రాజీవ్ సంస్థ‌కు చైనా డ‌బ్బులు...సంచ‌ల‌న వివ‌రాలు వెల్ల‌డించిన బీజేపీ

Update: 2020-06-25 17:34 GMT
స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన భార‌త్-చైనా ఘర్ష‌ణ‌ల‌కు మించి ఇప్పుడు దేశంలో అదికారంలో ఉన్న బీజేపీ- కాంగ్రెస్‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. దేశ స‌రిహ‌ద్దుల‌ను తాక‌ట్టు పెట్టార‌ని కాంగ్రెస్ విమ‌ర్శిస్తుంటే...తాము చైనాను తిప్పికొట్టామ‌ని బీజేపీ స‌ర్కారు ప్ర‌క‌టిస్తోంది. అయితే, బీజేపీ తాజాగా ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ‌ల‌కు చైనా నుంచి నిధులు అందాయ‌ని ఆరోపించింది. బీజేపీ ముఖ్య‌నేత‌, కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ఈ మేర‌కు ఆయ‌న ప‌లు వివ‌రాలు వెల్ల‌డించారు. మ‌రోవైపు మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇందిరాగాంధీ గురించి సైతం ఆయ‌న కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు.


కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ ఫౌండేషన్‌కు చైనా ఎంబసీ నుంచి నిధులు వచ్చాయని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. 2005-06 సంవత్సరంలో పొందిన ఈ నిధుల‌కు సంబంధించి సాధారణ దాతల జాబితాలోనే దీన్ని కూడా చేర్చినట్టు చెప్పారు. రాజీవ్ ఫౌండేషన్‌కు సంబంధించిన అప్పటి వార్షిక రిపోర్టులో కూడా ఈ విష‌యాలు ఉన్నాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అయితే, చైనా నుంచి తీసుకున్న ఆ విరాళాలను ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా పేర్కొనలేదని ఆరోపించారు. ``కాంగ్రెస్ నాయ‌క‌త్వంలో న‌డిచిన అప్పటి యూపీఏ ప్రభుత్వం చైనా నుంచి లంచం తీసుకుందా? ఆ విరాళాలు తీసుకున్న తర్వాతే చైనాకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా భారత్‌తో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాన్ని రాజీవ్ ఫౌండేషన్ సిఫారసు చేసిన మాట నిజం కాదా..?' అని రవిశంకర్ ప్రసాద్ నిల‌దీశారు.2008లో చైనాతో కాంగ్రెస్ రహస్యం ఒప్పందం చేసుకుందని బీజేపీ సీనియ‌ర్ నేత‌ ఆరోపించారు. అప్పట్లో చైనా ఎంబసీ అధికారులతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సమావేశం అయ్యారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌ద్వారా కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఇర‌కాటంలో ప‌డేశారు.

దీంతో పాటుగా ఎమ‌ర్జెన్సీపైనా ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ స్పందించారు. నాటి ప్ర‌ధాని ఇందిరాగాంధీ త‌న ప‌ద‌విని కాపాడుకోవ‌డం కోసం తీసుకున్న దుర్మార్గ నిర్ణ‌య‌మే ఎమ‌ర్జెన్సీ అని ఆరోపించారు. రాయ్‌బ‌రేలీ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్ల‌దని అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో ఇందిరాగాంధీ అమానుష‌మైన నిర్ణ‌యం తీసుకున్నార‌ని, 1975, జూన్ 25 దేశ చరిత్ర‌లో ఒక దుర్దిన‌మ‌ని ఆయ‌న ఆరోపించారు.

త‌మ స్వార్థం కోసం దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించి అరాచ‌క పాల‌న సాగించార‌ని ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ మండిప‌డ్డారు. ``1971 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఇందిరాగాంధీ రాయ్‌బ‌రేలీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. అయితే, పోలింగ్ సంద‌ర్భంగా ఇందిరాగాంధీ అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డార‌ని, అడ్డ‌దారిలో గెలువ‌డం కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశార‌ని, ఆమె ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ రాయ్‌బ‌రేలీలో ఇందిరాగాంధీ చేతిలో ఓడిపోయిన‌ రాజ్ నారాయ‌ణ్ అల‌హాబాద్ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిపై 1975, జూన్ 12 తీర్పు వెల్ల‌డించిన కోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక‌ల చెల్ల‌ద‌ని పేర్కొంది. దీంతో ఇందిరాగాంధీ అల‌హాబాద్ హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అయితే ఆ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తీర్పును పెండింగ్‌లో పెట్టి, ఇందిరాగాంధీ ప్ర‌ధానిగా కొన‌సాగడానికి అవ‌కాశం ఇచ్చింది. దీంతో జ‌న‌తాపార్టీకి చెందిన జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్‌, మొరార్జీదేశాయ్‌లు దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు పిలుపునివ్వ‌గా దేశం మొత్తం ఆందోళ‌న‌లు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో ఇందిరాగాంధీ దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించి ఆందోళ‌న‌ల‌ను అణిచివేశారు. కోర్టుల‌ను, మీడియాను ఆమె తొక్కిపెట్టారు`` అని మండిప‌డ్డారు.

కాగా, బీజేపీ ఆరోప‌ణ‌ల‌పై కాంగ్రెస్ స్పందించింది. అప్పట్లో చైనా ఎంబసీ నుంచి అందుకున్న విరాళాల వెనుక వేరే ఉద్దేశ‌మేమీ లేద‌ని త‌మ వెబ్ సైట్‌లో అన్ని వివరాలు ఉన్నాయని తెలిపింది. చైనాతో ఘర్షణలు,ఉద్రిక్తతల నుంచి భారతీయుల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్‌పై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది.
Tags:    

Similar News