ఎన్డీయే ఇండియా కూటముల మధ్యలో వైసీపీ
వైసీపీ పుష్కర కాలం పైదాటిన పార్టీ. ఏపీలో ఒకసారి అధికారంలోకి వచ్చింది.
వైసీపీ పుష్కర కాలం పైదాటిన పార్టీ. ఏపీలో ఒకసారి అధికారంలోకి వచ్చింది. ఏపీ నుంచి లోక్ సభకు అత్యధిక ఎంపీలను 2019లో పంపించి లోక్ సభలో నాలుగవ అతి పెద్ద పార్టీగా నిలిచింది. రాజ్యసభలో ఏకంగా ఏపీ కోటాలో మొత్తం 11 మంది ఎంపీలను గెలిపించుకుని అక్కడ కూడా పెద్ద పార్టీలలో కీలక స్థానంలో ఉంటూ వచ్చింది.
ఈ విధంగా జాతీయ స్థాయిలో వైసీపీ ఒక వెలుగు వెలిగింది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఎన్డీయే ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగింది అని ప్రచారంలో ఉంది. అది నిజమే అని కూడా అంటారు. దానికి కారణం ఏపీలో ప్రభుత్వానికి కేంద్రం సాయం అవసరం అని తమది రాజకీయ బంధం కాదని ప్రభుత్వాల మధ్య ఉన్న బంధం అని చెప్పుకున్నారు. ఇది ఒక విధంగా సబబు అయిన మాటగా కూడా అంతా చూశారు
అయితే ఈ రకమైన సాన్నిహిత్యంలో ఏపీకి ప్రత్యేక హోదా దక్కలేదు, విభజన హామీలు అమలు కాలేదు, పోలవరం అలాగే ఉండిపోయింది రాజధాని విషయంలోనూ ఏమీ జరగలేదు అని కూడా ఉంది. అయితే ఏపీకి కావాల్సిన అప్పులు తీసుకునేందుకు చేసుకునేందుకు కేంద్రం సహకారం అందించింది.
ఇదిలా ఉంటే ఇపుడు వైసీపీ విపక్షంలో ఉంది. ప్రభుత్వం టూ ప్రభుత్వం బంధాలు ఏమీ అవసరం లేదు. ఉంటే గింటే రాజకీయ బంధాలు మాత్రమే ఉండాలి. అయితే ఈ సమయంలోనూ వైసీపీ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేయలేకపోతోందా లేక వైసీపీ వ్యూహాత్మకంగా ఈ విధంగా ఆలోచన చేస్తోందా అన్నదే చర్చగా ఉంది.
తాజాగా వైసీపీ ఎంపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ తాము ఇండియా కూటమికి ఎన్డీయే కూటమికి సమాన దూరంలో ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. తాము తటస్థ వైఖరిని అనుసరిస్తున్నామని కూడా ఆయన చెప్పారు. తమది జాతీయ స్థాయిలో న్యూట్రల్ స్టాండ్ అని ప్రకటించారు.
నిజంగా వైసీపీ న్యూట్రల్ స్టాండ్ తో ఉంటోందా అన్నదే చూడాల్సి ఉంది. జమిలి ఎన్నికల బిల్లు విషయంలో ఎన్డీయేకు మద్దతు ఇచ్చింది. కొన్ని కీలకమైన విషయాలలో జాతీయ స్థాయిలో వైసీపీ విధానం ఏమిటి అన్నది చెప్పడం లేదు అని అంటున్నారు. ఉదాహరణకు మణిపూర్ లో అల్లర్లు జరుగుతున్నాయి, దాని మీద వైసీపీ పెద్దగా మాట్లాడింది లేదు అని అంటున్నారు.
అంతే కాదు జమిలి ఎన్నికలకు ఓకే చెబుతున్న వైసీపీ ప్రాంతీయ భావాలను జమిలి ఎన్నికల జాతీయ అజెండా ఎలా దెబ్బతీయలేదో కూడా స్పష్టంగా చెప్పాల్సి ఉంది కదా అని అంటున్న వారూ ఉన్నారు. మరో వైపు చూస్తూంటే దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద వైసీపీ జాతీయ విధానం కూడా ఎన్డీయేకు పూర్తిగా వ్యతిరేకంగా ఉందా అన్న చర్చ సైతం సాగుతోంది.
దేశంలో లౌకిక వాద ప్రగతి శీల ప్రజాస్వామిక విధానాల కోసం పోరాటం అని ఇండియా పెద్దలు చెబుతున్నారు. ఈ విషయంలో వైసీపీ జాతీయ సిద్ధాంతం ఏమిటి అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. మరి ఈ రోజుకీ తమది తటస్థ విధానం అని చెప్పడం ద్వారా మరో నాలుగున్నరేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉండబోయే ఎన్డీయే పెద్దలకు కోపం తెప్పించకుండా ఉండాలని అనుకుంటోందా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఏపీలో చూస్తే టీడీపీ జనసేన బీజేపీతోనే మరిన్ని ఎన్నికల్లో కూడా కలసి నడుస్తామని చెబుతున్న వేళ బీజేపీతో మునుపటి సాన్నిహిత్యం అయితే వైసీపీకి ఉండబోదు అన్న క్లారిటీ పక్కాగా ఉంది. అదే సమయంలో ఇండియా కూటమిలో వైసీపీ చేరిపోవాలని కాదు ఆ అనివార్యత ఉందనీ ఎవరూ చెప్పడం లేదు.
కానీ దేశాన్ని ఏలీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద మరింత గట్టిగా వైసీపీ పార్లమెంట్ లోపలా బయటా ఎలుగెత్తి చాటితేనే ఆ పార్టీ న్యూట్రల్ విధానాన్ని అంతా పూర్తిగా అర్ధం చేసుకుని నమ్ముతారు అని అంటున్నారు. లేకపోతే ఎవరికి తోచిన తీరున వారు వ్యాఖ్యానిస్తూనే ఉంటారు అని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో వైసీపీ తటస్థ విధానం ఏ విధంగా ఉండబోతోందో.