డీఎస్‌ను ఈట‌ల ఎందుకు క‌లిశారు?

Update: 2021-11-12 08:30 GMT
రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌యోజనం లేకుండా ఏమీ చేయ‌రు. ఓ పార్టీ నాయ‌కులు మ‌రో పార్టీ నేత‌ల‌ను క‌లిస్తే దాని వెన‌క ఏదో కార‌ణం క‌చ్చితంగా ఉండే ఉంటుంది. బ‌య‌ట‌కు మాత్రం మ‌ర్యాద‌పూర్వ‌కంగానే క‌లుసుకున్నామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ రాజ‌కీయంగా ఏదో ప‌రిణామానికి ఈ క‌ల‌యిక దారి తీస్తుంద‌నేది నిపుణుల అభిప్రాయం. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్.. టీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు డి.శ్రీనివాస్ (డీఎస్‌)ను క‌లిశారు. ప్ర‌స్తుత రాష్ట్ర రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఈ భేటీ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

డీఎస్ త‌న‌యుడు బీజేపీ ఎంపీ అర‌వింద్‌.. ఈట‌ల‌ను త‌న తండ్రి ద‌గ్గ‌రికి తీసుకెళ్లారు. ఈ భేటీకి ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్య‌త లేద‌ని మ‌ర్యాద‌పూర్వ‌కంగానే క‌లిశార‌ని ఈట‌ల స‌న్నిహితులు చెప్తున్నారు. కానీ ఈ భేటీ వెన‌క ఏదో కార‌ణం ఉండే ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జోరందుకుంది.

భూక‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డంతో టీఆర్ఎస్‌ను వీడిన ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ విజ‌యంతో రాష్ట్రంలో బీజేపీలో కొత్త ఉత్సాహం నిండింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో అధికారం ద‌క్కించుకునే దిశ‌గా ఇదే జోరుతో సాగాల‌ని పార్టీ నిర్ణ‌యించింది. అందుకు ఇప్ప‌టి నుంచి పార్టీ బ‌లోపేతంపై దృష్టి సారించారు.

ఈ నేప‌థ్యంలో ఈట‌ల డీఎస్‌ను క‌ల‌వ‌డంతో ఆయ‌న్ని పార్టీలోకి ఆహ్వానించేందుకు భేటీ అయ్యార‌నే చ‌ర్చ మొద‌లైంది. గ‌తంలో టీఆర్ఎస్‌కు ఈట‌ల రాజీనామా చేసిన త‌ర్వాత కూడా ఓ సారి డీఎస్‌ను క‌లిశారు. నిజామాబాద్‌లో సీనియ‌ర్ నేత అయిన డీఎస్‌ను పార్టీలోకి తీసుకుంటే మేలు జరుగుతుంద‌నే ఉద్దేశంతోనే ఇప్పుడు డీఎస్‌ను ఈట‌ల క‌లిశార‌నే ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు డీఎస్ కాంగ్రెస్ వైపు వెళ్ల‌కుండా అడ్డుకునేందుకే బీజేపీ ఇలా వ్యూహం అమ‌లు చేస్తుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాజ‌కీయంగా ఎదిగిన డీఎస్‌.. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డిన త‌ర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. డీఎస్‌ను కేసీఆర్ రాజ్య‌స‌భ‌కు పంపించారు. కానీ కొంత కాలం నుంచి కేసీఆర్‌కు డీఎస్‌కు మ‌ధ్య దూరం పెరిగింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. తాను ఏ పార్టీలో ఉన్నానో కూడా తెలియ‌ట్లేద‌ని గ‌తంలో డీఎస్ వ్యాఖ్యానించ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి.. అందులో భాగంగానే డీఎస్‌ను, ఆయ‌న మ‌రో త‌న‌యుడు సంజ‌య్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని తెలిసింది. ఇప్ప‌టికే సంజ‌య్ ఓ సారి రేవంత్‌ను క‌లిశారు. దీంతో డీఎస్ తిరిగి సొంత గూటికి వెళ్తార‌నే ప్ర‌చారం జోరంద‌కుంది.

ఇప్పుడు డీఎస్ కాంగ్రెస్‌లోకి వెళ్ల‌కుండా ఉండేందుకు త‌మ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అందుకే డీఎస్‌ను ఈట‌ల క‌లిశార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే డీఎస్ త‌న‌యుడు అర‌వింద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో డీఎస్ కాంగ్రెస్‌లో చేరితే అది అర‌వింద్‌కు ఇబ్బందిగా మారే ప్ర‌మాదం ఉంది. మ‌రోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటే ఆ దెబ్బ బీజేపీపైనే ప‌డుతుంది. అందుకే బీజేపీ ముందుగానే జాగ్ర‌త్త ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రి డీఎస్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.


Tags:    

Similar News