మోదీని టార్గెట్ చేసిన హీరో .. ఈసీకి బీజేపీ ఫిర్యాదు !

Update: 2021-04-03 07:30 GMT
తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఏప్రిల్ 6 న పోలింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో    ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. నేతలు వాడీవేడి వ్యాఖ్యలతో హీట్ పుట్టిస్తున్నారు. హద్దులు దాటి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తమిళనాడు సీఎం పళనిస్వామిని ఉద్దేశించి కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ ఏ.రాజా అనుచిత వ్యాఖ్యలు మరువక ముందే మరో వివాదం చెలరేగింది. డీఎంకే చీఫ్ స్టాలిన్ కుమారుడు, ఆ పార్టీ యువనేత ఉయనిధి స్టాలిన్ ఏకంగా ప్రధానమంత్రి మోదీపైనే విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మోదీ టార్చర్ భరించలేక దివంగత నేతలు అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్ మరణించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీకి సీనియర్లంటే గౌరవం లేదని, మరో సీనియర్ నేత వెంకయ్య నాయుడిని కూడా పక్కకు తప్పించారంటూ ఉదయనిధి వ్యాఖ్యానించారు.అలాగే, మోదీని చూసి భయపడడానికి తానేమీ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కాదని , కలైంగర్ కరుణానిధి మనవడినని అన్నారు.

ఇదిలా ఉంటే .. ప్రధాని మోదీ ఒత్తిడి తట్టుకోలేక పోవడంతో సుష్మా, జైట్లీ చనిపోయారని ఎన్నికల సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ  ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉదయనిధిని అనర్హుడిగా ప్రకటించాలని, డీఎంకే స్టార్‌ ప్రచార కర్తల జాబితా నుంచి ఆయన పేరును తొలగించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం చెపాక్‌ – ట్రిప్లికేన్‌ స్థానం నుంచి ఉదయనిధి బరిలో ఉన్నారు. ఇకపోతే , ఈ వ్యాఖ్యలపై సుష్మ కూతురు బాన్సురీ, జైట్లీ కూతురు సొనాలీ స్పందించారు. ప్రధాని మోదీ తమ తల్లికి ఎనలేని గౌరవం ఇచ్చారని.. కష్టకాలంలో పార్టీ తమకు అండగా ఉందని ఆమె పేర్కొన్నారు. మీరు చేసిన అర్ధరహితమైన వ్యాఖ్యలు బాధించాయని బాన్సురీ, ట్వీట్ చేశారు.  ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం తమ తల్లి పేరును వాడుకోవద్దని బాన్సురీ సూచించారు. అరుణ్ జైట్లీతో ప్రధాని మోదీకి రాజకీయాలకు అతీతంగా ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని సొనాలీ జైట్లీ తెలిపారు.
Tags:    

Similar News