ఈ ‘గాడిద’ల పోస్టర్లేంది మోడీ..?

Update: 2016-05-09 05:40 GMT
వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా నిత్యం మాటలు చెప్పే నేత నేతృత్వంలో నడిచే పార్టీ ఎలాంటి వైఖరిని ప్రదర్శించాలి..? తన రాజకీయ ప్రత్యర్థుల పట్ల కనీసం మర్యాద.. గౌరవం ఇవ్వాల్సి ఉందన్న విషయాన్ని సైతం మరిచిపోయినట్లుగా యూపీలో వెలిసిన తాజా పోస్టర్ చెప్పకనే చెబుతుందని చెప్పొచ్చు. యూపీలోని బీజేపీ మైనార్టీ సెల్ అచ్చేసిన ఒక పోస్టర్ ఇప్పుడు వివాదస్పదంగా మారింది. తమ పార్టీకి చెందిన నేతల్ని పొగుడుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ.. ఆ పేరుతో.. ప్రత్యర్థి రాజకీయ నేతల్ని అవమానించేలా వ్యవహరించకూడదన్న విషయాన్ని వారు మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది.

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లోని బీజేపీ మైనార్టీ సెల్ తాజాగా ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ను పులిగా అభివర్ణించిన కమలనాథులు.. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీలను ‘‘గాడిదలు’’గా చిత్రీకరిస్తూ పోస్టర్ వేయటం కలకలం రేపుతోంది. ఈ పోస్టర్ మీద రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

యోగిని పులిగా చూపిస్తూ.. పులి బొమ్మ వెనుక సదరు ఎంపీ ఫోటోను పెట్టిన కమలనాథులు.. మరోవైపు రాహుల్.. మాయావతి.. అఖిలేష్.. అసద్ లను గాడిదలుగా చూపిస్తూ వారి ఫోటోలకు గాడిదల బొమ్మల్ని ముద్రించటం కలకలం రేపుతోంది. ఇలా ప్రత్యర్థి పార్టీల అధినేతల్ని.. ముఖ్యనేతల్ని చులకన చేస్తూ పోస్టర్లు వేయటం లాంటివి బీజేపీ మీద గౌరవాన్ని తగ్గించటం ఖాయం. ఇలాంటి వాటికి ప్రధాని మోడీ చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. తానే స్వయంగా రంగంలోకి దిగాల్సిన అవసరం లేకున్నా.. తన బంటు లాంటి పార్టీ అధినేత అమిత్ షాకు విస్పష్ట సూచనలు ఇస్తే సరిపోతుంది. లేనిపక్షంలో వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఆయన చెప్పే మాటల్ని ప్రజలు నమ్మే అవకాశం ఉండదని మర్చిపోకూడదు.
Tags:    

Similar News