వెంక‌య్య‌వారి విందు.. ఒక్క‌రికే ప‌సందు.. !

ఇప్పుడు మ‌న‌వ‌డి వివాహంలోనూ త‌న ప్ర‌మేయం ఉన్నంత వ‌ర‌కు ఖ‌ర్చును త‌గ్గించుకునే నిర్ణ‌యాలే తీసుకున్నారు.

Update: 2025-01-31 10:36 GMT

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి వెంక‌య్య‌నాయుడు మ‌న‌వ‌డు విష్ణు వివాహం శుక్ర‌వారం జ‌ర‌గ నుంది. ఈ వేడుక‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించాల‌ని వెంక‌య్య కుటుంబం నిర్ణ‌యించింది. ఇటీవ ల ఓ పెద్ద హోట‌ల్‌లో భారీ ఎత్తున నిశ్చితార్థ కార్య‌క్ర‌మం కూడా నిర్వ‌హించారు. స‌హ‌జంగా పెద్ద‌ల ఇళ్ల‌లో పెళ్లి ఎలా జ‌రుగుతుందో అలానే వెంక‌య్యనాయుడు మ‌న‌వ‌డి పెళ్లి కూడా చేస్తున్నారు. వాస్త‌వానికి దుబారాకు వెంక‌య్య వ్య‌తిరేకం.

పార్ల‌మెంటులో ఆయ‌న రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా ఉన్న‌ప్పుడు, దీనికి ముందు కేంద్ర మంత్రిగా ప‌నిచేసిన‌ప్పుడు కూడా దుబారాపై అనేక ఆంక్ష‌లు విధించారు. దుబారా ఖ‌ర్చును త‌గ్గించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇక‌, సొంత ప్ర‌యాణాలు చేయాల్సి వ‌చ్చినా.. ఖ‌ర్చును త‌గ్గించుకునే ప్ర‌య‌త్నాలు చేశారు. ఇక‌, ఇప్పుడు మ‌న‌వ‌డి వివాహంలోనూ త‌న ప్ర‌మేయం ఉన్నంత వ‌ర‌కు ఖ‌ర్చును త‌గ్గించుకునే నిర్ణ‌యాలే తీసుకున్నారు. దీనిలో భాగంగా మీడియా విష‌యంలో స‌రికొత్త నిర్ణ‌యం తీసుకున్నారు.

``వెంక‌య్య‌నాయుడి మ‌న‌వ‌డు విష్ణు వివాహం.. మ‌హాబ‌లిపురంలో నిర్వ‌హిస్తున్నారు. దీనిని క‌వ‌ర్ చేయాలని కోరుతున్నాం`` అని మీడియాకు ఇన్విటేష‌న్ పంపించారు. సాధార‌ణంగా పెద్దల ఇళ్ల‌లో పెళ్లిళ్ల‌కు ఒక మీడియా సంస్థ నుంచి ఇద్ద‌రు ముగ్గురు పాత్రికేయులు హాజ‌ర‌వుతారు. అన్ని అంశాల‌ను క‌వ‌ర్ చేస్తారు. పెళ్లి ద‌గ్గ‌ర ఒక‌రు, విందు ద‌గ్గ‌ర ఒకరు. అతిథుల వ‌ద్ద మ‌రొక‌రు ఉండి..వార్త‌ల‌ను సేక‌రిస్తారు. ఆక‌ర్ష‌ణీయంగా మ‌లుస్తారు కూడా!.

కానీ, ఈ విష‌యంలోనే వెంక‌య్య నాయుడు ఆంక్ష‌లు విధించారు. ఒక మీడియా సంస్థ నుంచి ఒక వీడియో గ్రాఫ‌ర్‌, ఒక రిపోర్ట‌ర్‌కు మాత్ర‌మే ఆహ్వానం ఉంద‌ని పేర్కొన్నారు. అంతేకాదు.. వీరిద్ద‌రూ కూడా అక్రి డేటెడ్ జ‌ర్న‌లిస్టులు అయి ఉండాల‌ని కూడా సూచించారు. దీనికి సంబంధించి ముందుగానే రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌న్నారు. అయితే.. ఈ నియ‌మాలు బాగానే ఉన్నా.. పాత్రికేయుల మ‌ధ్య మాత్రం ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇలాంటి నిబంధ‌న‌లు.. తాము ఎప్పుడు ఎక్క‌డా విన‌లేద‌ని.. వారు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో కొంద‌రు ఈ వేడుక‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

Tags:    

Similar News