లంచంతో బన్సాల్ ఫ్యామిలీ మొత్తం బలి

Update: 2016-09-27 10:50 GMT
బీకే బన్సాల్ చిన్నాచితకా అధికారి కాదు. ఆయన హోదాను చెప్పాలంటే.. కార్పొరేట్ వ్యవహారాల శాఖ డైరెక్టర్. అలాంటి ఆయన దగ్గరకు ఎంతెంత పెద్దమనుషులు వస్తారో.. ఆయన స్థాయి ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత పెద్ద హోదాలో ఉన్నా.. మనిషికి ఉండే పరువు.. ప్రతిష్ట..ఆత్మాభిమానం లాంటివి అందరి మాదిరే ఉంటాయి కదా. మొన్నటి వరకూ ఆయన హవా బాగానే నడిచినా.. ఈ మద్యనే ఒక ఫార్మా కంపెనీ నుంచి రూ.9లక్షలు లంచం తీసుకుంటున్న వేళ అవినీతి నిరోధక అధికారులు పట్టేసుకున్నారు.

ఇలాంటి అవినీతి జలగల్ని పట్టుకున్న తర్వాత అధికారులు ఏం చేస్తారో అదే పనిని బన్సాల్ విషయంలోనూ చేశారు. లంచంగా తీసుకుంటున్న రూ.9లక్షలతో పాటు.. ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టగా.. రూ.60 లక్షల క్యాష్.. 20 ఆస్తులకు సంబంధించిన పేపర్లు.. 60 బ్యాంక్ ఖాతాల్ని గుర్తించారు. దీంతో..మరో ఆలోచన లేకుండా అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు.

బన్సాల్ అవినీతి మీద విచారణ చేయటం మొదలెట్టారు. ఇంత వరకూ కథ బాగానే నడిచినా.. ఇక్కడే తేడా కొట్టింది. అవినీతి సొమ్మును భారీగా వెనకేసుకొచ్చినప్పుడు లేని ఇబ్బంది అంతా ఆయన పట్టుబడి.. పది మందిలో పేరు నానేసరికి.. ఆయన ఫ్యామిలీ మొత్తానికి భారీ షాక్ తగిలింది. అవినీతి మరకమీద పడితే ఎంత దారుణంగా ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకున్న బన్సాల్ భార్య.. కుమార్తె ఆ అవమానాన్ని భరించలేక లంచం తీసుకుంటూ దొరికిన రెండో రోజునే సూసైడ్ చేసుకున్నారు. ఇది బన్సాల్ కు వ్యక్తిగతంగా తగిలిన భారీ షాక్. లంచం తీసుకుంటున్న కేసులో అరెస్ట్ కావటం లాంటివిమామూలే అయినా.. తాను చేసిన పాపాన్ని భరించలేక తన భార్య.. బిడ్డ సూసైడ్ చేసుకోవటం తట్టుకోలేకపోయారు. ఇటీవల (గత నెలలో) బెయిల్ మీద బయటకు వచ్చిన బన్సాల్.. తాజాగా ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. తనతో పాటు.. తన కుమారుడితో కలిసి బలవన్మరణానికి పాల్పడటం ఆయనపరిచయస్తులు.. స్నేహితులు.. బంధువులకే కాదు.. దేశ ప్రజలకు షాకింగ్ గా మారింది. బాగా బతికిన ఒక కుటుంబాన్ని అవినీతి ఎంత దారుణంగా హత్య చేసిందన్న విషయాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. ఢిల్లీలోని మధువిహార్ లో తన కుమారుడితో కలిసి బన్సాల్ ఉరి వేసుకున్న ఘటన ఇప్పుడు అందరినికదిలించేస్తుంది. అంత సున్నితమైన మనసు ఉన్నప్పుడు దరిద్రపు అవినీతికి దూరంగా ఉంటే బాగుండేది కదా. 
Tags:    

Similar News