మోడీ-కేసీఆర్ భేటీపై టీబీజేపీ తెగ‌ ఫీల‌వుతోంది

Update: 2017-08-03 14:23 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఏకాంతంగా సుమారు గంట పాటు స‌మావేశం అవ‌డం - ప‌రిపాల‌న మొద‌లుకొని రాజ‌కీయాల వ‌ర‌కు సుదీర్ఘంగా చ‌ర్చించిన తీరు తెలంగాణ బీజేపీలో క‌ల‌వ‌రానికి దారితీసినట్లు క‌నిపిస్తోంది. మోడీజీతో త‌న స‌మావేశంలో అనేక అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయ‌నే విష‌యాన్ని స్వ‌యంగా కేసీఆర్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క విప్ల‌వాత్మ‌క ప‌థ‌కం బీజేపీ ఖాతాలో లేద‌ని, పార్టీ బ‌ల‌ప‌డటం అంత ఈజీ కాద‌ని - నోట్ల ర‌ద్దు-జీఎస్టీ ఫ‌లితాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలని త‌ను ప్ర‌ధానితో స‌మావేశం అయిన స‌మ‌యంలో చెప్పిన‌ట్లు కేసీఆర్ వివ‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే, మోడీజీ తో కేసీఆర్ మీటింగ్ ముగిసి సుమారు వారం దాటిన‌ప్ప‌టికీ తెలంగాణ బీజేపీ నేత‌ల‌కు ఈ ప‌రిణామం మింగుడు ప‌డ‌టం లేదని ఆ పార్టీ వ్య‌వ‌హారాలు తెలిసిన వారు అంటున్నారు.

తాజాగా తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోడీ ఏకాంతంగా మాట్లాడిన విషయాలను సీఎం కేసీఆర్ మీడియాతో చెప్పడం సరికాదని అన్నారు. వ్య‌క్తిగ‌తంగా మాట్లాడిన అంశాల‌ను మీడియాకు వివ‌రించ‌డంపై కేసీఆర్ ఆలోచించుకోవాల‌ని వ్యాఖ్యానించారు. పైగా ప్రధానమంత్రి మాటలను ముఖ్యమంత్రి  వక్రీకరించార‌ని అన్నారు. ముస్లిం రిజర్వేషన్ లకు ఎప్పుడు మోడీజీ వ్యతిరేకమేన‌ని అన్నారు. ముస్లిం రిజర్వేషన్ లపై పార్టీలో ఒకే నిర్ణయం ఉంటుందని కృష్ణ‌సాగ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ ప్రధాని మాటలను వక్రీకరించడం సరికాదని అన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ తాజా విలేక‌రుల స‌మావేశాన్ని దృష్టిమ‌ళ్లింపు చ‌ర్య‌గా భావిస్తున్నామ‌ని కృష్ణ‌సాగ‌ర్ రావు తెలిపారు. నేరేళ్ల‌ బాధితులు జైలు నుంచి విడుద‌ల అవుతున్న నేప‌థ్యంలో మీడియా దృష్టి మళ్లించిన మీడియా మీట్ గా భావిస్తున్నామ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు తెరాస బాధ్య‌త వహించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. తాము ద‌ళితులం అని చెప్పుకొనేందుకు కేసీఆర్ పాలనలో దళితులు బోర్డులు పెట్టుకోవాలా? అని నిల‌దీశారు. ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడని కృష్ణ‌సాగ‌ర్ రావు మండిప‌డ్డారు. ప్రతిపక్షాలను కించ పరిచేలా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.
Tags:    

Similar News