ఎన్నిక‌ల ముంగిట‌.. కేసీఆర్‌కు కేంద్రం షాక్‌.. ఏం జ‌రిగిందంటే!

Update: 2022-12-13 02:30 GMT
తెలంగాణ‌లో మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యంద‌క్కించుకుని హ్యాట్రిక్ కొట్టాల‌ని భావిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎప్ప‌టి నుంచో డిమాండ్‌గా ఉన్న ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల పెంపుపై ఇప్ప‌ట్లో ప‌ట్టించుకునేది లేద‌ని..కేంద్రం తేల్చి చెప్పింది. గిరిజన రిజర్వేషన్ల పెంపుపై తాము ఇప్ప‌ట్లో తేల్చ‌లేమ‌ని.. దీనికి చాలానే స‌మ‌యం ప‌డుతుంద‌ని కేంద్ర ప్రభుత్వం కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది.

తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన విష‌యం తెలిసిందే.  దీనిని ఆమోదించాలంటూ..కేంద్ర హోం శాఖ‌కు పంపించింది. అయితే, కేంద్రం ఏమీ తేల్చ‌కుండా నాన్చుడు ధోర‌ణి అవ‌లంభించింది. దీంతో ఈ విష‌యం తాజాగా.. పార్ల‌మెంటులో టీఆర్ ఎస్ ఎంపీలు ప్ర‌స్తావించారు. తాము ప్ర‌తిపాదించిన ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ఏం చేశారంటూ.. టీఆర్ ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. ఇంకెంత కాలం ప‌డుతుంద‌ని ఆయ‌న నిల‌దీశారు.

దీనిపై స్పందించిన కేంద్రం.. ఇప్ప‌టికే అనేక రాష్ట్రాలు రిజ‌ర్వేష‌న్లు పెంచుతూ.. పోతున్నాయ‌ని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో అనేక కేసులు ఉన్నాయ‌ని.. అవి  పరిష్కారం అయిన‌ తర్వాతే తెలంగాణ‌లో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేర‌కు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్‌ ముండా తెలంగాణ ఎంపీకి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు పెంపునకు సంబంధించిన బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందిందన్నారు. ఆ రిజర్వేషన్లను 10 శాతం వరకు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్ర హోం శాఖకు చేరిందన్నారు. రిజర్వేషన్లకు సంబంధించిన కొన్ని కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని,  న్యాయస్థానంలో కేసుల పరిష్కారం తర్వాత, సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే దీనిపై ముందుకు వెళ్లాలని నిర్ణ‌యించామ‌ని కేంద్ర మంత్రి స్ప‌ష్టం చేశారు. అయితే.. సుప్రీంకోర్టులో కేసులు ఇప్ప‌ట్లో తేలేలా క‌నిపించ‌డం లేదు. దీంతో కేసీఆర్‌కు ఎన్నిక‌ల‌కు ముందు ఇది ఫలించే అవ‌కాశం లేద‌ని ప‌రిశీల‌కులు భావిస‌త్ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News