పంద్రాగస్టు వేళ జాతీయ జెండాపై బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్

Update: 2022-08-15 04:31 GMT
తెలంగాణలో అస్సలు తగ్గట్లేదు టీఆర్ఎస్ - బీజేపీ మధ్య రాజకీయ వార్. గులాబీ అధిపత్యాన్ని కాషాయం ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎట్టిపరిస్థితుల్లోనూ కాషాయజెండా ఎగిరేందుకు ఏమైనా చేసేందుకు సిద్దమన్నట్లుగా బీజేపీ డిసైడ్ అయిన వేళ.. ఎలా తీసుకుంటారో మేమూ చూస్తాం.. మేమేమన్నా ఉత్తినే ఉన్నామా?

అంటూ గులాబీ బ్యాచ్ అంతే పట్టుదలతో వ్యవహరిస్తున్న వేళ.. తెలంగాణలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొంది. ఈ రాజకీయ విభేదాలు ఎంతవరకు వెళ్లాయంటే.. రాజకీయ నేతల నుంచి సామాన్య ప్రజలకు బాగానే అంటేశాయి.

దీంతో ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకునే ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టటం లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఈ రెండు పార్టీల మధ్య రచ్చ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. పంద్రాగస్టు వేళ.. జాతీయ జెండాను మూడు రోజుల ముందు నుంచే ఎగురవేసుకోవచ్చన్న మాట ప్రధాని మోడీ నోటి నుంచి రావటంతో ఇప్పుడు ఎక్కడ చూసినా జెండా పండుగ వాతవరణం నెలకొంది. ఇళ్ల మీదా.. వాహనాల మీద.. ఇలా అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా త్రివర్ణ పతాకంతో పరిసరాలకు సరికొత్త కళ సంతరించుకున్న పరిస్థితి.

అయితే.. ప్రతి సందర్భంలోనూ తాము కోరుకున్నది మాత్రమే చూసే వారికి తాజా ఎపిసోడ్ లోనూ తమ ప్రత్యర్థులు చేసే తప్పుల్ని వెతికి వెతికి మరీ పట్టుకుంటున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ అభిమాని ఒకరు.. బీజేపీ జెండా కంటే త్రివర్ణ పతాకాన్ని దిగువన ఏర్పాటు చేసిన వైనంపై మండిపడుతూ సోషల్ మీడియాలో ఘాటైన పోస్టు పెట్టారు.

'ఇంకా ఎన్నిసార్లు అవమానిస్తారు రా జెండాని. రోజుకు ఒక్కటి అయినా చూస్తున్నాం. జాతీయ జెండా కంటే ఎత్తులో వేరే ఏ జెండా ఉండకూడదు రా పువ్వులు.." అంటూ ఘాటైన తిట్టును షార్టు కట్ లో తిట్టేసి ఫోటోతో సహా పోస్టు చేవారు. దీనికి రెండు గంటల వ్యవధిలోనే బీజేపీ ఆర్మీ నుంచి రిప్లై వచ్చేసింది.

ఒక భవనంపై టీఆర్ఎస్ జెండాతో పాటు.. జాతీయ జెండాను ఎగురవేసిన వైనానికి సంబంధించిన ఫోఅటోను పోస్టు చేసిన కాషాయ దళ అభిమాని.. 'దీన్ని ఏమి అంటారు అన్న మరి' అంటూ అనవసరమైన మాటల్ని వాడకుండా సూటిగా.. సుత్తి కొట్టకుండా అడిగేశారు. ఇలా సోషల్ మీడియాలో ఒకరికి ఒకరు తీసిపోకుండా పంచ్ లు వేసుకుంటున్న వైనం వాతావరణాన్ని మరింత వేడెక్కించేలా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News