బీజేపీ దయా దాక్షిణ్యం : దక్షిణాదికి అవే ప్రాప్తం...?

Update: 2022-07-07 02:30 GMT
మొదటి నుంచి ఉత్తరాది పార్టీగా ముద్రపడిన బీజేపీకి మోడీ షాల నాయకత్వం అది ఇంకా నిజమని నిరూపించింది అన్న అపవాదు అయితే ఉంది. ఎంతసేపూ పదవులు అన్నీ ఉత్తరాదికే కట్టబెట్టి సౌత్ వారిని నోట్లో వేలు పెట్టుకుని చూడమనడమే బీజేపీ పెద్దలకు చెల్లింది. ఏమంటే మాకు ఓట్లు ఈయని చోట మేమెందుకు చేయాలి అన్న అతి తెలివైన ప్రశ్న వేస్తారు అంటారు.

కానీ ముందు దక్షిణాదిని  అన్ని రకాలుగా గుర్తించి వారిని సమాదరిస్తే ఫ్యూచర్ లో అందలాలు బీజేపీకి దక్కేనేమో. ఉదాహరణకు విభజన తరువాత ఏపీ తెలంగాణాలు రెండూ కేంద్రం వైపు ఆశగా చూశాయి. విభజన హామీలు కూడా చట్టంలో భద్రంగా ఉన్నాయి. వాటిలో ఏ కొన్ని నెరవేర్చినా బీజేపీ ఇపుడున్న రాజకీయ స్థితి కంటే మంచి దాంట్లోనే ఉండేది. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా అన్న హామీ కూడా నెరవేర్చితే అక్కడ  బీజేపీ ఫోర్ ఫ్రంట్ లోకి వచ్చేది.

కానీ అవేమీ చేయకుండా ఓట్లు ముందు వేయండి ఆనక అన్నీ  చూస్తామని  కబుర్లు చెబుతూ వస్తోంది. ఇక కేంద్ర మంత్రి పదవుల విషయంలో చూసుకున్నా ఏపీకి ఒక్క పదవి కూడా 2019 నుంచి మోడీ నాయకత్వాన ఇవ్వలేదు. రాజ్యసభ సీట్లు అంతకంటే దక్కలేదు. ఇక ఏపీకి చెందిన ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుని రాష్ట్రపతిగా ప్రమోట్ చేసి ఉంటే సౌత్ జనాల అభిమానం ఎంతో కొంత మళ్లేది.

కానీ అది కూడా ఇవ్వలేదని కొన్ని వర్గాల నుంచి నిరసనలు వచ్చాయి. ఈ పరిణామాల నేపధ్యంలో బీజేపీ దక్షిణాది మీద రాజకీయ  శ్రద్ధ బాగా  పెడుతోంది అనిపించుకోవడానికి రాజ్యసభకు నలుగురు దాక్షిణికులను నామినేట్ చేసింది. వారిలో ఏపీ, కర్నాటక, తమిళనాడు, కేరళకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు ఉండడం విశేషం.

కేరళ నుంచి పరుగుల రాణి పీటీ ఉషా, తమిళనాడు నుంచి  మాస్ట్రో ఇళయరాజా, కర్నాటక నుంచి ధర్మస్థల నిర్వాహాధాకారి  వీరేంద్ర హెగ్గడే, ఏపీ నుంచి  ప్రముఖ సినీ కథారచయిత వీ. విజయేంద్ర ప్రసాద్‌లను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు బీజేపీ నామినేట్‌ చేసింది. ఒక విధంగా ఇది ఊరటను ఇచ్చే పరిణామంగా చెప్పాలి. నిజానికి ఎన్నో కీలకమైన పదవులు దక్షిణాదిని వరించాల్సి ఉంది.

ఒకనాడు రాష్ట్రపతి నార్త్ కి ఇస్తే ఉప రాష్ట్రపతి సౌత్ కి ఇచ్చేవారు. అలా రెండు వైపులా సమన్యాయం ఉండేది. కానీ బీజేపీ ఏలుబడిలో ఆ ముచ్చటేలేదు. దీంతో అంతా రగులుతున్న వేళ రాజ్యసభ పదవులతో దక్షిణను ఇచ్చింది బీజేపీ అంటున్నారు.

కానీ ఇది ఏ మాత్రం సరిపోదు, రాజకీయ వాటాలో చాలా చాలా తక్కువ శాతంగానే దీన్ని అంతా చూస్తున్నారు. రానున్న రోజుల్లో సౌత్ వైపు బీజేపీ కన్నెత్తి చూడాలీ అంటే ఎన్నో చేయాలి. ముఖ్యంగా వివక్ష అన్న మాట ఈ ప్రాంతం నుంచి రాకుండా చూసుకోవాలి. దానికి నాందిగా ఈ పదవులను అనుకుంటే కొంత సబబుగా ఉంటుంది. అంతే తప్ప ఏదో తాయిలాలు ఇచ్చామన్నట్లుగా చేసినా చూసినా బీజేపీ దక్షిణాది కల నెరవేరే చాన్స్ లేదు. దానికంటే ముందు వివక్ష అన్నది జనం మెదళ్లలోకి చేరితే ఇంకా ఇబ్బంది కూడా అవుతుంది అని చెప్పాలి.
Tags:    

Similar News