అవిశ్వాసం త‌ర్వాత ఏం జ‌ర‌గ‌నుందంటే..

Update: 2018-07-22 06:42 GMT
ఊహించిన రీతిలోనే..తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాసం వీగిపోయిన సంగ‌తి తెలిసిందే.  ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నరేంద్రమోడీ ప్రభుత్వం మూడింట రెండువంతుల మెజారిటీతో ఓడించింది. ఈ అవిశ్వాస తీర్మానంతో ప్రతిపక్షాలు నాలుగేళ్ల‌ ఎన్డీయే సర్కార్‌ కు ఎటువంటి ముప్పును కలిగించలేదు. అయితే ఈ ఎపిసోడ్ ఆధారంగానే ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో ఆయా పార్టీల వైఖరి ఎలా ఉండబోతున్నదన్నది మాత్రం బయటపడిందని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. అధికార బీజేపీ - ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌ - అవిశ్వాసం పెట్టిన టీడీపీ - అనూహ్యంగా ట్విస్ట్ ఇచ్చిన శివ‌సేన‌ - టీఆర్ ఎస్ పార్టీల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ప్ర‌ధానంగా అధికార‌ బీజేపీలో ధీమా పెరిగింద‌ని చెప్తున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని బీజేపీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని విజయం సాధించిందనడంలో సందేహం లేదు. సభలోని 70 శాతానికి పైగా సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. కానీ అంతకుముందు మధ్యాహ్నం చర్చ సందర్భంగా - రాహుల్‌ గాంధీ దూకుడు - ఆయన ప్రధాని మోడీ - బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాపై వ్యక్తిగతంగా చేసిన విమర్శలు - ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు కొద్దిసేపు అధికారపక్షంలో కలవరం రేపాయి. అయితే ఆ తరువాత ప్రధాని చేసిన ప్రసంగంతో బీజేపీ శ్రేణులు కొంత ఊరట చెందినట్టు చెప్తున్నారు. లోక్‌ సభలో అవిశ్వాస తీర్మానాన్ని తాము ఓడించడం 2019 ఎన్నికల్లో తాము సాధించబోయే విజయానికి సంకేతం అని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ట్వీట్ చేయ‌డం ఆ పార్టీ ఆలోచ‌న‌కు నిద‌ర్శ‌న‌మ‌ని విశ్లేషిస్తున్నారు.

ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీది మ‌రో చిత్ర‌మైన ప‌రిస్థితి. లోక్‌ సభలో ప్రభుత్వంపై అవిశ్వాసం నెగ్గదని కాంగ్రెస్‌ కు ముందే తెలుసు కానీ ఈ అవకాశాన్ని ప్రభుత్వంపై దాడి చేయడానికి - రాహుల్‌ గాంధీని బలీయమైన నాయకునిగా చూపడానికి ఉపయోగించుకోవాలని భావించిందంటున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ తనకు లభించిన అవకాశాన్ని ఉపయోగించుకోగలిగింది. రాహుల్‌ గాంధీ ఎంతో విశ్వాసంతో - పరిణతి చెందిన నాయకుడిలా మాట్లాడారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆద్యంతం ఆయన ప్రసంగం - చివరగా వెళ్లి ప్రధానిని ఆలింగనం చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మొత్తంగా రాహుల్ వ్యవహరించిన తీరు కాంగ్రెస్‌ కు సానుకూలంగా పరిణమించిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ సానుకూలతను వచ్చే ఎన్నికల నాటికి ఓట్లుగా మలచుకోవడం ఆ పార్టీ ముందున్న సవాలుగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామన్న హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్న కారణంతో లోక్‌ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన టీడీపీ ఏం సాధించింద‌నేది అంతుచిక్క‌ని ప్ర‌శ్నం. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం చర్చలో పాల్గొన్న అనేకమంది ఇతర పార్టీలకు చెందిన సభ్యుల్లో కొందరు మాత్రమే ఆ అంశాన్ని ప్రస్తావించారు. ప్రసంగించిన వారందరూ పలు ఇతర అంశాలను సభముందుకు తెచ్చారు. తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపైనే పార్లమెంట్‌ లో 12 గంటల పాటు ఏకధాటిగా చర్చ జరిగిందన్న అంశం ఏపీలో ఆ పార్టీకి సానుకూలత త‌ప్ప‌...స్థూలంగా పొందిన ప్ర‌యోజ‌న‌మోమీ లేద‌ని..పైగా బాబు యూట‌ర్న్ నాయ‌కుడిగా లోకానికి తెలిసిపోయార‌ని అంటున్నారు. ఇక తెలంగాణ‌లో అధికార‌ప‌క్ష‌మైన టీఆర్ ఎస్ పార్టీ రాష్ట్రం కోసం త‌ట‌స్థ వ్యూహం ప‌న్నిన‌ట్లుగా ప్ర‌చారం చేసుకుంటున్న‌ప్ప‌టికీ ఆ పార్టీకి న‌ష్టం క‌లిగిన‌ట్లు స్ప‌ష్టం అవుతోందంటున్నారు. ప్ర‌త్యామ్నాయ కూట‌మి నాయ‌కుడిగా నిల‌వాల‌ని భావిస్తున్న కేసీఆర్‌...మోడీని ఎదుర్కునే చాన్స్ వ‌చ్చిన‌ప్ప‌టికీ...ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చేలా వ్య‌వ‌హ‌రించార‌ని, భ‌విష్య‌త్‌ లోనూ ఇదే రీతిలో స‌ఖ్య‌త‌తో ఉంటార‌ని స్ప‌ష్టం చేసిన‌ట్ల‌యింది.

కాగా, క‌ల‌హాల కాపురం అన్న‌ట్లుగా సాగుతున్న శివ‌సేన‌-బీజేపీల బంధం మ‌రో మ‌లుపు తిరిగింది. అటు కేంద్రంలో ఇటు మహారాష్ట్రలో అధికారపక్షంగా ఉన్న శివసేన అనూహ్య నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తొలుత గురువారం మధ్యాహ్నం ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతునివ్వాలని నిర్ణయించింది. తిరిగి సాయంత్రానికి మాట మార్చి శుక్రవారం నాటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. చివరికి అవిశ్వాస తీర్మానాన్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. శివసేన ఊగిసలాట ధోరణి బీజేపీతో ఆ పార్టీకి ఉన్న సంక్లిష్ట సంబంధాలను వెల్లడిస్తున్నాయి. శివసేన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. బీజేపీ నుంచే తమ పార్టీ అస్థిత్వానికి ముప్పు ఎదురవుతున్నదని ఆ పార్టీ భావిస్తున్నది. ఇటువంటి వైఖరితో శివసేన బీజేపీతో ఇమడలేపోతున్నది అలాగని బయటికీ రాలేకపోతుంద‌ని, ఇది తాజాగా మ‌రోమారు స్ప‌ష్ట‌మైంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News