హోదా రాద‌ని... బాబుకు ముందే తెలుస‌ట‌!

Update: 2018-03-28 10:17 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఇప్పుడు సాగుతున్న ఉద్య‌మం నిజంగానే తారా స్థాయికి చేరుకుంద‌ని చెప్పాలి. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని మాట ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఆ హామీని మ‌రిచిన వైనంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న విప‌క్ష వైసీపీ ఇప్ప‌టికే నాలుగేళ్లుగా పోరాటం కొన‌సాగిస్తూనే ఉంది. తాజాగా ఈ పోరాటాన్ని మ‌రింత ఉధృతం చేసిన వైసీపీ... ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని న‌రేంద్ర మోదీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌డంతో పాటుగా, త‌న పార్టీ ఎంపీల‌తో రాజీనామాలు చేయించేందుకు కూడా ఏమాత్రం వెనుకాడ‌టం లేదు. తాను ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ‌కు అనుమ‌తించ‌కుండా వాయిదాల ప‌ర్వం కొన‌సాగిస్తే త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేస్తామ‌ని తాజాగా తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ పార్ల‌మెంటు ఆవ‌ర‌ణలోనే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నమ‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపు నిన్న‌టిదాకా ప్ర‌త్యేక హోదా వ‌ద్దు - ప్ర‌త్యేక ప్యాకేజీనే ముద్దు అంటూ సాగిన అధికార పార్టీ టీడీపీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించేసి ప్ర‌త్యేక హోదా నినాదం ఎత్తుకుంది. మొన్న‌టి కేంద్ర బ‌డ్జెట్ లో ఏపీ ప్ర‌స్తావ‌నే లేక‌పోగా... అందుకు నిర‌స‌న‌గా త‌న ఇద్ద‌రు కేంద్ర మంత్రుల‌తో రాజీనామాలు చేయించిన టీడీపీ - ఏకంగా ఎన్డీఏ నుంచి కూడా వైదొల‌గింది.

ఫ‌లితంగా నాలుగేళ్లుగా మిత్ర‌ప‌క్షాలుగా సాగిన బీజేపీ - టీడీపీ ఇప్పుడు వైరివ‌ర్గాలుగా మారిపోయాయి. ఈ క్ర‌మంలో నాడు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పిన బీజేపీ... ఆ హామీని నిల‌బెట్టుకోకుండా ఏపీకి తీర‌ని అన్యాయం చేస్తోంద‌ని, న్యాయం జ‌రిగేదాకా పోరాటం చేస్తామ‌ని టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఘ‌నంగానే ప్ర‌కటించారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు అండ్ కో వాద‌న‌ల‌ను తిప్పికొట్టేందుకు బీజేపీ త‌న తురుపు ముక్క‌ల‌ను ఒక్క‌టొక్క‌టిగా వ‌దులుతోంది. ఈ క్ర‌మంలో మొన్న‌టిదాకా చంద్ర‌బాబుపై బీజేపీ నేత‌లు విష్ణుకుమార్ రాజు - సోము వీర్రాజు - మాధ‌వ్ త‌దిత‌రులు త‌మ‌దైన శైలిలో విరుచుకుప‌డ‌గా... తాజాగా బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో ఏపీకి చెందిన జీవీఎల్ న‌ర‌సింహారావు ఎంట్రీ ఇచ్చేశారు. నిన్న మీడియా ముందుకు వ‌చ్చిన జీవీఎల్‌.. అస‌లు ఏపీకి బీజేపీ ప్ర‌భుత్వం ఏ మేర సాయం చేసింద‌న్న విష‌యాన్ని వివ‌రిస్తూ... చంద్రబాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అదే టెంపోను కొన‌సాగించిన జీవీఎల్‌... తాజాగా నేటి మ‌ధ్యాహ్నం కూడా బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్‌ తో క‌లిసి మ‌రోమారు మీడియా ముందుకు వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా ఏపీకి ప్ర‌త్యేక హోదాకు సంబంధించి పూర్తి వివ‌రాలు చంద్ర‌బాబుకు ముందే తెలుసున‌ని - అస‌లు ఏపీకి ప్ర‌త్యేక హోదా రాద‌న్న విష‌యం బాబుకు ముందే తెలుసున‌ని పెద్ద బాంబే పేల్చారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాపై ప్రజలు వాస్తవాలు గుర్తించకుండా ఉండేందుకే చంద్రబాబు  అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. రూ.2.44 లక్షల కోట్లను కేంద్రం ఏపీకి ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.1.15 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని నాలుగేళ్ల క్రితమే టీడీపీకి తెలుసునని చెప్పారు. తాము కూడా మొదటి నుంచి అదే చెబుతున్నామన్నారు. కేంద్రం హామీ ఇచ్చిన ప్యాకేజీ తీసుకొని ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని చెప్పారు. ప్యాకేజీ చాలా అద్భుతమని చంద్రబాబు గతంలో చెప్పారని జీవీఎల్ గుర్తు చేశారు. ప్యాకేజీ ఇచ్చిన కేంద్రానికి చంద్రబాబు కృతజ్ఞతలు కూడా చెప్పారన్నారు. అయినా ఇప్పుడు ఈ గోల ఏమిటని ప్రశ్నించారు.

ఇచ్చిన నిధులను ఎలా వెచ్చించారో ప్రశ్నిస్తే, సమాధానం ఇవ్వలేని చంద్రబాబు ప్రభుత్వం తమను విమర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  యూపీఏ హయాంలో ఎంత వచ్చింది, ఎన్డీయే హయాంలో ఎంత వచ్చిందో చంద్రబాబు వద్ద లెక్కలు ఉన్నాయని జీవీఎల్ చెప్పారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారే తప్ప తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేయడం లేదన్నారు. ఈశాన్య రాష్ట్రాలను - హిమాచల్ - ఉత్తరాఖండ్ - జమ్ము కాశ్మీర్‌ లను మినహాయిస్తే మరే ఇతర రాష్ట్రానికి ఇవ్వనంతగా ఏపీకి ఇచ్చామన్నారు. నాడు ప్యాకేజీకి అంగీకరించిన చంద్ర‌బాబు... ఇప్పుడు హోదా గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. నిధుల లెక్కచెప్పమంటే చంద్రబాబు మూడు చెరువుల నీళ్లు తాగుతున్నారన్నాని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ప్రజాస్వామ్యానికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అసెంబ్లీని పార్టీ ఆఫీస్ చేశారని చంద్రబాబుపై జీవీఎల్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీకీ ప్రతిపక్షాన్ని రాకుండా చేశారని ఆరోపించారు. కేంద్రం మంజూరు చేసిన నిధులకు వినియోగ పత్రాల స్థానంలో ఉత్తుత్తి కాగితాలు పంపడం ఏమిటని జీవీఎల్ ప్రశ్నించారు. వెనుకబడిన ఏడు జిల్లాల్లో పరిశ్రమలు స్థాపిస్తే రాయితీలు ఇస్తామని 2016లో కేంద్రం సమాచారం పంపినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. టీడీపీ స‌ర్కారు కేంద్రానికి పంపామ‌ని చెబుతున్న‌ వినియోగ పత్రాలు అన్నీ ఫేక్ అని ఆయ‌న తేల్చేశారు.  మొత్తంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా రాద‌ని చంద్ర‌బాబుకు ముందే తెలుసునంటూ జీవీఎల్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఇప్పుడు నిజంగానే వైర‌ల్‌ గా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News