బీజేపీ నేత‌ల‌కు ఈ తిర‌కాసు ఏంటో!

Update: 2022-09-15 16:17 GMT
ఏదైనా ఒక అంశంపైన రాజ‌కీయ నేత‌ల‌కు ఏదో ఒక స్ప‌ష్ట‌త ఉండాలి. లేదంటే ప్ర‌తిప‌క్షాల‌కు, నెటిజ‌న్ల‌కు టార్గెట్‌గా మారడం ఖాయం. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బీజేపీ నేత‌ల తీరు ఇలాగే ఉంద‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక‌సారేమో ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తి మాత్ర‌మే ఉండాలంటారు. తాము అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నామంటారు. మ‌రోసారేమో రాజ‌ధానుల నిర్ణ‌యం రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని అంశ‌మ‌ని.. కేంద్ర ప్ర‌భుత్వ జోక్యం చేసుకోద‌ని చెబుతుంటారు.

ఇంకోవైపు ఏపీ హైకోర్టు క‌ర్నూలులోనే పెట్టాలంటారు. ఈ విష‌యంలో గ‌తంలోనే రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్ పేరుతో బీజేపీ తీర్మానం చేసింది. ఇప్పుడేమో ఏకైక రాజ‌ధాని అమ‌రావ‌తి అని.. అమ‌రావ‌తి అభివృద్ధికి మాత్ర‌మే కేంద్రం నిధులిస్తుందంటారు. ఇలా అంతా అయోమ‌యం జ‌గ‌న్నాథంలాగా బీజేపీ నేత‌ల తీరు ఉంద‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గ‌తంలో అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు ఒకే ఒక రాజ‌ధానిని కొన‌సాగించాల‌ని కోరుతూ న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు అంటూ పాద‌యాత్ర చేసిన సంగ‌తి తెలిసిందే. దీనికి బీజేపీ నేత‌లు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అలాగే ఇప్పుడు అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు అంటూ అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర‌-2కు సైతం బీజేపీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

అయితే తాజాగా వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో రాయలసీమ జోనల్ స్ధాయి బీజేపీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ హైకోర్టు కర్నూలులోనే పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విష‌యంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయించే బాధ్యత తామే తీసుకుంటామని కూడా హామీ కూడా ఇవ్వ‌డం విశేషం. అలాగే కొద్దిరోజుల క్రితం ఉత్తరాంధ్ర పర్యటనలో మాట్లాడుతూ విశాఖను ప్రభుత్వం ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల‌ని సోము వీర్రాజు డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇలా బీజేపీ నేత‌లు ఏ రోటి కాడ ఆ పాట పాడుతున్నార‌నే సామెత‌ను నిజం చేస్తున్నార‌ని నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

కోస్తాంధ్ర‌లో ఉంటే అమ‌రావ‌తి మాత్ర‌మే రాజ‌ధాని, రాయ‌ల‌సీమలో ఉంటే క‌ర్నూలులో న్యాయస్థానం ఉండాలి, ఉత్త‌రాంధ్ర‌లో విశాఖప‌ట్నం ప్ర‌త్యేకంగా అభివృద్ధి చెందాలి.... ఇదిగో ఇలా సాగుతోంది.. బీజేపీ ఏపీ నేత‌ల వ్య‌వ‌హారం. మ‌రోవైపు అస‌లు రాజ‌ధానుల విష‌యంలో త‌మ‌కేం సంబంధం లేద‌ని.. అది రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని అంశ‌మ‌ని కేంద్రం ప‌లుమార్లు వివిధ సంద‌ర్భాల్లో పార్ల‌మెంటులోనూ, న్యాయ‌స్థానాల్లో అఫిడ‌విట్ల రూపంలోనూ తెలియ‌జేసింది.

బీజేపీ నేత‌లు మాత్రం క్లారిటీని మిస్ అవుతున్నారు. ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తి మాత్రమే ఉండాల‌ని కోరుకుంటే రాజ‌ధాని, శాస‌న‌స‌భ‌, స‌చివాల‌యం, హైకోర్టు ఇలా అన్నీ ఒకే చోట ఉండాలి. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సోము వీర్రాజు హైకోర్టు క‌ర్నూలులో ఉండాల‌ని చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇలా స్ప‌ష్ట‌త లేకుండా బీజేపీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

సోము వీర్రాజు మాత్ర‌మే కాకుండా బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహ‌రావు కూడా రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్ పై బీజేపీ నాయ‌క‌త్వం ఇప్ప‌టికీ క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. హైకోర్టు అనేది రాష్ట్ర ప్ర‌భుత్వం చేతుల్లోనే ఉంద‌ని అంటున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాడానికి కేంద్ర ప్ర‌భుత్వం కూడా స‌హాయం చేస్తుందంటున్నారు.

మ‌రోవైపు సోము వీర్రాజులానే జీవీఎల్ న‌ర‌సింహారావు కూడా అమ‌రావ‌తే ఏకైక రాజ‌ధానిగా ఉండాలంటున్నారు. మ‌ళ్లీ ఇంత‌లోనే ప‌రిపాల‌న అంతా ఒక చోట ఉండాల‌ని.. మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి చేయాల‌ని చెబుతున్నారు. గ‌తంలో ఏపీని ప‌రిపాలించిన ముఖ్య‌మంత్రులంతా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి మిగ‌తా ప్రాంతాల‌ను విస్మ‌రించార‌ని అంటున్నారు. దీంతో రాష్ట్ర విభ‌జ‌న‌తో ప్ర‌జ‌లు న‌ష్ట‌పోయార‌ని పేర్కొంటున్నారు. ఇంత‌కూ బీజేపీ నేత‌లు మూడు రాజ‌ధానుల‌కు అనుకూల‌మా?  లేకుంటే ఒకే రాజ‌ధానికి క‌ట్టుబ‌డి ఉన్నారా అనేది మాత్రం ఇప్ప‌టికీ వారి మాట‌ల్లో స్ప‌ష్ట‌త రావ‌డం లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News