ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే మ‌ళ్లీ ర‌చ్చ చేశారు

Update: 2018-06-12 05:45 GMT
తెలంగాణకు చెందిన వివాదాస్పద బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ మరోమారు పోలీసుల చేతిలో బుక్ అయ్యారు. గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయ‌డ‌మే కాకుండా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు గాను పలుమార్లు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇతర నాయకుల్లానే తనను కూడా ఇఫ్తార్ విందులు ఇవ్వాలని స్నేహితుడు ఒకరు తనకు సూచించాడని అందులో పేర్కొన్నారు. 'ప్రస్తుతం చాలామంది తెలంగాణ నాయకులు ఇఫ్తార్ విందులు ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. టోపీలు ధరించి సెల్ఫీలు తీసుకుంటున్నారు. తాము కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయగలమని నిరూపిస్తున్నారు. అయితే, వారు 'సబ్‌ కా సాథ్..సబ్‌ కా వికాశ్' గురించి ఆలోచిస్తే బాగుంటుంది'' అని పేర్కొన్నారు. ఇఫ్తార్‌ కు హాజరయ్యే వారందరూ వోటు బికారీలు (ఓట్లు అడుక్కునే వారు) అని వారు అనుకుంటున్నారని, కానీ తాను అలా అనుకోవడం లేదని పేర్కొన్నారు. హిందువులను చంపేస్తున్న వారు ఇస్తున్న ఇఫ్తార్ విందులకు తానెలా హాజరుకాగలనని ప్రశ్నించారు.

కాగా, మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. నగరంలోని ఫలక్‌ నుమా పోలీస్ స్టేషన్‌ లో కేసును రిజిస్టర్ చేశారు. రాజకీయ నాయకులు ఓట్ల కోసమే ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్యే తన వీడియో పోస్టులో ఆరోపించారు. ఎవ్వరికీ ఇఫ్తార్ ఇవ్వను - ఎవరైనా పిలిచినా ఆ విందుకు హాజరుకానంటూ తన వీడియోలో ఎమ్మెల్యే తెలిపారని ఇది రెచ్చ‌గొట్ట‌డ‌మేన‌ని పేర్కొంటూ త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు ముస్లింలు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News