పోల‌వ‌రంలో బాబు అవినీతి... బీజేపీ సైలెన్స్ ఎందుకో?

Update: 2019-07-27 14:30 GMT
ఏపీలో మొన్న‌టిదాకా సీఎంగా ఉండి ఇప్పుడు విప‌క్ష నేత‌గా మారిపోయిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు త‌న పాల‌న‌లో చాలా అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని - ప్ర‌త్యేకించి ఏపీకి జీవ‌నాడిగా ప‌రిగ‌ణిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్ర‌బాబు పెద్ద ఎత్తున అక్ర‌మాల‌కు పాల్ప‌డ్దార‌ని జ‌గ‌న్ స‌ర్కారు తేల్చేసింది. పోల‌వ‌రం అక్ర‌మాల‌పై జ‌గ‌న్ స‌ర్కారు నియ‌మించిన క‌మిటీ ఈ మేర‌కు నిన్న‌నే ప్ర‌భుత్వానికి ఓ నివేదిక‌ను కూడా స‌మ‌ర్పించింది. స‌రే... చంద్ర‌బాబు అక్ర‌మాల‌పై జ‌గ‌న్ స‌ర్కారు త‌న‌దైన శైలిలో ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేస్తుంటే... పోల‌వ‌రాన్ని బాబు త‌న ఏటీఎంగా మార్చుకున్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన బీజేపీ మాత్రం ఈ విష‌యంపై నోరెత్త‌కపోవ‌డం నిజంగానే ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. తాను చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌ని జ‌గ‌న్ తేల్చేసినా... ఇప్పుడు క‌మ‌ల‌నాథులు ఈ విష‌యంపై ప‌ల్లెత్తు మాట కూడా అన‌డం లేదు. దీని వెనుక బీజేపీ ప్ర‌త్యేకంగా ఏదైనా వ్యూహాన్ని ర‌చించిందా? అన్న అనుమానాలు కూడా ఇప్పుడు క‌లుగుతున్నాయి.

పోల‌వ‌రం అక్ర‌మాల‌పై జ‌గ‌న్ నియ‌మించిన క‌మిటీ... బాబు హ‌యాంలో రూ.3 వేల కోట్ల‌కు పైగా అక్ర‌మాలు చోటుచేసుకున్నాయ‌ని - కేంద్రం నిధులు అంద‌జేస్తున్న పోల‌వ‌రంలోనే చంద్ర‌బాబు ఈ మేర అవినీతికి పాల్ప‌డితే... ఇక రాష్ట్రంలోని మిగిలిన ప్రాజెక్టులు - ప‌థ‌కాల‌ను బాబు స‌ర్కారు ఏ రీతిన అమలు చేసిందో ఇట్టే అర్థం కాక మాన‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. త‌మ‌తో పొత్తును తెంచుకున్న చంద్ర‌బాబును బీజేపీ నేత‌లు బాగానే టార్గెట్ చేశారు. పొత్తు ఉన్న‌ప్పుడు కూడా సోము వీర్రాజు లాంటి నేత‌లు బాబు అవినీతిపై త‌మ‌దైన శైలి వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక బీజేపీతో పొత్తు తెంచుకున్న చంద్ర‌బాబును ప్ర‌ధాని మోదీ కూడా నేరుగానే టార్గెట్ చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు ఏపీకి వ‌చ్చిన సంద‌ర్బంగా పోల‌వ‌రాన్ని బాబు ఏటీఎంలా మార్చుకున్నార‌ని కూడా మోదీ సంచ‌ల‌న కామెంట్ చేశారు. కేంద్రం నుంచి నిధులు అందుతున్న పోల‌వ‌రంలోనే చంద్ర‌బాబు అవినీతికి పాల్ప‌డితే... ఇక రాష్ట్రంలో బాబు ఏ రీతిలో త‌న‌దైన విశ్వ‌రూపాన్ని చూపారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేద‌ని కూడా మోదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

స‌రే... ఇదంతా గ‌తం అనుకుంటే మోదీ ఆరోపించిన‌ట్లుగానే పోల‌వ‌రం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన నిధుల‌ను బాబు స‌ర్కారు బొక్కేసింద‌ని - ఏకంగా రూ.3 వేల కోట్ల‌కు పైగా మేసేసింద‌ని కూడా జ‌గ‌న్ స‌ర్కారు చాలా క్లియ‌ర్ గానే బ‌య‌ట‌పెట్టింది. దీనిపై త‌మ‌దైన శైలిలో విరుచుకుప‌డుతుంద‌ని భావించిన బీజేపీ... అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అస‌లు పోల‌వ‌రంలో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు త‌మ దృష్టికే రాలేద‌ని కూడా ఆ పార్టీ ప్ర‌భుత్వ సాక్షాత్తు పార్ల‌మెంటు వేదిక‌గానే చెప్పేసింది. దీంతో బాబుపై దాడిలో బీజేపీ వ్యూహం మారింద‌న్న‌వాద‌న ఇప్పుడు బలంగానే వినిపిస్తోంది. బాబుపై వ్యూహం మార్చుకోకుంటే.... ఇప్ప‌టికే టీడీపీపైనా - బాబుపైనా బీజేపీ నేత‌లు విరుచుకుప‌డేవారే క‌దా. అంతేకాకుండా తాము నిధులు ఇస్తున్న పోల‌వ‌రంలోనే బాబు అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వైనాన్ని జ‌గ‌న్ స‌ర్కారు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు బ‌య‌ట‌పెట్టినా కూడా బీజేపీ నేత‌లు కిమ్మ‌న‌కుండా ఉండిపోయారంటే... వ్యూహం మారిన‌ట్టే క‌దా. మ‌రి ఈ వ్యూహం ఏమిట‌న్న‌ది ఎప్ప‌టికి బ‌య‌ట‌ప‌డుతుందో చూడాలి.


Tags:    

Similar News