ప‌వ‌న్ తీరుపై బీజేపీ నేత‌ల కొత్త విశ్లేష‌ణ‌

Update: 2016-12-22 18:30 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యంలో జనసేన పార్టీ అధ్యక్షులు - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడ్డంగా బుక్క‌య్యారా? త‌న కామెంట్ల‌తో స్వ‌యంగా తానే ప‌వ‌న్ విమ‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇచ్చారా? ఇటీవ‌లి కాలంలో ప‌వ‌న్‌ త‌ర‌చుగా విమ‌ర్శిస్తున్న బీజేపీ నేత‌లు ఇందుకు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు. వ‌రుస ట్వీట్లతో క‌ల‌క‌లం రేకెత్తిస్తున్న ప‌వ‌న్ తన‌ తాజా ట్వీట్‌ లో భాగంగా బీజేపీ నేత‌ల‌కు ఎంతో రాజకీయ అనుభవం - రాజ్యాంగం పైన పట్టు ఉండి కూడా నోట్ల రద్దు వంటి 'ఘోర తప్పిదాన్ని' ఎలా చేశారని ప్రశ్నించారు. ఇపుడు అదే ప్ర‌శ్న‌ను బీజేపీ నేత‌లు ప‌వ‌న్‌ కు సంధిస్తున్నారు. ఘోర త‌ప్పిదం అని ఇపుడు చెప్తున్న ప‌వ‌న్ గ‌తంలో ఎలా స‌మ‌ర్థించార‌ని క‌మ‌ళ‌నాథులు క‌స్సుమంటున్నారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా విషయంలో వ‌రుస స‌భ‌లు ఏర్పాటుచేసిన ప‌వ‌న్ ఈ క్ర‌మంలో విద్యార్థుల‌తో కూడా ముచ్చ‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నవంబర్ 8వ తేదీన నోట్ల రద్దు ప్రకటన చేయ‌గా న‌వంబ‌ర్ 11వ తేదీన అనంతపురం జిల్లా గుత్తి కాలేజీలో విద్యార్థులతో ప‌వ‌న్ ముఖాముఖి స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఓ విద్యార్థి నోట్ల రద్దుపై ప‌వ‌న్ వైఖ‌రిని ప్ర‌శ్నించారు. దీనికి పవన్ స్పందిస్తూ.. డబ్బులు పంచి ఓట్లు కొనుక్కునే స్థాయికి మన నాయకులు వచ్చారని పేర్కొంటూ పెద్ద నోట్లు రద్దు చేయడం మంచి పని అని ప‌వ‌న్ స్వాగ‌తించారు. బ్లాక్ మనీని బయటకు తీసుకు రావాల్సిన అవసరం ఉందని చెప్తూ..దీనిని తీసుకు వచ్చే విధానంలో ఇబ్బందులు పడొచ్చని కూడా వ్యాఖ్యానించిన తీరును ఏపీ బీజేపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు.

అయితే తాజాగా ప‌వ‌న్ మాట మార్చారని బీజేపీ నేత‌లు అంటున్నారు. మాట మార్చ‌డంతో స‌రిపెట్ట‌కుండా చారిత్రాత్మక తప్పిదమని చెప్పడం ఏమిటని క‌మ‌ళ‌నాథులు ప్ర‌శ్నిస్తున్నారు. ఒక‌వేళ ప్ర‌జా స‌మ‌స్య‌ల రీత్యానే నోట్ల ర‌ద్దును ప‌వ‌న్ త‌ప్పుప‌డితే.. ముందుగా స్వాగ‌తించ‌డం, పైగా స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని చెప్ప‌డం ఏమిట‌ని ప‌లువురు బీజేపీ నేత‌లు అంటున్నారు. ఇపుడు హ‌ఠాత్తుగా మారింది ప‌వ‌న్ వైఖ‌రా లేఖ ప‌రిస్థితుల్లో మార్పా అనేది అర్థం కావ‌డం లేద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్తీక‌రించ‌డంలో చారిత్రాత్మిక త‌ప్పిద‌మ‌ని పేరు పెట్ట‌డం ఏమిట‌ని విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. కాక‌తాళీయంగా త‌మ మ‌రో మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు సైతం ఇదే రీతిలో యూట‌ర్న్ తీసుకున్నార‌ని బీజేపీ నాయ‌కులు అంటున్నారు. పెద్ద నోట్ల ర‌ద్దును ముందుగా స్వాగ‌తించడ‌మే కాకుండా.. అస‌లు ఆ స‌ల‌హా ఇచ్చిందే తాను అని చెప్పిన బాబు అనంత‌రం అస‌హ‌నం వ్య‌క్తం చేస్తుండ‌టాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారని బీజేపీ శ్రేణులు అంటున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News