కృష్ణంరాజును ఆంధ్రోళ్లు బ‌హిష్క‌రిస్తే బెట‌ర్ అట‌!

Update: 2018-07-23 08:55 GMT
అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా పార్టీ మారినా ఒక‌నాటి త‌మ బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న‌ను ఎంపీగా ఆద‌రించిన పెద్ద మ‌న‌సు ఆంధ్రోళ్ల‌ది. ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు అలియాస్ రెబ‌ల్ స్టార్‌ కృష్ణం రాజుగా సుప‌రిచితుడైన ఆయ‌న్ను తెలుగు ప్రజ‌లు ఆద‌రించి అభిమానించారు. తెలుగు ప్ర‌జ‌ల్లో త‌న‌కున్న రీల్ క్రేజ్ ను రియ‌ల్ గా ప్ర‌యోజ‌నం పొందారు.

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వ‌చ్చిన ఒక‌నాటి రెబ‌ల్ స్టార్ 1991లో కాంగ్రెస్ లో చేరారు. అదే ఏడాది న‌ర్సాపురం లోక్ స‌భ స్థానం నుంచి పోటీ చేసిన ఆయ‌న టీడీపీ అభ్య‌ర్థి భూప‌తిరాజు విజ‌య‌కుమార్ రాజు చేతిలో ఓడిపోయారు. కొంత‌కాలం రాజ‌కీయాల్లో దూరంగా ఉన్న ఆయ‌న సినిమాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. మ‌ళ్లీ ఏడేళ్ల త‌ర్వాత 1998లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీలో చేరి న‌ర్సాపురం లోక్ స‌భ నుంచి పోటీ చేశారు.

మొద‌టి ఎదురుదెబ్బకు ప్ర‌తిగా ప్ర‌జ‌లు ఆయ‌న్ను గెలిపించి ఎంపీని చేశారు. అనంత‌రం ఏడాదికే జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం సాధించిన కృష్ణంరాజు వాజ్ పేయ్ స‌ర్కారులో కేంద్ర‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. ఆ సంద‌ర్భంగా ఏపీకి ఆయ‌నేం చేసింద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. గుర్తు పెట్టుకునేందుకు వీలుగా ఏ ఒక్క ప‌ని చేయ‌ని ఆయ‌న త‌ర్వాతి ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. చిరంజీవి పెట్టిన ప్ర‌జారాజ్యంలో చేరిన ఆయ‌న త‌ర్వాతి కాలంలో మ‌రోసారి బీజేపీ కండువా క‌ప్పుకున్నారు.

పార్టీల‌ను మార్చేసిన కృష్ణం రాజు.. తన భుజాన ఉన్న కండువాకు ఇచ్చే విలువ కూడా ఆంధ్రోళ్ల ప్ర‌యోజ‌నాలకు ఇవ్వ‌రా? అన్న డౌట్ రాక మాన‌దు. ఏపీ విభ‌జ‌న సంద‌ర్భంగా జ‌రిగిన న‌ష్టం ఒక ఎత్తు అయితే.. ఆ సంద‌ర్భంగా ఏపీకి ఇచ్చిన హామీల విష‌యంలో మోడీ స‌ర్కారు ఏం చేసిందో అంద‌రికి తెలిసిందే. ఇలాంటి వేళ‌.. ఏపీ ప్ర‌జ‌ల త‌ర‌ఫున త‌మ గ‌ళాన్ని వినిపించి సొంత ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల గురించి ఒత్తిడి తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంది.

కానీ.. ఇందుకు భిన్నంగా ఆయ‌న తాజా మాట‌లు ఉండ‌టం చూస్తే.. త‌న‌కెంతో చేసిన ఆంధ్రోళ్ల‌కు కృష్ణంరాజు ఏమీ చేయ‌రా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. అవిశ్వాసం సంద‌ర్భంగా 18 పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టామ‌ని చెప్పార‌ని. కానీ ఏపీకి అన్యాయం జ‌రిగింద‌న్న విష‌యాన్ని ఏ ఒక్క పార్టీతో చెప్పించ‌క‌పోయార‌న్నారు.

ఏపీకి జ‌రిగిన అన్యాయాన్ని ఎవ‌రూ ప్ర‌స్తావించ‌క‌పోవ‌టం వెనుక ఆ పార్టీల త‌ప్పు కంటే కూడా ఆంధ్రోళ్ల‌లో ఉన్న అనైక్య‌తే ఎక్కువ‌గా క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. అలాంటి విష‌యానికి బాధ ప‌డ‌టం మాని రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌టం చూస్తే.. ఏపీకి ప‌ట్టిన తెగులు ఏమిటో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం కేంద్రం నిధులు కేటాయించింద‌ని చెబుతున్న కృష్ణంరాజు మాట‌ల్ని చూస్తే.. అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా టీడీపీ ఎంపీలు గ‌ల్లా జ‌య‌దేవ్‌.. రామ్మోహ‌న్ నాయుడు చేసిన ప్ర‌సంగాల్ని ఆయ‌న విన‌లేదా? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు. దుర‌దృష్టం ఏమంటే.. త‌మ‌ను అభిమానించి.. ఆద‌రించిన ప్ర‌జ‌ల‌కు నేత‌లు ఏమీ చేయ‌కున్నా ఫ‌ర్లేదు.. కానీ వారి భ‌విత‌ను దెబ్బ తీసేలా మాట్లాడేందుకు సైతం వెనుకాడ‌క‌పోవ‌టం చూస్తే.. ఈ వ‌య‌సులో ఆంధ్రోళ్ల చేత తిట్లు తినాల‌ని ఒక‌నాటి రెబ‌ల్ స్టార్ భావిస్తున్నారా? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు.


Tags:    

Similar News