య‌డియూర‌ప్ప‌కు అప్పుడే వార్నింగ్ బెల్స్‌..!

Update: 2019-09-13 07:25 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి య‌డియూర‌ప్ప‌కు అప్పుడే బీజేపీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చేసిందా ? ఎట్టకేలకు కాంగ్రెస్ - జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలోకి వచ్చిన య‌డియూర‌ప్ప‌కు ముఖ్యమంత్రి పీఠం ముళ్ళ కిరీటంగా కనిపిస్తుందా ? అంటే కన్నడనాట ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ పరిణామాలు అవున‌నే స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కుటుంబ సభ్యులను దూరం పెట్టాలని బీజేపీ అధిష్టానం య‌డియూర‌ప్ప‌కు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి య‌డియూర‌ప్ప‌ ముఖ్యమంత్రి అయినా గతంలోకంటే భిన్నంగా బిజెపి అధిష్టానం జోక్యం ఎక్కువగా కనిపిస్తోంది. కనీసం తనకు అనుకూలమైన కేబినెట్‌ ను ఏర్పాటు చేసుకోవడంలో కూడా ఆయనకు స్వేచ్ఛ లేకుండా చేశారు. అందుకే కర్ణాటక క్యాబినెట్ ఏర్పాటుకు దాదాపు నెల రోజులకు పైగా సమయం తీసుకున్నారు. ఇక గత కొద్ది రోజులుగా రాష్ట్ర పాలనలో సాగుతున్న వ్యవహారాలపై అధిష్టానానికి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. సీఎంతో పాటు పలువురు మంత్రులు కుటుంబ సభ్యులు కీలకమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోప‌ణ‌లు ఎక్కువ‌వుతున్నాయి.

ఈ క్ర‌మంలోనే అమిత్ షా య‌డియూర‌ప్ప‌కు తీవ్రంగా వార్నింగ్ ఇచ్చార‌ని క‌న్న‌డ బీజేపీ వ‌ర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. ఇక పాల‌న‌లో జోక్యంతో పాటు అధికారుల బదిలీలు - కంట్రాక్టర్లు - శాఖాపరమైన పనులలో కుటుంబ సభ్యులకు ఏం పని ఉంటుందని అమిత్ షా మందలించినట్టు తెలుస్తోంది. అన‌వ‌స‌రంగా ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు ఆస్కారం ఇవ్వ‌వ‌ద్ద‌ని కూడా సూచించార‌ట‌.

ఇక సీఎం కుమారుడు విజయేంద్ర సైతం పాలనలో మితిమీరి జోక్యం చేసుకుంటున్నారని... ఇప్పటికే మాజీ సీఎం కుమారస్వామితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు.  ఈ ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో బిజెపి అధిష్టానం వెంటనే ఎలెర్ట్‌ అయ్యి సీఎంకు - ఆయన అనుచరులకు వార్నింగ్ ఇచ్చిందట - గతంలో మనమే కుమారస్వామి త‌న ఇంటినే దందాల కేంద్రంగా మార్చేశార‌ని తీవ్ర ఆరోపణలు చేశామని.... ఇప్పుడు మనం కూడా అలాగే వ్యవహరిస్తే తేడా ఏముంటుంది అని కూడా అమిత్‌ ప్రశ్నించినట్టు సమాచారం. ఏదేమైనా య‌డియూర‌ప్ప‌పై బీజేపీ జాతీయ అధిష్టానం ఓ క‌న్నేసి ఉంచి వాచ్ చేస్తోంది.


Tags:    

Similar News