కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ మాస్ వార్నింగ్!
ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ ...కాంగ్రెస్ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు చాలా కాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని వారు విమర్శిస్తున్నారు. అయితే, అనారోగ్య కారణాలో మరో కారణమో తెలీదు గానీ...కేసీఆర్ కూడా గతంలో మాదిరిగా మీడియా సమావేశాలకు ఎక్కువగా హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ ...కాంగ్రెస్ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇన్ని రోజులుగా తాను మౌనంగా ఉన్నానని, .. గంభీరంగా చూస్తున్నాని.. కానీ, తాను కొడితే మామూలుగా ఉండదని కేసీఆర్ హెచ్చరించారు. మామూలుగా కొట్టడం తనకు అలవాటు లేదని, కొడితే గట్టిగా కొడతానని కేసీఆర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. రాష్ట్రంలో ఒక పథకం కూడా సరిగ్గా అమలు చేయడం లేదని, నమ్మి ఓటేసిన ప్రజలను రేవంత్ రెడ్డి నట్టేట ముంచారని కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తెలంగాణలో పథకాలన్నీ గంగలో మునిగాయని ఎద్దేవా చేశారు. కరోనా విపత్తు సమయంలో కూడా రైతు బంధు పథకం ఆపలేదని, రైతులను ఆదుకున్నానని కేసీఆర్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అమలు చేసిన రైతు బీమాతో ఎంతో మంది రైతులకు మేలు జరిగిందని అన్నారు.
రాష్ట్రంలో మళ్లీ కరెంట్ కోతలు వచ్చాయని, మంచి నీళ్లకు కరువు వచ్చిందని కేసీఆర్ విమర్శించారు. ప్రజలు ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం ముస్లింలను కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని సంచలన ఆరోపణలు చేశారు. ఇక లాభం లేదని, ప్రత్యక్ష పోరాటానికి రెడీ కావాలని పిలుపునిచ్చారు.