అది చూసి మురిసిపోతే.. ఫూల్ అయినట్టే!

Update: 2018-02-01 16:09 GMT
బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం జరిగిందని.. భారతీయ జనతా పార్టీ తప్ప.. తతిమ్మా అన్ని పార్టీల నాయకులు ముక్తకంఠంతో చెబుతున్నారు. భాజపాకు సంబంధించి.. అసలు స్పందించడానికి కీలక నాయకులు ఎవ్వరూ తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో లేరు. అంతా అమిత్ షాతో భేటీకి దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ పునాదులతో సహా పెకలించడానికి.. సారీ - పునాదుల్ని గట్టి చేసుకోవడానికి ఢిల్లీకి వెళ్లారు. ఇలాంటి సమయంలో... వచ్చిన కేటాయింపుల్ని గురించి టముకు వేయడానికి ఇక్కడ మిగిలిన కమల నాయకులు - టీవీ డిస్కషన్లలో నోటికొచ్చినట్లల్లా మాట్లాడుతున్నారు.

అయితే ఇక్కడో సంగతిని గమనించాల్సి ఉంది. ఏపీ కేటాయింపుల్లో పరిశ్రమలకు పన్ను రాయితీ అనే హెడ్ కింద 50 కోట్ల రూపాయలు కేటాయించారు. నిజానికి రాష్ట్రానికి విభజన చట్టం అనుమతించిన మేర ప్రత్యేక హోదా అనేదే గనుక వచ్చినట్లయితే.. ఎవరూ ఎలాంటి ముష్టి వేయాల్సిన అవసరం లేకుండానే.. పరిశ్రమలకు పన్ను రాయితీలు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. దానివల్ల పరిశ్రమలు రావడం పెరుగుతుంది. దాని స్థానంలో - హోదాను ఎగ్గొట్టి.. ప్యాకేజీ అని గతంలో జైట్లీ ప్రకటించారు. అందులో కూడా కొన్ని పన్ను రాయితీలు ఉన్నాయి. కానీ.. అవి ఎప్పటికి ఇస్తారో ఇంకా తేల్చలేదు.

తాజాగా బడ్జెట్ కేటాయింపుల్లో కనిపించిన పన్ను రాయితీ అనే పదం.. ఏపీ ప్రయోజనాల మీద ప్రత్యేక శ్రద్ధతో.. ప్యాకేజీలో భాగంగా ఇచ్చినదేమో.. అని ఎవరైనా మురిసిపోతే గనుక.. పప్పులో కాలేసినట్లే అని పలువురు అంటున్నారు. ఎందుకంటే ఏ రకంగా చూసినా కూడా ఇది ఏపీకి మాత్రం ప్రత్యేకంగా ఇచ్చిన ప్యాకేజీ కాదు. పొరుగున ఉన్న తెలంగాణకు కూడా ఇదే హెడ్ కింద మరో యాభై కోట్ల రూపాయలను కేటాయించడం గమనిస్తే ఆ సంగతి మనకు అర్థం అవుతుంది. అంటే ప్యాకేజీకి సంబంధించిన ఏ చిన్న హామీని కూడా బడ్జెట్ లో చూపించకుండా.. పన్ను రాయితీ మొత్తం అనే మరో పదంతో చిన్న మతలబు చేశారన్నమాట. రాష్ట్ర భాజపా నాయకులు అవగాహన లేమితో దీన్ని గురించి పాజిటివ్ గా డబ్బా కొట్టడం ప్రారంభిస్తే.. ప్రజలు ఛీత్కరిస్తారని వారు తెలుసుకోవాలి. కానీ.. ఈ బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు కలిగించిన అసంతృప్తి నేపథ్యంలో.. ఇక్కడి భాజపా నాయకులు.. టీవీ డిస్కషన్ల తరువాత.. ఎక్కడి వారక్కడ తేలుకుట్టిన దొంగల్లా గప్ చుప్ గా ఉండిపోతున్నారు అని ప్రజలు వ్యాఖ్యలు రువ్వుతున్నారు.
Tags:    

Similar News