టీడీపీ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన బీజేపీ

Update: 2021-05-29 16:30 GMT
మహానాడు వేదికగా చంద్రబాబు విసిరిన పాచిక విఫలమైంది. ఏపీలో బీజేపీతో స్నేహం కోసం టీడీపీ అధినేత చేసిన ఎత్తుగడ ఘోరంగా ఫ్లాప్ అయ్యింది.

అధికార వైసీపీతో పోరులో బీజేపీ, జనసేన వంటి విపక్షాలతో కలిసి పనిచేస్తామంటూ నిన్న చంద్రబాబు ఆఫర్ ఇచ్చారు. దీన్ని బీజేపీ తిరస్కరించింది. గతంలో మోడీపై యుద్ధం చేసిన చంద్రబాబు ఇప్పుడు కలిసి పనిచేద్దామంటూ ఆఫర్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. దీంతో బీజేపీతో వెళుదామనుకుంటున్న టీడీపీ ఆశలకు చెక్ పడింది.

మహానాడు వేదికగా నిన్న చంద్రబాబు ఓ పిలుపునిచ్చారు. వైసీపీతో పోరులో విపక్షాలతో కలిసి పనిచేస్తామంటూ వారికి ఆఫర్ ఇచ్చారు. విపక్ష పార్టీలు బీజేపీ, జనసేన, కమ్యూనిస్టులతో కలిసి వైసీపీపై పోరాటం చేస్తామంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీతో పొత్తుకోసం రెండేళ్లుగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఇప్పుడు సడెన్ గా ఎన్నికలు కూడా లేకపోయినా ఈ ఆఫర్ ఇవ్వడంపై చర్చ జరుగుతోంది.

ఇక చంద్రబాబు ఆఫర్ ను బీజేపీ ఘాటుగా తిరస్కరించింది. ఏపీ బీజేపీ ఇన్ చార్జ్ సునీల్ దియోధర్ ఘాటుగా ట్వీట్ చేశాడు. చంద్రబాబుకు గతాన్ని గుర్తు చేస్తూ ధియోదర్ పెట్టి ట్వీట్స్ వైరల్ గా మారాయి. బాబు ఆఫర్ ను తిరస్కరిస్తున్నట్టు నేరుగానే చెప్పేసిన సునీల్ ధియోధర్ టీడీపీతోపాటు వైసీపీపైనా తమ పోరు కొనసాగుతుందన్నారు.

గతంలో సొంత మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప చంద్రబాబు.. ఆ తర్వాత 2019లో ప్రధాని మోడీకి వెన్నుపోటు పొడిచారంటూ సునీల్ ధియోధర్ తన ట్వీట్ లో నిప్పులు చెరిగారు. 2024లో బీజేపీతో కలిసి పనిచేద్దామంటూ చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ టీడీపీని బతికించుకునేందుకే అంటూ సునీల్ ధియోదర్ ఆరోపించారు. దీంతో బీజేపీతో స్నేహానికి ప్రయత్నాలు చేయవద్దంటూ చంద్రబాబు ఆఫర్ ను సునీల్ ధియోధర్ తిరస్కరించినట్టైంది. ఇక టీడీపీ ఆఫర్ ను బీజేపీ తిరస్కరించడంపై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News