చిరు వైపు బీజేపీ చూపు...ఎన్నెన్ని ఈక్వేషన్లో?

Update: 2019-06-25 13:04 GMT
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి... రాజకీయాలపై దాదాపుగా ఆసక్తిని చంపేసుకున్నారు. ఎన్నో ఆశలతో 2009 ఎన్నికలకు ముందు రాజకీయ రంగంలోకి దిగిన చిరు... ప్రజారాజ్యం పేరిట పార్టీని పెట్టి... 2009 ఎన్నికల్లో  18 అసెంబ్లీ సీట్లను గెలిచినా... పెద్దగా ప్రభావం చూపలేకపోయారన్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయంలో తన బలమెంతో తెలుసుకున్న చిరు... పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసి... కేంద్ర మంత్రి పదవి కాంక్షను తీర్చేసుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలగిన ఆయన తిరిగి సినీ తెరంగేట్రం చేసిన చిరు ఇప్పుడు సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. రాజకీయంలో తన స్థితి గతి ఏమిటో తెలుసుకున్న చిరు... ఇక రాజకీయాల్లోకి వచ్చేది లేదని దాదాపుగా సంకేతాలిచ్చేశారు. అయితే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం  తిరిగి చిరును ఎలాగోలా రాజకీయాల్లోకి లాగాలని - తన పార్టీలో చేర్చుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది.

ఈ మేరకు ఆయనతో భేటీ కోసం పార్టీలో కీలక నేతలను కూడా రంగంలోకి దించేసింది. అధిష్ఠానం ఆదేశాలతో హైదరాబాద్ లో తిష్ట వేసిన బీజేపీ నేతలు... చిరుతో భేటీ కోసం తమదైన శైలి యత్నాలు చేస్తున్నారు. నిన్న రాత్రే చిరుతో బీజేపీ నేతల భేటీ ఖాయమైందన్న వార్తలు వినిపించినా... ఆ భేటీ కార్యరూపం దాల్చలేదు. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడికి మల్లే బీజేపీ నేతలు చిరు అపాయింట్ మెంట్ కోసం యత్నిస్తూనే ఉన్నారట. అయినా రాజకీయాల్లో తన బలమేంటో తెలుసుకుని... రాజకీయాలకు తాను సరిపోనని తేల్చేసుకుని బుద్దిగా సినిమాలు చేసుకుంటున్న చిరును బీజేపీ నేతలు ఎందుకు కెలుకుతున్నారన్నదే ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారిందని చెప్పాలి. పార్టీలోకి వస్తామంటూ చాలా పార్టీలకు చెందిన చాలా మంది నేతలు క్యూ కడుతుంటే... వారిని అలా పక్కనపెట్టేసి చిరు కోసం బీజేపీ నేతలు ఎందుకు అర్రులు చాస్తున్నారన్న విషయం వైపు కాస్తంత తరచి చూస్తే... చాలా ఈక్వేషన్లే ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

వాటిలో ప్రధానమైనది టాలీవుడ్ లో పవర్ స్టార్ గా ఎదిగి రాజకీయాల్లోకి దిగేసిన జనసేనాని పవన్ కల్యాణ్ కు అడ్డుకట్ట వేయడం కోసమే... కమలనాథులు చిరు వైపు చూస్తున్నట్లుగా సమాచారం. ఏపీలో బలీయమైన శక్తిగా ఎదిగేందుకు పక్కా ప్లాన్ రచిస్తున్న బీజేపీ... ఇటు టీడీపీ నుంచే కాకుండా మిగిలిన ఏ పార్టీ నుంచైనా వస్తున్న నేతలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. అయితే రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులకు ఏ పార్టీ కూడా అండగా నిలవని పరిస్థితి. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిన చంద్రబాబు ఓ వైపు - కాపుల రిజర్వేషన్లు కేంద్రం పరిధిలోని అంశమంటూ చెప్పేసిన జగన్ వైపు కాపులు గంపగుత్తగా వెళ్లేందుకు సిద్ధంగా లేరు. వెరసి మెజారిటీ ఓట్ షేర్ ఉన్న కాపులు ఇప్పుడు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి.

ఇదే పరిస్థితి కొనసాగితే... కాపులు పవన్ వైపు వెళ్లేందుకే మొగ్గు చూపుతారన్నది కమలనాథుల అంచనా. ఈ నేపథ్యంలోనే కాపులను తమ వైపునకు తిప్పుకుంటే... ఏపీలో ఓ మోస్తరు సీట్లను సింగిల్ గానే సాధించేయొచ్చన్నది బీజేపీ భావన. ఈ ప్లాన్ లో భాగంగా చిరును లాగేస్తే... కాపుల్లో మెజారిటీ మంది తమ వైపునకు తిరిగినట్టేనన్నది ఆ పార్టీ భావనగా కనిపిస్తోంది. చిరు వస్తే... పవన్ వెంట ఉన్న కొద్దోగొప్పో కాపులు కూడా తమ వెంటే ఉంటారన్నది అంతిమంగా బీజేపీ నేతల అంచనా. ఈ ఈక్వేషన్ల నేపథ్యంలో రాజకీయాలు వద్దు మహాప్రభో అని చిరు అంటున్నా.. ఆయనను తిరిగి పాలిటిక్స్ లోకి లాగేందుకు బీజేపీ యత్నిస్తోందన్న మాట. చూద్దాం మరి కమలం నేతల గాలానికి చిరు చిక్కుతారో - లేదో.

   

Tags:    

Similar News