మోడీ అండ్ కో ఇంకా రంగంలోకి రాలేద‌ట‌

Update: 2018-06-09 05:35 GMT
జ‌నాద‌ర‌ణ లేని కొంద‌రు నేత‌లు జాతీయ పార్టీలో కీల‌క పాత్ర పోషిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద‌గా సుప‌రిచితం కాని ఇద్ద‌రు నేత‌లు.. బీజేపీ జాతీయ పార్టీలో కీల‌క భూమిక పోషిస్తుంటారు. వారిలో న‌ర్సింహ‌రావు ఒక‌రైతే ముర‌ళీధ‌రరావు ఇంకొక‌రు. వీరికి జ‌నాల్లో ప‌ట్టు ఎంత ఉంద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. బీజేపీలో పేరున్న నేత‌ల‌తో పాటు.. మోడీకి సన్నిహితుల జాబితాలో వీరి పేర్లు త‌ర‌చూ వినిపిస్తూ ఉంటాయి.

మోడీ కార్యాచ‌ర‌ణ‌ను తూచా త‌ప్ప‌కుండా నిర్వ‌హించే వీరు బీజేపీలో కీల‌క‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వివిధ రాష్ట్రాల్లో పార్టీకి సంబంధించిన వ్యూహాల్ని అమ‌లు చేయ‌టంలో దిట్ట‌లు. అలాంటి వారిలో ఒక‌రు బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర‌రావు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

బీజేపీతో బాబు క‌టీఫ్ చేసుకోవ‌టం తాము ఊహించిందే అన్న ఆయ‌న‌.. త‌మ అంచ‌నాల‌కు భిన్నంగా బాబు వ్యూహాత్మ‌కంగా ఎన్నిక‌ల‌కు ఏడాది ముందే విడాకులు ఇచ్చార‌న్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఆర్నెల్ల ముందు బీజేపీతో టీడీపీ వీడిపోతుంద‌ని తాము ఊహించామ‌ని.. కానీ అందుకు భిన్నంగా మ‌రికాస్త ముందే బ‌య‌ట‌కు వెళ్లిపోయార‌న్నారు.

రాజ‌కీయంగా చూసిన‌ప్పుడు బాబు చేసింది త‌ప్పు కాద‌న్న ముర‌ళీధ‌ర‌రావు.. కేంద్రానికి వ్య‌తిరేకంగా ఆంధ్రా ప్ర‌జ‌ల్ని రెచ్చ‌గొట్టి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌న్న వ్యూహం నెర‌వేరుతుంద‌న్న‌ది స‌రికాద‌న్నారు. బాబును ఓడించ‌టం అంత  మామూలు విష‌యం కాద‌ని.. ఆయ‌న్ను ఓడించాలంటే ముందు చాలా శ‌క్తుల్ని ఓడించాల‌ని.. అందుకు ఎన్నో ప్లాన్లు వేయాల‌న్నారు.

బాబును మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిని కాకుండా చూడ‌ట‌మే త‌మ ల‌క్ష్యంగా పేర్కొన్నారు. ఏపీలో బీజేపీ ఇంకా రంగంలోకి దిగ‌లేద‌ని.. బాబును ఓడించ‌టానికి కొత్త పార్టీలు.. కొత్త వేదిక‌లు రానున్న‌ట్లుగా చెప్పారు. ఎన్నిక‌ల నాటికి ఏ అంశాలు ప్ర‌ధానంగా మార‌తాయ‌న్న‌ది ఇప్పుడే చెప్ప‌లేమ‌న్న ఆయ‌న‌.. ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోతే ఆ పార్టీ ఆస్తిత్వానికే ముప్పు అన్న ఉద్దేశంతోనే బాబు రాజ‌కీయ క్రీడ‌ను షురూ చేశార‌న్నారు.

గ‌తంలో చిరంజీవి ఫెయిల్ అయిన‌ట్లే ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఫెయిల్ అవుతార‌న్న ముర‌ళీధ‌ర‌రావు.. బీజేపీ.. మోడీ.. అమిత్ షాల‌ను అంచ‌నా వేయ‌గ‌ల నేత‌ల్లో బాబు ఒక‌ర‌ని.. ఆయ‌న ఏ ప‌రిణామాన్ని అంత తేలిగ్గా వ‌దిలిపెట్ట‌రంటూ విశ్లేషించారు. త‌మ శ‌క్తియుక్తుల మీద న‌మ్మ‌కంతో పాటు.. ప్ర‌త్య‌ర్థి బ‌లం మీదా వాస్త‌విక ధోర‌ణి అరుదుగా క‌నిపిస్తుంటుంది. అలాంటి వైఖ‌రి త‌మ‌కు పుష్క‌లంగా ఉంద‌న్న విష‌యాన్ని ముర‌ళీధ‌ర‌రావు త‌న తాజా వ్యాఖ్య‌ల‌తో స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి. మ‌రింత ప్రాక్టిక‌ల్ గా ఉన్న ఆయ‌న కార‌ణంగా ఏపీలో బీజేపీకి ఏమాత్రం లాభం చేకూరుతుందో చూడాలి.


Tags:    

Similar News