బీజేపీ మొద‌టి గండం గ‌ట్టెక్కింది

Update: 2016-08-06 17:30 GMT
ప్రత్యేకహోదా అంశంపై భారతీయ జనతా పార్టీ తన పంతాన్నే నెగ్గించుకున్నది. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్ర‌వేశపెట్టిన ప్రైవేటుమెంబర్ బిల్లుపై ఓటింగ్ జరిపేందుకు వల్లేదంటూ ఆర్దికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ పట్టుబట్టారు. అతి కష్టం మీద సదరు బిల్లుపై అభిప్రాయం పేరుతో లోక్‌ సభ స్పీకర్ కోర్టులోకి బంతిని తోసేసి భాజపా ఇప్పటికైతే ఊపిరి పీల్చుకున్నది. ఆర్థిక సంబంధిత బిల్లులపై ఓటింగ్ జరిపేందుకు రాజ్యసభకు అధికారం లేదంటూ అరుణ్‌ జైట్లీ వాదిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేకహోదా విషయంలో ప్రైవేటు మెంబర్ బిల్లుపై గనుక ఓటింగ్ జరిగితే భాజపా ఓటమి ఖాయమని తేలిపోయింది. ఎందుకంటే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనంటూ జాతీయ పార్టీలన్నీ కూడా గట్టిగా చెబుతున్నాయి. ఇదే అంశంపై మొన్న జరిగిన స్వల్పకాలిక చర్చలో కూడా కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుకు అనుకూలంగా జాతీయ పార్టీలన్నీ సానుకూలంగా స్పందించటం గమనార్హం. ఎన్‌ డీఏలోని భాజపా మిత్రపక్షాలు కూడా ప్రైవేటుమెంబర్ బిల్లుకు మద్దతుగా మాట్లాడటంతో భాజపా ఖంగుతిన్నది.

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వటమన్నది కేంద్రప్రభుత్వానికి ఇష్టం లేదన్న విషయం అందరికీ అర్ధమవుతూనే ఉన్నది. ఇదే విషయాన్ని పార్లమెంట్‌ లోనే పలుమార్లు కేంద్రమంత్రులు బాహాటంగానే ప్రకటించారు. అయితే, ఎలాగైనా మిత్రపక్షాలైన భాజపా - తెలుగుదేశం పార్టీలను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పెద్ద వ్యూహాన్నే రచించారు. అందుకు తగ్గట్లే రాజ్యసభలో ప్రైవేటుమెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే, ఆ బిల్లును రాష్ట్రంలోని అధికార పార్టీ టీడీపీ - కేంద్రంలో అధికార పార్టీ భాజపాలు రెండూ చాలా తేలిగ్గా తీసుకున్నాయి. ఆ రెండు పార్టీల నిర్లక్ష్యాన్ని కేవీపీ అవకాశంగా తీసుకోవటంతో పెద్ద సమస్యలో పడ్డాయి. దాంతో ఆ సమస్యలో నుండి బయటపడేందుకు ఇపుడు రెండు పార్టీలు కిందా మీద అవుతున్నాయి. చాపక్రింద నీరులా కేవీపీ తాను ప్రవేశపెట్టిన బిల్లుకు జాతీయ పార్టీల మద్దతు కూడగట్టాన్ని అధికార పార్టీలు రెండూ ఊహించలేకపోయాయి. తీరా బిల్లు చర్చకు వచ్చినపుడు రాజ్యసభలోని దాదాపు అన్నీ పార్టీలూ మద్దతుగా నిలవటాన్ని రెండు పార్టీలూ జీర్ణించుకోలేకపోయాయి. అసలే, రాష్ట్రంలో ప్రత్యేకహోదా విషయంలో మిత్రపక్షాలపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రతిపక్షాలు అవకాశం దొరికనపుడల్లా ఇబ్బంది పెడుతున్నాయి. పైగా కేవీపీ బిల్లుకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ బాహటంగానే మద్దతు పలకటంతో హోదా అంశంపై రాష్ట్రంలో రాజకీయం వేడిపుట్టింది.

ప్రజల మనోభావాలను గమనించిన తర్వాత, అందునా జాతీయ పార్టీలన్నీ మద్దతు పలికిన తర్వాత వేరే దారిలేక చివరకు టీడీపీ కూడా రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా మాట్లాడక తప్పలేదు. ఊహించని ఈ పరిణామంతో కేంద్రప్రభుత్వం గొంతులో వెలక్కాయపడ్డట్లైంది. సమస్యనుండి బయటపడేందుకు చివరకు ప్రత్యేకహోదా బిల్లు ఆర్దిక సంబంధమైనదని చెబుతూ వారం రోజుల క్రితం జరగాల్సిన ఓటింగ్‌ ను అరుణ్‌ జైట్లీ వాయిదా వేయించారు. గతంలో రాజ్యసభ వైస్ ఛైర్మన్ పిజె కురియన్ ప్రకటించినట్లుగా శుక్రవారం చర్చకు అనుమతించారు. అయితే, ప్రత్యేకహోదా బిల్లు ఆర్ధిక సంబంధిత బిల్లు కాదని కాబట్టి ఓటింగ్ జరగాల్సిందేనంటూ కాంగ్రెస్‌తో పాటు మిగిలిన పార్టీలు గట్టిగా పట్టుబడుతునే ఉన్నాయి. ఓటింగ్ జరుగుతుందా జరగదా అన్న విషయమై అందరూ ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. చివరకు రాజ్యసభలో చర్చ మొదలుకాగానే ప్రతిపక్షాలు - ఎన్‌ డిఏలోని భాజపా మిత్రపక్షాలు కూడా బిల్లుకు అనుకూలంగానే మాట్లాడాయి. పైగా ప్రత్యేకహోదా బిల్లు ఏ విధంగా ఆర్దిక సంబంధిత బిల్లు కాదో కాంగ్రెస్ సభ్యుడు కపిల్ సిబల్‌ తో పాటు పలువురు సభ్యులు సోదాహరణలతో వివరించారు. దాంతో భాజపా మరింత ఇరుకునపడింది. పైగా రెండేళ్ళుగా రాజ్యసభలో మౌనంగానే ఉన్న మాజీ ప్రధానమంత్రి మన్‌ మోహన్‌ సింగ్ కూడా ప్రసంగించటం విశేషం. విభజన సమయంలో తాము చేసిన చట్టాన్ని నాటి కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు సింగ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆర్డినెన్స్ తీసుకుని వచ్చే సమయానికి సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడటంతో ఆర్డినెన్స్ జారీకి బ్రేకులు పడిందని స్పష్టం చేసారు. కాబట్టి ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ గట్టిగా చెప్పారు. ఈ నేపధ్యంలో రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్‌ కు అనుమతిస్తే ప్రభుత్వానికి ఓటమి తప్పదని గ్రహించిన అరుణ్‌ జైట్లీ తనకు అలవాటైన పాత పాటనే పాడారు. పైగా ప్రైవేటుమెంబర్ బిల్లు ఆర్దిక సంబంధిత బిల్లా కాదా అన్న విషయాన్ని తేల్చేందుకు వైస్ ఛైర్మన్ అందరి అభిప్రాయాలను కోరారు. అయితే, సదరు బిల్లు ఆర్ధిక సంబంధిత బిల్లు ఎంతమాత్రం కాదని మెజారిటీ పార్టీలు చెప్పాయి. అయినా సందిగ్దత పోలేదని అంటూ వైస్ ఛైర్మన్ వివరణ, స్పష్టత కోసమంటూ సదరు బిల్లును లోక్‌సభ స్పీకర్‌ కు పంపుతున్నట్లు రూలింగ్ ఇచ్చి సభను వాయిదా వేశారు. త‌ద్వారా బీజేపీ త‌న పంతం నెగ్గించుకున్న‌ట్ల‌యింది.
Tags:    

Similar News