జెండాల్లో జనం.. అజెండాల్లో నల్లధనం

Update: 2016-12-17 17:30 GMT
దేశమంతా నల్లధనంపై చర్చ జరుగుతున్న తరుణంలో రాజకీయ పార్టీల వద్ద ఉన్న నల్లధనంపై ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడడం సంచలనంగా మారింది. తెలంగాణ శాసనసభ సమావేశాల తొలిరోజున అక్బరుద్దీన్ ఈ అంశంపై మాట్లాడుతూ రాజకీయ పార్టీల వద్ద కూడా భారీగా నల్లధనం ఉందని ఆరోపించారు. ఒక రాజకీయ పార్టీలో కీలక నేత అయి ఉండి ఇలా పార్టీల అవినీతిపై అక్బర్ మాట్లాడడం నిజంగా సాహసమే. ఈ నేపథ్యంలో పార్టీల ఆస్తిపాస్తులేమిటి... వారు లెక్కలు చూపుతున్నారా... ఆదాయానికి దొంగ లెక్కలు ఎలా చూపిస్తున్నారన్నది తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.

నల్లధనానికి మూల కారణమవుతున్న అవినీతి వృక్షానికి రాజకీయాలు తల్లివేరు లాంటివి. దేశంలో 7 జాతీయ పార్టీలకు తోడు 50కి పైగా గుర్తింపు ఉన్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు లక్షలాదిమంది నాయకులున్నారు. అందరినీ ఒకే గాటన కట్టలేకపోయినా వారిలో అత్యధికులు రాజకీయ అధికారాన్ని - పరపతిని సొమ్ము చేసుకునే విద్యలో ఆరితేరిపోయినవారే. నేతలు ప్రజలను మభ్యపెట్టి - మాయచేసి తమకు ఓట్లేసేలా చేయడమే కాకుండా బహుమతులు - డబ్బు ఇచ్చి ఓట్లు పొందే ప్రయత్నం చేసేవారే. ఫలితం.. పంచాయతీ సర్పంచి నుంచి దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటులో సభ్యత్వం వరకు ప్రతి ఎన్నికలోనూ ధన ప్రవాహమే. రాష్ట్రాల్లో విధానమండలి - పార్లమెంటులో రాజ్యసభ సభ్యులుగా పోటీ చేసేవారూ భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. పార్టీలూ తమ ఖాతాల్లో భారీగా డబ్బు పోగు చేస్తున్నాయి. విరాళాలు - వసూళ్లతో కోట్లకు కోట్లు ఆదాయాన్ని కలిగి ఉంటున్నాయి.

పార్టీల డబ్బులో నలుపే ఎక్కువ..

* రాజకీయ పార్టీల ఆదాయంలో 75 శాతం లెక్కకు దొరకనివే.

* ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 13ఎ ప్రకారం రాజకీయ పార్టీలు రూ.20 వేలు కంటే ఎక్కువ మొత్తంలోని విరాళాలకే ఎక్కడి నుంచి వచ్చాయన్న లెక్క చూపాలి. ఆ విరాళమిచ్చిన వ్యక్తులు - సంస్థల పేర్లు - చిరునామాలు నమోదు చేయాలి. రూ.20 వేల కంటే తక్కువైతే రికార్డులకెక్కించాల్సిన అవసరం లేదు. దీంతో పార్టీలు విరాళాలను చిన్న మొత్తాలుగా పేర్కొంటూ లెక్క చూపడం లేదు.

* ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ వేయడానికి ముందు చేసే ఖర్చులూ లెక్కచూపాల్సిన పనిలేదు.

* ఖర్చు పరిమితి కూడా అభ్యర్థులకే తప్ప పార్టీలకు లేదు. దీంతో అభ్యర్థుల ఖర్చునే పార్టీల ఖాతాల్లో చూపుతారు.
పార్టీల వద్ద నల్లధనం..

* అన్ని పార్టీలకూ కూపన్ల విక్రయం (చందాలు) ద్వారా నిధులొస్తాయి. అవన్నీ రూ.20 వేల లోపు ధరలోనే ఉంటాయి.

* నేతలకు నోట్ల హారాల ద్వారానూ భారీగా సమకూరుతాయి. రూ.లక్షలు విలువ చేసే నోట్లను హారాలుగా కూర్చి నేతల మెడల్లో వేస్తుంటారు. వాటిని రూ.20 వేల కంటే తక్కువగానే పేర్కొంటారు.

* ఇలాంటి మొత్తాలన్నీ లెక్కకు చిక్కని నల్లధనమే.

* నల్లధనం నిరోధం పూర్తిస్థాయిలో జరగాలంటే పార్టీల ఆదాయ వెల్లడిలో రూ.20 వేల హద్దును చెరిపేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

ఏ పార్టీ దగ్గర ఎంతుంది?

2013-14 సంవత్సరానికి దేశంలోని జాతీయ పార్టీలు చూపించిన ఆదాయం రూ.1518 కోట్లు. అసలు లెక్క దీనికి పది రెట్లు అధికంగా ఉంటుంది.

- జాతీయ పార్టీల మొత్తం సంపదలో పార్టీలవారీగా లెక్కేస్టే బీజేపీదే 44 శాతం ఉంటుంది.

- కాంగ్రెస్ వాటా 39.4 శాతం

- సీపీఎం 8 శాతం..

- బీఎస్పీ 4.4 శాతం

- ఎన్సీపీ 3.7 శాతం

- సీపీఐ ఆస్తులు 0.2 శాతం

ఇక పార్టీలు ఆ డబ్బు ఎలా వచ్చిందన్న విషయంలోనూ ఎన్నో దాపరికాలు. రూ.20 వేల కంటే తక్కువ విరాళాలయితే ఎవరిచ్చారన్నది చెప్పాల్సిన అవసరం లేదు. అదే సాకుగా పార్టీలు దొంగ లెక్కలు చెబుతున్నాయి.

- పార్టీల ఆదాయంలో విరాళాల రూపంలో వస్తున్నవి 813.6 కోట్లు

- అందులో అజ్హాత దాతలు ఇచ్చినట్లుగా చెబుతున్నవి 565.8 కోట్లు

- అంటే 69.3 శాతం ఆదాయానికి ఆధారాలు చూపడం లేదన్నమాట.

- ఇక కూపన్ల విక్రయం ద్వారా వచ్చినట్లుగా చూపిస్తున్న ఆదాయం 485 కోట్లు

దొంగ లెక్కల్లో కాంగ్రెస్ టాప్..

అజ్హాత వ్యక్తుల నుంచి వచ్చిన ఆదాయం అధికంగా చూపే పార్టీల్లో కాంగ్రెస్ ముందువరుసలో ఉంది.

- కాంగ్రెస్ పార్టీకి 598.16 కోట్ల ఆదాయం ఉండగా అందులో 482 కోట్లు అంటే 80.6 శాతం రాబడికి లెక్కలు చూపడం లేదు.

- బీజేపీకి 673.8 కోట్ల ఆదాయం ఉండగా అందులో 67.5 శాతం అంటే 454.7 కోట్లకు లెక్కల్లేవు.

- సీపీఎం తన ఆదాయం 121.9 కోట్లలో 58.4 కోట్లకు లెక్క చూపడం లేదు.

- బీఎస్పీ 66.9 కోట్ల ఆదాయంలో 72.6 శాతం అంటే 48.6 కోట్లకు దొంగ లెక్కలే చెప్పింది.

- ఎన్సీపీ 55.4 కోట్లలో 15 శాతం ఆదాయం అంటే 8.3 కోట్లకు లెక్క చూపలేదు.

- సీపీఐ మాత్రం 2.4 కోట్ల ఆదాయంలో ఇలాంటి దొంగ లెక్కలేమీ చూపలేదు.

---- గరుడ

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News