ఇంట గెలుస్తున్న జగన్...ఆమె ఒంటరేనా ?

లేటెస్ట్ గా ఆయన కడప జిల్లా టూర్ లో అది స్పష్టంగా కనిపించింది. వైఎస్సార్ కి అందరూ బంధువులే అని అంటారు.

Update: 2024-12-25 03:40 GMT

వైసీపీ అధినేత జగన్ లో మార్పు గణనీయంగానే కనిపిస్తోంది అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో దక్కిన ఘోరమైన ఓటమి ఆయనకు ఎన్నో పాఠాలను చెప్పిందని అంటున్నారు. జగన్ గతానికి భిన్నంగా నడచుకుంటున్నారు. తన తండ్రి వైఎస్సార్ బాటలో ఆయన అడుగులు వేస్తున్నారు.

లేటెస్ట్ గా ఆయన కడప జిల్లా టూర్ లో అది స్పష్టంగా కనిపించింది. వైఎస్సార్ కి అందరూ బంధువులే అని అంటారు. ఆయన శత్రువుని సైతం ఆప్యాయంగా పలకరించే వారు అన్నది కూడా చెబుతారు. వైఎస్సార్ రాజకీయాన్ని ఇంటి అవతల పెట్టేసి లోపలికి వస్తారు అని కూడా అంటారు.

ఆ విధంగానే వైఎస్సార్ కి ఎంతో మంది హితులు సన్నిహితులు జీవిత కాలంలో మిగిలారు. ఆయన మాదిరిగా జగన్ ఉండాలని అంతా కోరుకునే వారు. జగన్ అయితే బయటకు తన తండ్రిలా ప్రదర్శించరు కానీ ఆభిమానం లోపల ఉంటుందని చెప్పేవారూ ఉన్నారు. అయితే పట్టింపుల విషయంలో మాత్రం తండ్రి కంటే నాలుగాకులు ఎక్కువ చదివారని అదే ఆయన రాజకీయానికి అడ్డు పడుతూ వస్తోందని విశ్లేషించే శ్రేయోభిలాషులు అనేక మంది ఉన్నారు

ఇదిలా ఉంటే జగన్ తాను 2024 ఎన్నికల్లో ఎందుకు ఓటమి చెందానో విశ్లేషించుకునే పనిలో ఉన్నారు. బయట ప్రత్యర్ధులు ఎటూ ఉంటారు. వారితో రాజకీయ సమరం చేసి తీరాల్సిందే. కానీ ఇంట్లో కూడా రచ్చ చేసుకోకూడదు అన్నది ఆయన తెలుసుకున్నారని అంటారు. ఆ దిశగా జగన్ ఇపుడు అడుగులు వేస్తున్నారు

తాజాగా ఆయన ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దానికి వైఎస్సార్ కుటుంబం మొత్తం వచ్చింది. తల్లి విజయమ్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరూ కలసి గ్రూప్ ఫోటో దిగారు. ఆ ఫోటో చూసిన వారు వైఎస్సార్ కుటుంబంలో చాన్నాళ్ల తరువాత ఒక మంచి గ్రూప్ ఫోటో వచ్చిందని ఆనందించారు.

ఆ గ్రూప్ ఫోటోలో జగన్ కుమార్తెలు ఇద్దరితో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహా వైఎస్సార్ కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే అందులో స్పష్టంగా కనిపించనిది మిస్ అయినది మాత్రం వైఎస్ షర్మిల. ఆయన సొంత చెల్లెలు.

ఆమె లేకుండానే ఆ గ్రూప్ ఫోటో వచ్చేసింది. ఆమె ఆ విధంగా ఒంటరి అయ్యారా అన్న చర్చ కూడా సాగుతోంది. అదే సమయంలో అన్నా చెల్లెళ్ళ మధ్య ఆస్తుల వివాదాలు తీవ్రతరం అయ్యాయని కూడా అంటారు. అవి అంతకంతకు పెరిగి చివరికి ఒకరి బర్త్ డేకి మరొకరు గ్రీట్ కూడా చేసుకోలేని విధంగా పరిస్థితి మారిందని అంటున్నారు.

ఏది ఏమైనా తల్లితో బాగానే జగన్ ఉంటున్నారు అన్న సంకేతాలు ఈ గ్రూప్ ఫోటో ద్వారా వెల్లడి అయింది. అంతే కాదు వైఎస్సార్ కుటుంబంలో ఈ రోజుకీ అత్యధిక శాతం జగన్ వెంటే ఉన్నారు అని తెలుస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం తో పాటు వైఎస్ షర్మిల కుటుంబం మాత్రమే దూరంగా ఉంటోంది అన్నది తేటతెల్లమవుతొంది.

అయితే అభిమానులు కానీ వైఎస్సార్ కుటుంబ శ్రేయోభిలాషులు కానీ చెప్పేది ఏంటి అంటే మొత్తం కుటుంబం చెల్లెమ్మతో సహా కలసి ఉండాలని అన్ని విభేదాలు పరిష్కరించుకుని ఒక్కటిగా నిలవాలని అంటున్నరు. మరి ఆ దిశగా జగన్ ప్రయత్నాలు చేయాల్సి ఉంది. షర్మిల కూడా సహకరించాల్సి ఉంది. అపుడే వైఎస్సార్ కుటుంబానికి పరిపూర్ణత్వం వస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News