్ విజయవకాశాలు 40 శాతానికి పడిపోనున్నాయి. ముందే అనుకున్నట్లు తేయాకు కార్మికుల ఓట్లన్నీ గంపగుత్తగా బీజేపీ కానీ సొంతం చేసుకోగలిగితే.. అసోంలో బీజేపీ విజయవకాశాలు 70 శాతం కానున్నాయి. మొత్తంగా చూస్తే.. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అసోంలో పరిస్థితులు మార్పు రావటమే కాదు.. కమలనాథులు తమ సత్తా చాటే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు ఎన్డీటీవీ తాజా సర్వే స్పష్టం చేస్తోంది.
Tags:    

Similar News