రూ.4,000 కోట్ల విలువైన జయలలిత ఆస్తులపై కీలక అప్ డేట్!
ప్రధానంగా ఆమెకు గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టమని.. ఈ నేపథ్యంలో ఆకుపచ్చ రంగులో ఉండే వజ్రాభరణాలు ఆమె దగ్గర చాలా ఉన్నాయని అనేవారు.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఆమె మరణించిన సమయంలో ఆమె ఆస్తుల గురించి రకరకాల కథనాలు విపరీతంగా ప్రచారంలోకి వచ్చేవి. ఆమెకు ఉన్న బంగారు నగల గురించి, చీరల గురించి, చెప్పుల గురించి, గడియారాల గురించి రకరకాల ప్రచారాలు జరిగేవి.
ప్రధానంగా ఆమెకు గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టమని.. ఈ నేపథ్యంలో ఆకుపచ్చ రంగులో ఉండే వజ్రాభరణాలు ఆమె దగ్గర చాలా ఉన్నాయని అనేవారు. ఈ సమయంలో తాజాగా ఆమె ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం చర్యలు చేపట్టింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఆవును... దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా... ఫిబ్రవరి 14, 15 తేదీల్లో వాటిని అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి హెచ్.ఎ.మోహన్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు అప్పగించనున్న జయలలితకు చెందిన ఆస్తుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1,562 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు.. 27 కిలోల బంగారు, వజ్రాభరణాలు.. 10వేలకు పైగా చీరలు.. 750కి పైగా చెప్పుల జతలు.. వందల సంఖ్యలో చేతి గడియారాలు, ఇతర వస్తువులు ఉన్నాయి.
కాగా... జయలలితకు చెందిన అస్తులు, వస్తువులు అన్నీ తమకే చెందాలంటూ ఆమె వారసులుగా చెబుతున్న దీపక్, దీప ఇటీవల కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేయగా.. దాన్ని ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఇక.. జయలలితకు చెందిన ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.4,000 కోట్లు అని చెబుతున్నారు.