సుప్రీంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత.. ఏం తేలిందంటే..?
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అంశంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం మరోసారి సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అంశంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం మరోసారి సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుపై ఫలితాల అనంతరం అధికార కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుకునేలా స్పీకర్ ను ఆదేశించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (హుజూర్ నగర్) పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జి మైస్ లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. కాగా, తెలంగాణ హైకోర్టు నాలుగు నెలల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని నిరుడు మార్చిలో చెప్పినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని కౌశిక్ న్యాయవాది వాదించారు. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని తెలిపారు.
అయితే, ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశామంటూ అసెంబ్లీ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఎమ్మెల్యేలకు స్పీకర్ తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాగా, ఎంత సమయం కావాలో స్పీకర్ ను అడిగి చెప్పాలని ముకుల్ రోహత్గీకి ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
తెలంగాణలో 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అనంతరం బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లారు. దీంతో వీరిపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ కోర్టుకెళ్లింది. అయితే, బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. వేర్వేరు పార్టీల తరఫున గెలిచినవారిని బీఆర్ఎస్ లో చేర్చుకున్న వైనాన్ని ప్రస్తావిస్తోంది. చివరకు బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లింది.